bigg boss telugu 5: సన్నీని దోషిగా నిలబెట్టిన హౌస్‌.. కానీ చివర్లో అదిరే ట్విస్ట్‌

గత వారం రోజులుగా జరిగిన పరిణామాలపై బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జున పంచాయతీ మొదలు పెట్టారు. అంతకుముందు

Updated : 14 Nov 2021 07:04 IST

హైదరాబాద్‌: గత వారం రోజులుగా జరిగిన పరిణామాలపై బిగ్‌బాస్‌ హోస్ట్‌ నాగార్జున పంచాయతీ మొదలు పెట్టారు. అంతకుముందు హౌస్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. రవి కెప్టెన్‌ అయినందుకు అనీ మాస్టర్‌ సంబరాలు చేసుకున్నారు. ఇక సన్నీతో జరిగిన గొడవను సిరి జీర్ణించుకోలేకపోయింది. షణ్ముఖ్‌ ఒడిలో పడుకుని ఏడుస్తూ ‘అలా ఎలా అంటాడు’ అంటూ కన్నీటి పర్యంతమైంది. షణ్ముఖ్‌ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశాడు. మరోవైపు సన్నీ తన ప్రవర్తనపై స్నేహితులు మానస్‌, కాజల్‌, పింకీలతో చర్చ పెట్టాడు. సిరి తనని రెచ్చగొట్టాలని చూసిందని మధ్యలో షణ్ముఖ్ కలగజేసుకోవటం వల్లే తాను కొన్ని మాటలు అన్నానని సన్నీ చెప్పుకొచ్చాడు. మొదటి నుంచి తన విషయంలో సిరి ప్రవర్తన సరిగాలేదని అన్నాడు. ‘ఆడాళ్లను ముందు పెట్టి గేమ్‌ ఆడతావా’ అని పొరపాటున అనేశానని సన్నీ విచారం వ్యక్తం చేశాడు. దీనిపై షణ్ముఖ్‌తో మాట్లాడాలని ఉందని తెలిపాడు. అనంతరం, గార్డెన్‌ ఏరియాలో కూర్చొని ఉండగా, షణ్ముఖ్‌ను పలకరించే ప్రయత్నం చేసినా, అతడు ఏమీ పట్టనట్టు వెళ్లిపోయాడు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు కాజల్‌తో మాట్లాడనని, నామినేషన్స్‌లో తప్ప ఆమె ముఖం చూడనని అనీ మాస్టర్‌ ప్రతిజ్ఞ చేసింది.

మరింత దిగజారిన జెస్సీ ఆరోగ్యం

వర్టిగో సమస్యతో బాధపడుతున్న జెస్సీకి అది మరింత జఠిలమైంది. వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స చేయాలని సూచించారు. నాగార్జున కూడా జెస్సీతో మాట్లాడాడు. తుది నివేదిక వచ్చిన తర్వాత హౌస్‌లోకి వెళ్లాలా? వద్దా? అన్న విషయం చెబుతానని నాగార్జున అనడంతో జెస్సీ సరే అన్నాడు.

బిగ్‌బాస్‌ ఇంటి సభ్యుల ఎఫ్‌ఐఆర్‌.. ఇవీ ఆరోపణలు

ఈ వారం జరిగిన పరిణామాలపై నాగార్జున ఎఫ్‌ఐఆర్‌ పేరుతో పంచాయతీ మొదలు పెట్టాడు. ఎవరి ఆరోపణలు ఏంటి? అని అడిగిన నాగార్జున తీర్పు చెప్పాల్సింది పోయి, మిగిలిన ఇంటి సభ్యులు ఏం అనుకుంటున్నారో YES/NO చెప్పాలని వాళ్లనే అడగటం గమనార్హం. అనీ మాస్టర్‌ తనని నాగినీ అంటోందని కాజల్‌ చెప్పినా నాగార్జున పట్టించుకోలేదు. సన్నీ ప్రవర్తన సరిగా లేదని రవి అతడిని జైలులో వేశాడు. ‘తంతా’, ‘అప్పడం అయిపోతావ్‌’, ‘అమ్మేస్తా’ అన్న పదాలపై ఇంటి సభ్యుల మధ్య తీవ్ర చర్చ జరిగింది. ఆ పదాలను తప్పు అర్థాలుగా మార్చుకుని సమస్యను మరింత జఠిలం చేశారని కాజల్‌ చెప్పే ప్రయత్నం చేసినా, నాగార్జున ఎదురు ప్రశ్నించడంతో ఆమె మాట్లాడకుండా ఉండాల్సి వచ్చింది.

షణ్ముఖ్‌, సిరిలు కూడా సన్నీపై తీవ్ర ఆరోపణలు చేసి అతడిని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. నాగార్జున కూడా ఆ ఒకట్రెండు పదాలను పట్టుకుని ‘నువ్వు అన్నావా? అనలేదా’ అంటూ సన్నీకి, అతడికి సపోర్ట్‌గా మాట్లాడిన వాళ్లకు మాట్లాడే ఛాన్స్‌ ఇవ్వలేదు. ‘ఆడాళ్లను పెట్టుకుని గేమ్‌ ఆడుతున్నావు’ అని షణ్ముఖ్‌ను అన్నందుకు సన్నీ సారీ చెప్పడంతో ఆ వివాదం సద్దుమణిగింది. దీంతో టాస్క్‌లో ఆవేశపడి నోరు జారిన సన్నీని మెజార్టీ సభ్యులు దోషిగా తేల్చి గిల్టీ బోర్డు తగిలించారు. సన్నీపై ఇంటి సభ్యులు చేసిన ఆరోపణలు సమర్థించిన నాగార్జున చివర్లో మాత్రం ‘గేమ్‌ బాగా ఆడావు’ అంటూ సన్నీ కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేశాడు. ఈ పంచాయతీ మొత్తంలో కాజల్‌ చాలా యాక్టివ్‌గా ఉంది. నాగార్జున కన్నా కూడా ఎక్కువగా సమస్యను విడమరిచి చెప్పే ప్రయత్నం చేసింది.

కేకు తినే అర్హత ఎవరికి ఉందంటే?

బిగ్‌బాస్‌ పంపిన కేకును తినే అర్హత ఎవరికి ఉంది? అన్న ఎపిసోడ్‌ను పునరావృతం చేస్తూ, నాగార్జున నవ్వులు పంచే ప్రయత్నం చేశారు. ప్రతిదీ అతిగా ఆలోచించి బుర్ర పాడుచేసుకోవద్దని, ధైర్యంగా ముందడుగు వేయాలని నాగార్జున ఇంటి సభ్యులకు చెప్పారు. అలా ధైర్యంగా ముందుకు వెళ్లే వాళ్లే విజయం సాధిస్తారని హితవు పలికారు. ‘ఎవరు కేకు తింటే వాళ్లకే అర్హత ఉంది’ అంటూ నాగార్జున చెప్పారు. ఇంటి సభ్యులందరూ సన్నీని దోషిగా నిలబడితే, అభిమానులు ఓట్ల రూపంలో అతడిని సేవ్‌ చేశారు. ఈ వారం సన్నీ మొదట సేవ్‌ అయ్యాడు. మరి నామినేషన్స్‌లో ఉన్న మిగిలిన వారిలో ఎవరు సేవ్‌ అవుతారు? ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్నది తెలియాల్సి ఉంది.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు