Biggboss Season5: బెస్ట్‌ పెర్ఫార్మర్‌గా మానస్‌.. జైలుకెళ్లిన జెస్సీ

టాస్క్‌లో గెలిచి నూతన కెప్టెన్‌గా శ్రీరామచంద్ర బాధ్యతలు స్వీకరించాడు. కెప్టెన్సీ టాస్క్‌ ముగిసిన తర్వాత బెస్ట్‌‌, వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు సూచించాడు....

Published : 02 Oct 2021 08:40 IST

హైదరాబాద్‌: టాస్క్‌లో గెలిచి నూతన కెప్టెన్‌గా శ్రీరామచంద్ర బాధ్యతలు స్వీకరించాడు. కెప్టెన్సీ టాస్క్‌ ముగిసిన తర్వాత బెస్ట్‌‌, వరెస్ట్‌ పెర్ఫార్మర్‌ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్‌ ఇంటి సభ్యులకు సూచించాడు. ‘నెగ్గాలంటే తగ్గాల్సిందే’ టాస్క్‌లో అత్యధికంగా ఆరు కేజీల బరువు తగ్గిన మానస్‌ను ఇంటి సభ్యులు బెస్ట్‌ ఫెర్ఫార్మర్‌గా ఎంచుకున్నారు. గతవారం కెప్టెన్‌గా విఫలమైన జశ్వంత్‌కి వరెస్ట్ ఫెర్ఫార్మర్‌గా ఎక్కువ ఓట్లు పడ్డాయి. దీంతో ఆయన జైలుకెళ్లాడు.

నటరాజ్‌పై రవి ఫైర్‌

ఉదయం నిద్రలేవగానే నటరాజ్‌-లోబోలు గార్డెన్‌ ఏరియాలో కబుర్లు చెప్పుకుంటూ ఉండగా.. హుడీ వేసుకున్న రవి నెమ్మదిగా నడుచుకుంటూ అటుగా వచ్చాడు. ‘రవి నడిచి వస్తుంటే నత్తలా ఉంది’ అని లోబో ఎదుట నటరాజ్‌ మాస్టర్‌ సరదాగా కామెంట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న రవి.. నటరాజ్‌ మాస్టర్‌ తనని బాగా ఇరిటేట్‌ చేస్తున్నాడని.. అడవిలో ఉన్న జంతువుల పేర్లన్నీ తనకే పెడుతున్నారని.. లోబో వద్ద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఈసారి పేర్లు పెడితే ఊరుకోను. ఆయన ఏమైనా కామెంట్‌ చేయాలి అనుకుంటే నా ముందుకు వచ్చి చేయమని చెప్పు. నేను ఇలా అన్నానని నటరాజ్‌ మాస్టర్‌కి చెప్పు’ అని లోబోకు చెప్పాడు.

బిబి షోలో అదరగొట్టిన సన్నీ-శ్రీరామచంద్ర

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్లేబాయ్‌గా అలరిస్తున్నాడు శ్రీరామచంద్ర. తాజాగా కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచి ఇంటి కొత్త కెప్టెన్‌ అయ్యాడు. ఈ సందర్భంగా బిగ్‌బాస్‌ ‘బిబి షో’ పేరుతో ఇచ్చిన టాస్క్‌లో ఇంటి సభ్యులందరూ పాల్గొన్నారు. సిరి.. హమీదాల్లో ఎవరిని ఎంచుకుంటారు?అని శ్రీరామచంద్రను హౌస్‌మేట్స్‌ ప్రశ్నించగా, లంచ్‌కు సిరి.. డిన్నర్‌కు హమీదాను ఎంచుకుంటానని చెప్పాడు. మరి టిఫిన్‌కు ఎవరు?అని ప్రశ్నించగా, శ్రీరామ్‌ నవ్వాపుకోలేకపోయాడు. హౌస్‌మేట్స్‌ ఎలా మాట్లాడతారు? ఎలా ప్రవర్తిస్తారు? అన్న దాన్ని అనుకరించి చూపించాడు సన్నీ విజయ్‌. ‘సిరి.. దీన్ని వ్యక్తిగతంగా తీసుకోవద్దు’ అని కోరగా, ‘సోమవారం నామినేషన్స్‌లో చూసుకుందాం’ అంటూ సిరి సమాధానంతో సన్నీ షాకయ్యాడు.

ఇక లోబో, ప్రియాంకల మధ్య ‘ఖుషి’ సినిమాలోని నడుము సీన్‌ రిపీట్‌ చేశారు. బుద్ధిగా చదువుకుంటున్నట్టు కనిపిస్తూనే ప్రియాంక వైపు లోబో ఓరగా చూస్తాడు. అంతే ‘లోబో.. నీ చూపు సరిగా లేదు’ అంటూ భూమికలా ప్రియాంక కస్సుమంది. ఈ మొత్తం బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారం ఎనిమిది మంది నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు మొదట సేవ్‌ అవుతారో తెలియాలంటే శనివారం ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని