Rajamouli: అయాన్‌ని చూసి.. నాకంటే పిచ్చోడు అనుకున్నా: రాజమౌళి

బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమా మోషన్‌ పోస్టర్‌ శనివారం ఉదయం విడుదలైంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం....

Updated : 18 Dec 2021 18:29 IST

బ్రహ్మాస్త్ర ప్రెస్‌మీట్‌ విశేషాలివే..

హైదరాబాద్‌: బాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ శనివారం ఉదయం విడుదలైంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. సినిమా గురించి నాగార్జున, రాజమౌళి, అయాన్‌ ముఖర్జీ, ఆలియా భట్‌, కరణ్‌ జోహార్‌ పంచుకున్న విశేషాలివే..

‘‘బ్రహ్మాస్త్ర’ సినిమా చేస్తున్నాం. అయాన్‌ ముఖర్జీ డైరెక్టర్‌. అతడు మిమ్మల్ని ఒకసారి కలవాలనుకుంటున్నాడు.. అని మూడేళ్ల క్రితం కరణ్‌జోహార్‌ నాకు ఫోన్‌ చేసి చెప్పారు. నేను ఓకే అనడంతో అయాన్‌ హైదరాబాద్‌ వచ్చి నన్ను కలిశారు. అయాన్‌తో మాట్లాడినప్పుడు సినిమా పట్ల అతడికున్న ప్రేమ చూసి.. ‘ఇతనెవరో నాకంటే పిచ్చోడులా ఉన్నాడు’ అనుకున్నా. ఎందుకంటే అతడికి సినిమాపై నాకంటే ఎక్కువ ఇష్టం ఉంది. ఆ తర్వాత ‘బ్రహ్మాస్త్ర’ గురించి సీరియస్‌గా ఆలోచించాను. అయాన్‌ ఒక బ్రహ్మాండాన్ని క్రియేట్‌ చేస్తున్నారని అర్థమైంది. దాంతో ఈ ప్రాజెక్ట్‌లో నేను కూడా భాగం కావాలని నిర్ణయించుకున్నాను. దక్షిణాది భాషల్లో ‘బ్రహ్మాస్త్ర’ని సమర్పిస్తున్నాను’’- రాజమౌళి

‘‘దక్షిణాదిలో ఈ చిత్రాన్ని మీరు సమర్పించడం నాకెంతో ఆనందంగా ఉంది. మన దేశంలో నంబర్‌-1 డైరెక్టర్‌ మీరే. ఎన్నో ఏళ్ల నుంచి మేము ఈ చిత్రాన్ని చేస్తున్నాం. మునుపెన్నడూ చూడని ఓ సరికొత్త అనుభూతిని ప్రేక్షకులకు అందించడం కోసమే కష్టపడుతున్నాం. ఈ సినిమా విషయంలో నాగార్జున మాకెంతో సపోర్ట్‌ చేశారు. ఇక నా కెరీర్‌ ప్రారంభమైనప్పటి నుంచి నన్ను ప్రోత్సహిస్తున్న వ్యక్తి కరణ్‌ జోహార్‌.’’ - దర్శకుడు అయాన్‌ ముఖర్జీ

‘‘అయాన్‌ నా పెద్ద కొడుకులాంటి వాడు. మా ధర్మా ప్రొడక్షన్‌కి సీక్రెట్‌ బ్రహ్మాస్త్ర అతడు. ఈ సినిమా కోసం ఎంతో శ్రమిస్తున్నాడు. అతడి కలను సాకారం చేయడం కోసం టీమ్‌ మరెంతో కష్టపడుతోంది. రణ్‌బీర్‌‌ ఏడేళ్ల నుంచి ఈ సినిమా కోసం పనిచేస్తున్నాడు. ఆలియా నా బేబీ గర్ల్‌. తను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో ఉన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నా. ‘ఈగ’ సినిమా చూసి థియేటర్‌లో చప్పట్లు కొట్టాను. ఈగతోనే ఇన్ని అద్భుతాలు చేశాడంటే మనుషులతో ఇంకెన్ని అద్భుతాలు చేస్తారో అనుకున్నా.. ఆ సమయంలో ‘బాహుబలి’ వచ్చింది. హిందీలో ఆ సినిమా విడుదల చేసేందుకు నాకు అవకాశం ఇవ్వండి సర్‌ అని అడిగాను. ఆయన ఓకే అన్నారు. అలా ఆ చిత్రాన్ని బాలీవుడ్‌లో నేను విడుదల చేశా’’ - కరణ్‌జోహార్‌

ఈ సినిమాలో మీరు విష్ణుమూర్తి పాత్ర చేశారని బయట టాక్‌.. అందులో నిజమెంత?

నాగార్జున: అసలు ఈ వార్తలు ఎలా బయటకు వచ్చాయో తెలీదు. కానీ నా పాత్ర గురించి ఇప్పుడే చెప్పలేను. సినిమా విడుదలైనప్పుడు మీకే తెలుస్తుంది. 

చాలా సంవత్సరాల తర్వాత హిందీలో చేయడం ఎలా ఉంది?

నాగార్జున: సినిమా ఎక్కడైనా సినిమానే. మనుషులు ఎక్కడైనా మనుషులే. ఏమీ తేడా లేదు. మంచి టీమ్‌తో కలిసి పనిచేశాననే సంతృప్తి ఉంది. 

పాన్‌ ఇండియా సినిమాలు వస్తున్నాయి.. పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఒకే సినిమాలో నటిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం?

నాగార్జున: వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులందరూ కలిసి పనిచేయడం ఆనందించాల్సిన విషయం. ఇది కేవలం ఇండియాలోనే కాదు. గ్లోబల్‌ సినిమాలో కూడా ఇలాగే చేస్తున్నారు. హాలీవుడ్‌ చిత్రాల్లో మన ఇండియన్‌ నటీనటుల్ని కూడా భాగం చేస్తున్నారు. భాషలు వేరైనా సినిమా అంటే ఒక్కటే అని ‘బాహుబలి’తో నిరూపితమైంది.

రాజమౌళి: బ్రహ్మాస్త్ర రఫ్‌ ఫుటేజీ చూశాను. అందులోని కొన్ని సీన్స్‌లో నాగార్జునని చూపినట్లు నాకు అనిపించలేదు. కరెక్ట్‌ టైమ్‌లో మంచి పాత్ర వచ్చింది అనుకున్నా. అందులోనే అయాన్‌ సక్సెస్ అయ్యాడు. కథకు తగ్గ నటుల్ని ఎంచుకోవడం ఉత్తమం అని నేను నమ్ముతాను. అయాన్‌ అదే చేశాడు అనుకుంటున్నా. 

ఫస్ట్‌ టైమ్‌ రణ్‌బీర్‌-ఆలియా కలిసినప్పుడు వాళ్లు మిమ్మల్ని అడిగిన ప్రశ్నలు ఏమిటి?

నాగార్జున: అప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తులేదు. నాకు జ్ఞాపకశక్తి తక్కువ. (మధ్యలో రాజమౌళి అందుకుని నాగ్‌ని ఎవరు కలిసినా మొదటి ప్రశ్న.. ‘మీరు ఇంత యంగ్‌గా ఎలా ఉన్నారు?’ అనే. వాళ్లు కూడా అదే అడిగి ఉంటారు అనడంతో నాగార్జున నాకు తెలిసి ఇదొక ప్రశ్న వాళ్లు నన్ను ఎక్కువగా అడిగారు)

రాజమౌళి: ఒక యాక్టర్‌గా మీరు సీన్స్‌కి అనుగుణంగా చేస్తారా? లేదా డైరెక్టర్‌ చెప్పినట్లు చేస్తారా? 

నాగార్జున: డైరెక్టర్‌ని నేను నమ్ముతాను. ఆయన చెప్పినట్లు చేస్తా.

పాన్‌ ఇండియా చేస్తున్నప్పుడు ఒత్తిడికి గురయ్యారా?

నాగార్జున: పాన్‌ ఇండియా కాదు.. పాన్‌ వరల్డ్‌ అని చెప్పండి. నేను ఎలాంటి ఒత్తిడికి గురి కాలేదు. ఇష్టపడి పనిచేస్తే ఎలాంటి కష్టం ఉండదు. అదే జరిగింది.

రణ్‌బీర్‌.. మీరు తెలుగు సినిమాలో నటిస్తారా?

రణ్‌బీర్‌: తెలుగు, తమిళంలో కూడా చేయాలని ఉంది. మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా. భాష నేర్చుకుని, సినిమా చేస్తా.

బ్రహ్మాస్త్ర స్క్రిప్ట్‌లో మీరు ఏమైనా మార్పులు సూచించారా?

రాజమౌళి: నన్ను కలిసే సమయానికే అయాన్‌ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ స్క్రిప్ట్‌తో సిద్ధంగా ఉన్నాడు. ఇది మూడు భాగాల సినిమా. మొదటి భాగం నాకెంతో నచ్చింది. ఎలాంటి మార్పులూ సూచించలేదు. కానీ దాని తర్వాత వచ్చే భాగాలకు సంబంధించి చిన్న చిన్న సలహాలు ఇచ్చాను.

ఇంతమంది స్టార్స్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

ఆలియా: ‘బ్రహ్మాస్త్ర’లో భాగమైనందుకు అదృష్టవంతురాలిగా భావిస్తున్నా.

Read latest Cinema News and Telugu News



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు