
Bro: నేను ఉన్నంత వరకూ నువ్వు ఎప్పటికీ ఒంటరి కాదు: అవికాగోర్
హైదరాబాద్: ‘‘అన్నయ్యా.. నేను ఉన్నంతవరకూ నువ్వు ఎప్పుడూ ఒంటరి కాదు. నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి. దాని కోసం నేను ఏదైనా చేస్తాను. ఏమైనా దాటి వస్తాను’’ అని అంటున్నారు నటి అవికాగోర్. ఆమె, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రో’. అన్నాచెల్లెల అనుబంధంపై తెరకెక్కిన ఓ ముచ్చటైన కుటుంబకథా చిత్రమిది. కార్తిక్ తుపురాని దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్ 26న సోనీ లివ్ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ‘బ్రో’ ట్రైలర్ విడుదలైంది.
అన్నాచెల్లెల్లుగా నవీన్ చంద్ర, అవికాగోర్ నటన మెప్పించేలా ఉంది. ‘‘ఎందుకో తెలీదు నాకు బాగా ఇష్టమైనవన్నీ ఎప్పుడూ నాకు దూరమయ్యాయి. ఎటు చూసినా ఒక్కటే దొరికేది.. ఒంటరితనం’’ అంటూ నవీన్చంద్ర చెప్పే డైలాగ్లతో ప్రారంభమైన ట్రైలర్లోని ప్రతి సన్నివేశం సహజత్వానికి దగ్గరగా ఉంది. ‘‘ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, వేసుకోవడానికి బట్టలతోపాటు వైఫై కూడా అత్యవసరాల్లో ఒకటి బ్రో’’ అంటూ అవికా.. తన అన్నయ్యని ఆటపట్టించడం సరదాగా అనిపించింది. జేజేఆర్ రవి చంద్ ఈ చిత్రానికి నిర్మాత.