Sirivennela: ఎప్పుడూ ‘మిత్రమా’ అని పిలిచేవారు: చిరంజీవి

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఫిలింఛాంబర్‌లో ఆయన పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు.

Updated : 01 Dec 2021 12:09 IST

హైదరాబాద్‌: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయానికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. ఫిలింఛాంబర్‌లో ఆయన పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి అంజలి ఘటించారు. అగ్ర కథానాయకులు నటులు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్‌, అల్లు అర్జున్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీతారామశాస్త్రితో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. 

సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు: చిరంజీవి

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి చాలా చాలా దురదృష్టకరమని చిరంజీవి అన్నారు. ఆయనతో చివరిసారిగా మాట్లాడిన వ్యక్తిని తానేనని.. ఆ తర్వాత ఫోన్‌ ఆఫ్‌ చేసి ఆస్పత్రిలో చేరారని చెప్పారు. మంచి చికిత్స కోసం చెన్నై తీసుకెళ్తానని కూడా చెప్పానని చిరంజీవి అన్నారు. ‘‘ఇద్దరం ఒకే సంవత్సరంలో పుట్టాం. ఎప్పుడూ నన్ను ‘మిత్రమా’ అని పిలిచేవారు. బాలుగారు, సిరివెన్నెల చనిపోవటం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. మంచి మిత్రుడిని కోల్పోయా. సిరివెన్నెల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. ఆయన జ్ఞాపకార్థం తప్పకుండా ఏదో ఒక కార్యక్రమం చేస్తాం’’ అని చెప్పారు. 

తెలుగు భాషకు, సాహిత్యానికి ‘సిరివెన్నెల’ ఆభరణం: బాలకృష్ణ

పుట్టిన జాతికి ఎవరైతే కీర్తి తెస్తారో వారు ఉన్నా, లేకున్నా చిరస్థాయిగా నిలిచిపోతారని.. అలాంటి వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని బాలకృష్ణ అన్నారు. తెలుగు భాష, సాహిత్యానికి ఆభరణంలాంటి వ్యక్తి సిరివెన్నెల అని కొనియాడారు. తాను నటించిన ‘జననీ జన్మభూమి’ చిత్రంతో ఆయన సినీ రంగ ప్రవేశం చేయడం తన పూర్వ జన్మ సుకృతమని చెప్పారు. సిరివెన్నెల లేరనే వార్తతో చలనచిత్ర పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయిందన్నారు. తామిద్దం కలిసినప్పుడల్లా సాహిత్యం గురించే మాట్లాడుకునేవాళ్లమని.. ఆయన నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని బాలకృష్ణ అన్నారు.

ఓ లెజెండ్‌ను కోల్పోయాం: వెంకటేశ్‌

సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతితో సాహిత్యరంగంలో ఓ లెజెండ్‌ను కోల్పోయామని వెంకటేశ్‌ అన్నారు. తన కెరీర్‌ తొలినాళ్ల నుంచి సిరివెన్నెలతో కలిసి పనిచేశానని చెప్పారు. స్వర్ణకమలం నుంచి నారప్ప వరకు ఆయనతో ఎంతో సన్నిహితంగా ఉండేవాడినని గుర్తు చేసుకున్నారు. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

ఒక వటవృక్షం కూలిపోయింది.. ఇక అంతా శూన్యమే: తనికెళ్ల భరణి

సిరివెన్నెల మృతితో ఒక వటవృక్షం కూలిపోయిందని.. ఇక అంతా శూన్యమేనని ప్రముఖ రచయిత, నటుడు తనికెళ్ల భరణి అన్నారు. తామిద్దం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చామని గుర్తుచేసుకున్నారు. స్రవంతి మూవీస్‌లో కలిసి పనిచేశామని.. రాత్రింబవళ్లూ అక్కడే ఉండేవాళ్లమన్నారు. ప్రతి పాటకు 15 వెర్షన్లు ఎందుకంటే నవ్వేవాడన్నారు. ప్రతి పదాన్ని చెక్కేవాడని తనికెళ్ల భరణి గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. తెలుగు జాతి ఉన్నంతవరకూ సిరివెన్నెల పాటల ప్రకాశం ఉంటుందని చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని