Chiranjeevi: మా ఇద్దరిదీ గురుశిష్యుల అనుబంధం: చిరంజీవి

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో హోమియోపతి వైద్య కళాశాలను సందర్శించారు...

Updated : 01 Oct 2021 19:17 IST

రాజమహేంద్రవరం‌: ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి అని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. అల్లు రామలింగయ్య శత జయంతిని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో హోమియోపతి వైద్య కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. అల్లు రామలింగయ్యని మొదటిసారి రాజమండ్రిలోనే కలిశానని గుర్తుచేసుకున్నారు. తమ మధ్య గురుశిష్యుల అనుబంధం ఉందని తెలిపారు.

‘‘మా ఇద్దరి మధ్య గురుశిష్యుల అనుబంధం ఉంది. సినిమాల్లో ఆయన హాస్యాన్ని పండించారు. కానీ.. రియల్‌ లైఫ్‌లో మాత్రం జీవితాన్ని ఎంతో సీరియస్‌గా తీసుకున్నారు. గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, హోమియోపతి.. ఇలా ఎన్నో గొప్ప విషయాల గురించి ఆయన నాతో చెప్పేవారు. ముఖ్యంగా హోమియోపతి గురించి ఆయన నాకు ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు. నటుడిగా బిజీగా ఉన్నప్పటికీ హోమియోపతి మీద ఉన్న ఆసక్తితో అందులో శిక్షణ తీసుకుని ఆర్‌ఎంపీ పట్టా పొందారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. నిత్యవిద్యార్థి. అలాగే, ఆయన ఏదైనా అనుకుంటే పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు. చిన్న ఊరిలో జన్మించినా.. సినిమా పరిశ్రమలోకి వచ్చి హాస్యనటుడిగా అనుకున్నది సాధించి పద్మశ్రీ పొందారంటే ఆయన పట్టుదల ఆషామాషీ కాదు. ఆయన నాకు ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత. నటుడిగా నా ప్రయాణం మొదలైంది రాజమండ్రి గడ్డమీదనే. ‘పునాదిరాళ్లు’తోపాటు చాలా సినిమా షూటింగులు ఈ జిల్లాలోనే జరిగాయి. ‘మన ఊరి పాండవులు’ సినిమా షూటింగ్‌ సమయంలో మొదటిసారి అల్లు రామలింగయ్య గారిని కలిశాను. అప్పుడే ఆయన ఫిక్స్ అయిపోయినట్లు ఉన్నారు నన్ను తన అల్లుడిగా చేసుకోవాలని. అలా మా ఇద్దరి మధ్య ఎంతో చక్కని అనుబంధం ఉంది. నిజం చెప్పాలంటే ఇప్పటికీ మేము హోమియోపతి మందులనే ఎక్కువగా వాడుతుంటాం’’ అని చిరంజీవి వివరించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని