MAA Elections: ఓటు వేశాక చిరంజీవి, బాలకృష్ణ ఏమన్నారంటే..!

‘మా’ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. సినీ ప్రముఖులంతా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

Updated : 10 Oct 2021 12:04 IST

హైదరాబాద్‌: ‘మా’ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. సినీ ప్రముఖులంతా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అగ్రకథానాయకులు చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌కల్యాణ్‌, రామ్‌చరణ్‌ తదితరులు ఓటు వేశారు. ఈ సందర్భంగా చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ వేర్వేరుగా మీడియాతో మాట్లాడారు.

పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు: చిరంజీవి

తన అంతరాత్మ ప్రబోధానికి అనుగుణంగా ఓటు వేశానని చిరంజీవి చెప్పారు. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని.. అన్నిసార్లు ఇదే స్థాయిలో వాడీవేడిగా ఎన్నికలు జరగుతాయని అనుకోవడం లేదన్నారు. భవిష్యత్‌లో ఇలా జరగకుండా తమ ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ‘మా’ ఎన్నికల్లో ఓటు వేయకపోవడం వాళ్ల వ్యక్తిగత విషయమని.. అది వాళ్ల విజ్ఞతకు వదిలేస్తున్నట్లు తెలిపారు. కొందరు షూటింగ్స్‌లో బిజీగా ఉండటం వల్ల ఓటు వేయలేకపోవచ్చని.. దాని గురించి ప్రత్యేకంగా తాను మాట్లాడనన్నారు.

వారిద్దరూ అన్నదమ్ముల్లాంటివారు: బాలకృష్ణ

‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణులు అన్నదమ్ముల్లాంటి వారని అగ్ర కథానాయకుడు బాలకృష్ణ అన్నారు. ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశానని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రెండు ప్యానెళ్ల ఉత్సాహం చూస్తుంటే ఇండస్ట్రీకి మంచి చేసేటట్లు కనిపించారు. ఇరు ప్యానెల్స్‌లో ఎవరు మంచి చేస్తారో వారికే ఓటు వేశా. ఏదేమైనా అధ్యక్షులుగా నిలబడిన ప్రకాశ్‌రాజ్‌, మంచు విష్ణు ఇద్దరూ ఇండస్ట్రీకి అన్నదమ్ముల్లాంటి వారే. ఇద్దరూ మాటలు చెప్పేవాళ్లు కాదు.. చేసేవాళ్లే. షూటింగ్స్‌లో అందరం కలిసి కట్టుగా పనిచేసుకుంటాం. ‘మా’ అంతిమ లక్ష్యం నటీనటుల సంక్షేమం. ఎవరు గెలిచినా వారి వెనుక నిలబడి ప్రోత్సాహం అందిస్తాం’’ అన్నారు.

రాజకీయాలపై ‘మా’ ప్రభావం ఉండదు: పవన్‌

తాను ఎవరికి మద్దతుగా నిలిచానో చెప్పడం ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అన్నయ్య చిరంజీవి, మోహన్‌బాబు స్నేహితులని, రాజకీయాలపై ‘మా’ ఎన్నికలు ఎలాంటి ప్రభావం చూపవని పునరుద్ఘాటించారు. ‘మా’ ఎన్నికల్లో ఇంత హడావుడి అవసరం లేదన్నారు. ఈ ఎన్నికల వల్ల సినీ ఇండస్ట్రీ చీలిపోవడమనేది ఉండదని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని