MAA Elections: పదవులు తాత్కాలికం.. ‘మా’ ఎన్నికలపై చిరు సంచలన కామెంట్స్‌

‘మా’ ఎన్నికలపై చిరంజీవి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు....

Updated : 30 Aug 2022 15:56 IST

హైదరాబాద్‌: ‘మా’ ఎన్నికలపై ప్రముఖ నటుడు చిరంజీవి స్పందించారు. ‘పెళ్లి సందD’ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి వెంకటేశ్‌తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రోషన్‌, శ్రీలీల జంటగా గౌరి రోణంకి రూపొందించిన ఈ చిత్రానికి రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. అక్టోబరు 15న ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుకని నిర్వహించింది.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ... ‘1996లో జరిగిన ‘పెళ్లిసందడి’ 175రోజుల విజయోత్సవానికి నేనే ముఖ్య అతిథిని. ఆ సమయంలో నేను కెరీర్‌ పరంగా కాస్త నిరూత్సాహంలో ఉన్నాను. ఆ వేడుకకి వెళ్లి చిత్ర బృందాన్ని, అభిమానుల కేరింతలు చూడగానే మనకు తిరుగులేదు అనిపించింది. కొత్త జోష్ వచ్చింది.  ఇప్పటికీ ఆ జోష్‌ తగ్గలేదు. మళ్లీ ఇన్నేళ్లకి ఈ ‘పెళ్లి సందడి’ వేడుకకి ఆహ్వానించిన రాఘవేంద్రరావుకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఆయనెంత ప్రేమ, ఆప్యాయత చూపించారో మీరూ (అభిమానులు) అంతే చూపించారు. మీ రుణం తీర్చుకోలేనిది. రాఘవేంద్రరావుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన దర్శకత్వంలో నటిస్తేనే కానీ సుస్థిర స్థానం ఉండదనేది అప్పట్లో మా అందరి అభిప్రాయం. ఆ అవకాశం రావాలని, అది నా కెరీర్‌కి పునాది కావాలని బలంగా కోరుకున్న సమయంలో ‘అడవి దొంగ’ వచ్చింది’ అని తెలిపారు.

‘మా’ ఎన్నికలపై కామెంట్‌..

‘‘నారప్ప’ నాకు బాగా నచ్చింది. ఆ సినిమా చూసిన వెంకటేశ్‌ని అభినందించాను. తనకి నేను నటించిన ‘సైరా’ బాగా నచ్చి, నన్ను మెచ్చుకున్నాడు. అందరి హీరోల మధ్య ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటే పరిశ్రమలో వివాదాలు, కొట్టుకోవడం, ఒకరినొకరు మాటలు అనడం, అనిపించుకోవడం ఉండదు కదా. ఏదైనా తాత్కాలికమే. అవి రెండేళ్లుంటాయా? మూడేళ్లుంటాయా? నాలుగేళ్లుంటాయా? పదవులు అనేవి చిన్న చిన్న బాధ్యతల్లాంటివి. వాటి కోసం మనం మాటలు అనడం, అనిపించుకోవడం చూస్తుంటే బయటవారికి ఎంత లోకువ అయిపోతాం? పదవి కోసం అంత లోకువ అవ్వాలా? అది నాకు బాధగా ఉంది.  నేను ఏ ఒక్కరినీ వేలు పెట్టి చూపించడం లేదు. మన ఆధిపత్యం చూపించుకునేందుకు ఎదుటవారిని కించపరచాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడ ప్రారంభమైందో గుర్తుంచుకోండి. ఎవరి కారణంగా ఈ వివాదాలు మొదలయ్యాయో ఆలోచించండి. అలాంటి వ్యక్తిని దూరంగా ఉంచితేనే వసుధైక కుటుంబం అవుతుంది’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని