Chiranjeevi: చిరు మాటలతో సత్యనారాయణ చిరునవ్వు.. ట్వీట్‌ చేసిన అగ్రకథానాయకుడు

తీవ్ర అస్వస్థతకు గురై శనివారం ఉదయం అపోలో ఆస్పత్రిలో చేరిన సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అగ్రకథానాయకుడు చిరంజీవి...

Updated : 21 Nov 2021 12:52 IST

హైదరాబాద్‌: తీవ్ర అస్వస్థతకు గురై శనివారం ఉదయం అపోలో ఆస్పత్రిలో చేరిన సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిపై అగ్రకథానాయకుడు చిరంజీవి స్పందించారు. సత్యనారాయణతో తాను ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. తన మాటలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారని చెప్పారు. ఈ మేరకు చిరంజీవి తాజాగా ఓ ట్వీట్‌ చేశారు.

‘‘ఐసీయూలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ స్పృహలోకి వచ్చారని తెలియగానే క్రిటికల్‌ కేర్‌ డాక్టర్‌ సుబ్బారెడ్డి సహాయంతో ఆయనతో ఫోన్‌లో మాట్లాడాను. ఆయన త్వరితగతిన కోలుకుంటారన్న పూర్తి నమ్మకం ఆ క్షణం నాకు కలిగింది. ట్రాకియాస్టోమి కారణంగా ఆయన మాట్లాడలేకపోయినా, ‘‘త్వరలో మీరు ఇంటికి తిరిగి రావాలి, అందరం కలిసి సెలబ్రేట్‌ చేసుకోవాలి’’ అని నేను అన్నప్పుడు ఆయన నవ్వుతూ థంబ్స్‌అప్‌ సైగ చేసి, థ్యాంక్యూ అని చూపించినట్టుగా డాక్టర్‌ సుబ్బారెడ్డి నాతో చెప్పారు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తూ, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులందరితో ఈ విషయం పంచుకోవడం ఎంతో సంతోషంగా ఉంది’’ అని చిరంజీవి పేర్కొన్నారు.

చిరంజీవికి సత్యనారాయణతో మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. చిరు కథానాయకుడిగా నటించిన చాలా సినిమాల్లో సత్యనారాయణ కీలక పాత్రలు పోషించారు. ‘యముడికి మొగుడు’, ‘గ్యాంగ్‌లీడర్‌’, ‘బావగారూ బాగున్నారా’ వంటి సినిమాల్లో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని