Maha Samudram: అలాంటి పాత్రలు నా సినిమాల్లో ఉండవు: అజయ్‌ భూపతి

డైరెక్టర్‌ అజయ్‌ భూపతి ఇంటర్వ్యూ. సిద్ధార్థ్‌, శర్వానంద్‌ హీరోలుగా ఆయన తెరకెక్కించిన ‘మహా సముద్రం’ అక్టోబరు 14న విడుదల కానుంది.

Published : 12 Oct 2021 23:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్‌ భూపతి. ఇప్పుడు ‘మహా సముద్రం’ చిత్రంతో మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రమిది. దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా అజయ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ.

అందులో కిక్‌ ఉంటుంది..

‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రం తర్వాత ఫలానా కథని తెరకెక్కించండి అంటూ నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, నేను అంగీకరించలేదు. ‘మహా సముద్రం’ కథ మీదే దృష్టిపెట్టాను. ఈ సినిమా కాన్సెప్ట్‌ ‘ఆర్ఎక్స్‌ 100’ కంటే ముందే నా మదిలో మెదిలింది. కొన్నాళ్ల తర్వాత పూర్తి స్క్రిప్టు సిద్ధం చేసుకుని పట్టాలెక్కించా. ఇద్దరు హీరోలతో సినిమా చేయడంలో ఓ కిక్‌ ఉంటుంది. కథ పూర్తయ్యాక చాలామంది హీరోల్ని కలిశా. కథ నచ్చినా వారి పరిస్థితుల మేరకు చేయలేమని చెప్పారు. చివరగా శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ఒకే చేశారు. పాత్రల నిడివి గురించి వారు ఎప్పుడూ పట్టించుకోలేదు. ప్రతి విషయంలోనూ వారు నాకెంతో సహకరించారు. లవర్‌బాయ్‌ ఇమేజ్‌ ఉన్న సిద్ధార్థ్‌ ఈ చిత్రంలో పూర్తి భిన్నంగా కనిపిస్తాడు. అది ఓ రకంగా సినిమాపై ఆసక్తిని పెంచే అంశమే!

నాయికా పాత్రకి ప్రాధాన్యం..

ఏ సినిమాలోనైనా నాయికా పాత్ర బలంగా ఉంటే ఆ సినిమా విజయం సాధిస్తుందనేది నా నమ్మకం. ఆ ఉద్దేశంతోనే నేను పాత్రల్ని సృష్టిస్తా. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే హీరోయిన్‌ పాత్రలు నా సినిమాల్లో ఉండవు. ఈ విషయంలో దర్శకుడు బాల చందర్‌ నాకు స్ఫూర్తి. ‘మహా సముద్రం’ చిత్రంలో ‘మహా’ అనే నాయిక పాత్ర చాలా కీలకమైంది. ఫలానా కథానాయికని దృష్టిలో పెట్టుకుని రాసిన పాత్ర కాదిది. రాయడం పూర్తయ్యాకే దీన్ని పోషించేందుకు అదితిరావు హైదరీ, సమంతలాంటి వారు అయితే బాగుంటుంది అనుకున్నా. ముందుగా అదితికి కథ చెప్పడంతో ఆమెకి బాగా నచ్చి, ఒకే చేశారు.

వైజాగ్‌ని కొత్తగా చూపించాం..

విశాఖపట్నం సముద్ర తీరం నేపథ్యంలో సాగే కల్పిత కథ ఇది. స్నేహితులు, ప్రేమికులు.. ఇలా కొన్ని ఉపకథలు కనిపిస్తాయి. ఈ చిత్రంలో స్నేహితుడంటే ఎలా ఉండాలో చెప్పే ప్రయత్నం చేశా. వైజాగ్‌ని ఇప్పటి వరకూ ఎవరూ చూపించని విధంగా మేం చూపించాం. హీరోహీరోయిన్ల పాత్రలే కాదు ప్రతీ పాత్రకి మంచి గుర్తింపు ఉంటుంది. సినిమా చూశాక మీకు నటులు గుర్తుండరు వారు పోషించిన పాత్రలే గుర్తుకొస్తాయి. సందర్భానుసారం వచ్చే సంభాషణలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తాయి. నేను ఎలాంటి సంగీతాన్ని కోరుకుంటానో చేతన్‌ భరద్వాజ్‌కి బాగా తెలుసు. ఈ సినిమానికి ఆయన అందించిన సంగీతం ప్రధానబలంగా నిలుస్తుంది. నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంటుంది.

పాన్‌ ఇండియా కథ..

నా తొలి చిత్రం చాలా భాషల్లో రీమేక్‌ అయింది. అది పాన్‌ ఇండియా కథ. ‘మహా సముద్రం’ కూడా అంతే. అన్ని ప్రాంతాల వారికి రీచ్‌ అవుతుంది. ప్రస్తుతానికి తమిళంలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాం. అన్ని జానర్ల సినిమాలను తెరకెక్కించాలనే కోరిక ఉంది. త్వరలోనే ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రాన్ని ప్రకటిస్తా. ఓటీటీ కోసం ఓ కథకి దర్శకత్వం వహిస్తున్నా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని