Tollywood: దర్శకుడు కె.ఎస్‌.నాగేశ్వరరావు కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.నాగేశ్వరరావు (56) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

Updated : 28 Nov 2021 08:46 IST

ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.నాగేశ్వరరావు (56) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. శుక్రవారం రాత్రి తన స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా, కవులూరు నుంచి కారులో హైదరాబాద్‌కి వస్తుండగా మూర్ఛ రావడంతో కుప్పకూలిపోయారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలో తుదిశ్వాస విడిచారు. కె.ఎస్‌.నాగేశ్వరరావు తొలుత కోడి రామకృష్ణ దగ్గర సహాయ దర్శకుడిగా కొంతకాలం పనిచేశారు. తర్వాత ‘రిక్షారుద్రయ్య’ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఈయన దర్శకత్వం వహించిన ‘పోలీస్‌’ చిత్రంతోనే శ్రీహరి కథానాయకుడిగా మారారు. ఆ తర్వాత ఈ ఇద్దరి కలయికలోనే ‘దేవా’, ‘సాంబయ్య’, ‘శ్రీశైలం’ చిత్రాలొచ్చాయి.  విజయశాంతి ప్రధాన పాత్రధారిగా ‘వైజయంతి’, ‘శాంభవి’ చిత్రాల్ని తెరకెక్కించారు కె.ఎస్‌.నాగేశ్వర్‌రావు. ‘దేశద్రోహి’, ‘శివన్న’తోపాటు ఇటీవల ‘బిచ్చగాడా మజాకా’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈయన సొంతవూరు పాలకొల్లు. ఆయనకి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శనివారం కె.ఎస్‌.నాగేశ్వరరావు అత్తగారి ఊరైన కవులూరు సమీపంలోని పోతవరంలో ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియల్ని నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని