Puneet Rajkumar: పునీత్‌ను కలుద్దామనుకున్నా.. కానీ ఇంతలోనే: పూరి జగన్నాథ్‌

‘పునీత్‌ రాజ్‌కుమార్‌తో నెల క్రితం ఫోన్‌లో మాట్లాడాను. త్వరలోనే కలుద్దామనుకున్నాం. కానీ, ఇంతలోనే విషాదం జరిగింది’ అని ప్రముఖ దర్శకుడు భావోద్వేగానికి గురయ్యారు. పునీత్‌ రాజ్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

Updated : 07 Dec 2022 22:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పునీత్‌ రాజ్‌కుమార్‌తో నెల క్రితం ఫోన్‌లో మాట్లాడా. త్వరలోనే కలుద్దామనుకున్నాం. కానీ, ఇంతలోనే విషాదం జరిగింది’ అని ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ భావోద్వేగానికి గురయ్యారు. పునీత్‌ రాజ్‌కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. రాజ్‌కుమార్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

‘‘పునీత్‌ రాజ్‌కుమార్‌ మరణ వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. తను నాకెంతో క్లోజ్‌. హీరోగా తన తొలి చిత్రానికి నేను దర్శకత్వం వహించా. వారి కుటుంబం అంటే నాకు అభిమానం. పునీత్‌ చాలా మంచి మనిషి. ఎంతోమందికి సాయం చేశాడు. అలాంటి వ్యక్తి దూరమవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. చిన్న వయసులో చనిపోవడాన్ని తట్టులేకపోతున్నా. నెల క్రితం మాట్లాడుకున్నాం. సరదాగా కలుద్దామనుకున్నాం. ఈలోపు ఇలా జరిగింది. పునీత్‌ మరణం ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకే కాదు కన్నడ చిత్ర పరిశ్రమకే తీరని లోటు. లవ్‌ యు పునీత్‌. ఐ మిస్‌ యు’ అంటూ ఎమోషనల్‌ అయ్యారు.

రాజ్‌కుమార్‌ కుటుంబంతో పూరి జగన్నాథ్‌ అనుబంధం..

ప్రముఖ నటుడు దివంగత రాజ్‌కుమార్‌ కుటుంబంతో పూరి జగన్నాథ్‌కు మంచి అనుబంధం ఉంది. ఆ అభిమానంతోనే కన్నడ దర్శకుల్ని కాదనుకుని పునీత్‌ రాజ్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేసే అవకాశాన్ని పూరి జగన్నాథ్‌కి ఇచ్చారు. జగపతిబాబు హీరోగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన ‘బాచి’ చిత్రం ఇక్కడ అనుకున్నంత విజయం అందుకోకపోయినా కన్నడనాట మాత్రం హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ సినిమాను చూసిన రాజ్‌కుమార్‌ సభ్యుల్లో ఒకరు దర్శకుడి ప్రతిభ గురించి ఇంట్లో చర్చించారు. ఈ మాటలు విన్న రాజ్‌కుమార్‌ పూరి జగన్నాథ్‌ను తమ ఇంటికి ఆహ్వానించి, తన పెద్ద కుమారుడు శివ రాజ్‌కుమార్‌తో ఓ చిత్రం చేయాలని కోరారు. పూరి జగన్నాథ్‌ ‘నో’ చెప్పకుండా ‘యువరాజా’ అనే సినిమాని తెరకెక్కించారు. తెలుగులో విజయవంతమైన ‘తమ్ముడు’ రీమేక్‌గా రూపొందింది. సినిమా విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. పూరి జగన్నాథ్‌ వేగం, నేర్పు రాజ్‌కుమార్‌కు అమితంగా నచ్చేశాయి.

తన మూడో కుమారుడు పునీత్‌ను హీరో చేయాలని రాజ్‌కుమార్‌ అనుకున్న సందర్భంలో.. అప్పటి కన్నడ పరిశ్రమకు చెందిన ఎంతోమంది దర్శకులు, రచయితలు ఆయనకు కథలు వినిపించారు. అవేవీ ఆయనకు నచ్చలేదు. ఫైనల్‌గా పూరి జగన్నాథ్‌ను పిలిచి విషయం చెప్పారు. అలా పూరి జగన్నాథ్‌ తాను రాసుకున్న కథ వినిపించగానే రాజ్‌కుమార్‌, ఆయన కుటుంబ సభ్యులందరికీ నచ్చేసింది. ఆ కథే ‘అప్పూ’ టైటిల్‌తో పట్టాలెక్కింది. తక్కువ సమయంలోనే చిత్రీకరణ పూర్తయింది. విడుదలైన అన్ని చోట్లా వసూళ్ల వర్షం కురిపించింది. ఇదే కథ రవితేజ హీరోగా తెలుగులో ‘ఇడియట్‌’ పేరుతో అలరించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని