Rajamouli: మహేశ్‌బాబుకు రాజమౌళి ప్రశంస.. కారణమిదే!

సంక్రాంతి సీజన్‌లో విడుదలకావాల్సిన తన సినిమాను వేసవికి వాయిదా వేసినందుకు మహేశ్‌బాబుపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు.

Published : 21 Dec 2021 16:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంక్రాంతి సీజన్‌లో విడుదలకావాల్సిన తన సినిమాను వేసవికి వాయిదా వేసినందుకు మహేశ్‌బాబుపై రాజమౌళి ప్రశంసల వర్షం కురిపించారు. సామాజిక మాధ్యమాల వేదికగా మహేశ్‌తోపాటు పవన్‌ కల్యాణ్‌, పలువురు నిర్మాతల్ని అభినందించారు. పాన్‌ ఇండియా సినిమాల్ని దృష్టిలో పెట్టుకుని మహేశ్‌బాబు తాను నటిస్తున్న ‘సర్కారువారి పాట’ను 2022 సంక్రాంతి నుంచి ఏప్రిల్‌ 1కి వాయిదా వేస్తున్నట్టు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే సీజన్‌లో విడుదలకావాల్సిన ‘భీమ్లానాయక్‌’, ‘ఎఫ్‌ 3’లను వాయిదా వేస్తున్నట్టు ఆయా చిత్ర బృందాలు తాజాగా వెల్లడించాయి. ఈ సందర్భంగా రాజమౌళి ట్వీట్‌ చేశారు. ‘సంక్రాంతి సీజన్‌కి రావాల్సిన సరైన సినిమా ‘సర్కారువారి పాట’. అయినప్పటికీ ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మహేశ్‌ తన చిత్రాన్ని వేసవికి వాయిదా వేశారు. ఎవరికీ ఎలాంటి సమస్యా లేకుండా ఉండేందుకు ఆయన తీసుకున్న చొరవ అభినందనీయం. ‘సర్కారు..’ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌, ‘భీమ్లానాయక్‌’ నిర్మాత చినబాబు, నటుడు పవన్‌ కల్యాణ్‌, ‘ఎఫ్‌ 3’ చిత్ర నిర్మాతలకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఆయా సినిమాలు మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించారు.

రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకులుగా రాజమౌళి తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా 2022 జనవరి 7న విడుదలకానుంది. ప్రభాస్‌ నటించిన ‘రాధేశ్యామ్‌’ జనవరి 14 ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే.. జనవరి 12న విడుదలకావాల్సిన ‘భీమ్లా..’ ఫిబ్రవరి 25కి, ‘ఎఫ్‌ 3’ ఏప్రిల్‌ 29కి వాయిదా పడ్డాయి. మరోవైపు, రాజమౌళి- మహేశ్‌బాబు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఆ క్రేజీ ప్రాజెక్టు వచ్చే ఏడాది పట్టాలెక్కే అవకాశాలున్నాయి.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని