Honeytrap: ఆ ముసుగులు తీయాలనే ఆలోచనతోనే...

‘నా సినిమాలన్నీ సమాజం నుంచి కాపీ చేసినవే. కిటికీ తెరిస్తే కనిపించే కథలే అన్నీ. వాటిని యథాతథంగా తెరపైకి తీసుకు రావడానికి ఏమాత్రం సంకోచించను. ఒక పాత్రికేయుడిగా... సినీ రూపకర్తగా ఈ స్థానంలో...

Updated : 15 Sep 2021 11:13 IST

‘‘నా సినిమాలన్నీ సమాజం నుంచి కాపీ చేసినవే. కిటికీ తెరిస్తే కనిపించే కథలే అన్నీ. వాటిని యథాతథంగా తెరపైకి తీసుకు రావడానికి ఏమాత్రం సంకోచించను. ఒక పాత్రికేయుడిగా... సినీ రూపకర్తగా ఈ స్థానంలో ఉన్న నేనే సిగ్గు పడితే, తొమ్మిదేళ్ల వయసున్న ఓ అమ్మాయి తనపై జరిగిన అఘాయిత్యం గురించి బయటికి ఎలా చెబుతుంది?’’ అంటున్నారు ప్రముఖ దర్శకులు  పి.సునీల్‌కుమార్‌ రెడ్డి. ఆలోచన రేకెత్తించే సినిమాలకి కేరాఫ్‌ అడ్రస్‌ ఆయన. ‘సొంత ఊరు’, ‘గంగ పుత్రులు’, ‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’, ‘గల్ఫ్‌’ చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు. ఇటీవల ఆయన ‘హనీట్రాప్‌’ తెరకెక్కించారు. ఆ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా       పి.సునీల్‌కుమార్‌ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వల్ల మనం దాపరికాన్ని ఇష్టపడటం మొదలుపెట్టాం. చాలా     విషయాల్ని చెప్పుకోకుండా కప్పుకోవడం మొదలుపెట్టాం. అందుకే తల్లిదండ్రులకీ... పిల్లలకీ మధ్య అగాధం కనిపిస్తోంది. తరాలకీ తరాలకీ మధ్య సమస్యలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మనసు విప్పి మాట్లాడుకోకపోవడంతోనే. ఆ ముసుగుల్ని తీయాలనే ఆలోచనతోనే యువతరం నేపథ్యంలో సాగే కథల్ని చెప్పడం మొదలుపెట్టాం. సమస్యలన్నిటీని చాప కిందకి తోసేసి అంతా బాగుందని చూపిస్తే అర్థం లేదు కదా? కుదుపు కుదిపితే కానీ నిద్రలేవడానికి ఇష్టపడని  సమాజానికి...  కుదుపు కావలిసి వస్తే షాక్‌ ఇవ్వాల్సిందే. అలాగని ఎవరికీ తెలియని  విషయాలేమీ లేవు. అందరికీ తెలిసిన   విషయాలకే అద్దం పట్టడమే నా ప్రయత్నం’’.

‘‘సామాజిక మాధ్యమాల ఉద్ధృతి పెరిగాక ఎవరితో ఏం మాట్లాడాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆడియోలు, వీడియోలు లీక్‌ అవుతున్నాయి. ఇబ్బంది కరమైన  పరిస్థితుల్లో ఉన్నవాళ్ల పరువుని అడ్డం పెట్టుకుని మార్కెట్‌ చేసుకునే ఓ కొత్త రకమైన జూదమే... హనీ ట్రాప్‌. ఇది ఎక్కడో జరిగే విషయం కాదు. మన వీధిలోకి, మన దగ్గరికే వచ్చేసిందిప్పుడు. బాధితుల్లో అమ్మాయిలున్నారు, అబ్బాయిలున్నారు. రాజకీయ రంగం ఉంది, ఇతర రంగాలూ ఉన్నాయి. హనీ ట్రాప్‌ని యువతరం ఎలా వాడుకొంటోంది? దాంతో ఎలా బలవుతోందనే విషయాన్ని మా సినిమాతో ఆసక్తికరంగా, ఆలోచన రేకెత్తించేలా చెప్పాం. ప్రతి ప్రేక్షకుడూ కనెక్ట్‌ అయ్యే అంశాలున్న కథ. ఈ సినిమాకి కథ, కథనాల్ని వామనరావు సమకూర్చారు. సమకాలీన సమాజం నుంచి కథల్ని సృష్టించే ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన చెప్పిన ఈ ఆలోచన నాకు బాగా నచ్చింది. కొంతకాలంగా రొమాంటిక్‌ క్రైమ్‌ జానర్‌లో సినిమాలు చేస్తూ వస్తున్నా. ఈ కథ కూడా దానికి కొనసాగింపులా ఉంటుంది. ఒక సిరీస్‌ సినిమాలు చేసేంత సత్తా ఉన్న అంశం ఇది’’.

‘‘మనమంతా ప్రేమకి ప్రతిరూపాలే. ఇష్టాన్ని, ప్రేమ సన్నివేశాల్ని తెరపై చూపించడానికి మొహమాట పడకూడదు, సిగ్గుపడకూడదనేది నా   అభిప్రాయం. ఒక సన్నివేశంలో ప్రేమ, ఇష్టం ఎప్పుడైతే కనిపిస్తుందో అది కచ్చితంగా   అసభ్యత కాదనేది నా అభిప్రాయం. రోజూ కోటి మంది థియేటర్‌కి వెళ్లే దేశం మనది. సినిమా మాధ్యమం ద్వారా మనం ప్రభావవంతమైన విద్యని సమాజానికి అందించొచ్చు. అందుకే పాఠాశాల స్థాయి నుంచే ఫిల్మ్‌ అప్రిషియేషన్‌ కోర్సుని ప్రవేశ పెట్టాలని చెబుతా. మంచి సినిమాని ఎలా చూడాలో అవగాహన పెంపొందించాలి. నేను బోధన రంగంలో కూడా ఉన్నాను కాబట్టి వ్యక్తిగతంగా నా వంతుగా ఈ విషయంపై కొన్ని పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నా’’.

‘‘తదుపరి మన విద్యా విధానంపై ‘వెల్కమ్‌ టు తిహార్‌ కాలేజ్‌’ అనే సినిమా చేస్తున్నా. చిత్రీకరణ పూర్తయింది. నక్సలిజం - తండ్రీ కొడుకుల నేపథ్యంలో మరో సినిమా చేస్తున్నా. చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. వాటి వివరాలు నిర్మాతలే చెబుతారు’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని