Drushyam 2: రాంబాబులాంటి తండ్రి ప్రతి ఇంట్లోనూ ఉండాలి

‘‘నేను ఎప్పుడు కొత్త రకమైన సినిమా చేసినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈసారి వాళ్లకి ‘దృశ్యం2’ మరింత బాగా నచ్చుతుంది’’ అన్నారు వెంకటేష్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది.

Updated : 16 Nov 2021 06:26 IST

‘‘నేను ఎప్పుడు కొత్త రకమైన సినిమా చేసినా ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు. ఈసారి వాళ్లకి ‘దృశ్యం2’ మరింత బాగా నచ్చుతుంది’’ అన్నారు వెంకటేష్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ఆయనకి భార్యగా మీనా నటించారు. విజయవంతమైన ‘దృశ్యం’కి కొనసాగింపు చిత్రమిది. జీతూ జోసెప్‌ దర్శకుడు. డి.సురేష్‌బాబు, ఆంటోనీ పెరంబవూర్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 25న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘నేను ‘దృశ్యం’ చేశాక మళ్లీ అలాంటి సినిమా చేయాలనుకునేవాణ్ని. జీతూ మళ్లీ కొనసాగింపు చిత్రంతో రావడం ఆనందంగా ఉంది. ఒక మంచి సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రమిది. ఎన్నో భావోద్వేగాలు, మలుపులు ఉన్నాయి. వినోదం, డ్రామా ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. జీతూ జోసెఫ్‌ అద్భుతమైన స్క్రిప్ట్‌ రాశారు. ఈమధ్యకాలంలో అలాంటి ఫ్యామిలీ థ్రిల్లర్స్‌ రాలేదు. మోహన్‌లాల్‌, మీనా మలయాళంలో చాలా బాగా చేశారు. ఈ సినిమాని ఓ సవాల్‌గా తీసుకుని చేశా. ప్రతి ఇంట్లోనూ తన కుటుంబంకోసం ఏమైనా చేసే రాంబాబులాంటి తండ్రి ఉండాలి’’ అన్నారు. జీతూ జోసెఫ్‌ మాట్లాడుతూ ‘‘నేను దృశ్యం’ చేశాక దానికి కొనసాగింపుగా మరో స్క్రిప్ట్‌ చేయమని ప్రోత్సహించిన మొదటి వ్యక్తి శ్రీప్రియ మేడమ్‌. తెలుగు ప్రేక్షకులకి, ఇక్కడి సంస్కృతికి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేశాం. మలయాళంలో విడుదలైన ‘దృశ్యం2’ చూశాక దర్శకుడు రాజమౌళి నాకు సందేశం పంపించారు. అప్పుడు నేను నా కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లోనే ఉన్నా. ఆయన్నుంచి సందేశం చూశాక నమ్మశక్యంగా అనిపించలేదు. వెంటనే ఆ సందేశాన్ని సామాజిక సందేశాల్లో పంచుకున్నా’’ అన్నారు. శ్రీప్రియ మాట్లాడుతూ ‘‘తెలుగులో తొలి ‘దృశ్యం’ సినిమాని నేనే తెరకెక్కించా. ఈ చిత్రాన్ని మాత్రం జీతూనే చేశాడు. ఒక పిల్లవాణ్ని తీసుకుని మళ్లీ అతని నిజమైన తండ్రికి తిరిగి ఇచ్చినట్టుగా ఉంది. రాంబాబు పాత్రకి వెంకటేష్‌ తప్ప మరొకరు ఎవ్వరూ ఆ స్థాయిలో ఫిట్‌ కాలేరు. సెట్లో కూడా ఎప్పుడూ తన పిల్లలు, కుటుంబం గురించి మాట్లాడుతూనే ఉంటారు. అందుకే ఈ పాత్రలో అంతగా ఒదిగిపోయాడ’’న్నారు.  మీనా మాట్లాడుతూ  ‘‘నేను, వెంకటేష్‌ కొత్తలో ఎక్కువగా మాట్లాడుకునేవాళ్లం కాదు. కలిసి కొన్ని సినిమాలు చేశాక మామధ్య అనుబంధం పెరిగింది. ‘దృశ్యం2’ కోసం చేసిన ప్రయాణం చాలా బాగుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్‌కుమార్‌ సేతుపతి, సంపత్‌, సుజ, ఎస్తేర్‌,  అనూప్‌ రూబెన్స్‌, చంద్రబోస్‌ పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని