Fahadh faasil MALIK review: రివ్యూ: మాలిక్‌

నిజ జీవిత ఘటనలు ఆధారంగా చేసుకుని ఈ మధ్యకాలంలో వెండితెరపై ఎన్నో కథలు వచ్చాయి. అందులోనూ సాంఘిక, సామాజిక కోణాల్లో తెరకెక్కిన కథలకు ప్రేక్షకులు విజయరథం కూడా పట్టారు. ఇప్పుడు అదే కోవలో...

Updated : 15 Jul 2021 15:17 IST

చిత్రం: మాలిక్‌; తారాగణం: ఫహద్‌ ఫాజిల్‌, నిమిషా సజయన్‌, వినయ్‌ ఫోర్ట్‌‌, జోజీ జార్జ్‌, దిలీష్‌ పోథన్‌, తదితరులు; సంగీతం: సుషిన్‌ శ్యామ్‌; సినిమాటోగ్రఫీ: సాను జాన్‌ వర్గీస్‌; ఎడిటింగ్‌: మహేశ్‌ నారాయణన్‌; నిర్మాత: ఆంటో జోసెఫ్‌; నిర్మాణ సంస్థ‌: ఆంటో జోసెఫ్‌ ఫిల్మ్‌ కంపెనీ; కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మహేశ్‌ నారాయణన్; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌; తేదీ: 15-07-2021

నిజ జీవిత ఘటనల ఆధారంగా చేసుకుని ఈ మధ్యకాలంలో వెండితెరపై ఎన్నో కథలు వచ్చాయి. అందులోనూ సాంఘిక, సామాజిక కోణాల్లో తెరకెక్కిన కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం కూడా పట్టారు. ఇప్పుడు అదే కోవలో భూ కబ్జా, రాజకీయ అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘మాలిక్‌’. మలయాళీ విలక్షణ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఈ సినిమా తాజాగా ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ వేదికగా విడుదలయ్యింది. ఫహద్‌తో ‘సీయూ సూన్‌’ తీసిన మహేశ్‌ నారాయణన్‌ ఈ చిత్రానికీ దర్శకత్వం వహించారు. మరి ‘మాలిక్‌’గా ఫహద్‌ మెప్పించాడా? ఫహద్‌-మహేశ్‌ కాంబో మరో హిట్‌ అందుకుందా? తెలియాలంటే సినిమా కథ ఏమిటో తెలుసుకుందాం పదండి..!

కథేంటంటే: అలీ అహ్మద్‌ సులేమాన్‌ మాలిక్‌ (ఫహద్‌ ఫాజిల్‌) కేరళలోని రందాన్‌పల్లి అనే సముద్రతీర ప్రాంతానికి గ్యాంగ్‌స్టర్‌. ఆ ప్రాంతంలో ఆయన మాటే శాసనం. ఆఖరికి పోలీసులు, రాజకీయ నాయకులు కూడా ఆయన మాట వినాల్సిందే. అదే సమయంలో కేరళ తుపాను బాధితులకు ఇళ్లు, ఇతర సౌకర్యాలను కల్పించడంలో ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తుంటుంది. స్థానికంగా ఉన్న కొంతమంది రాజకీయ నాయకులు.. తుపాను బాధితుల ఇళ్ల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులతో కలిసి కమర్షియల్‌ ప్రాజెక్ట్‌ నిర్మించాలనుకుంటారు. ఈ విషయం తెలుసుకున్న సులేమాన్‌.. రాజకీయ నాయకులను హెచ్చరిస్తాడు. తమ పనికి సులేమాన్‌ అడ్డు వస్తున్నాడని భావించిన వాళ్లు.. ఏళ్ల క్రితం జరిగిన ఓ మత ఘర్షణ కేసును రీ ఓపెన్‌ చేసి.. హజ్‌ యాత్రకు వెళ్లాలనుకున్న సులేమాన్‌ని జైలుకి పంపిస్తారు. జైల్లోనే అతడిని చంపేయాలని ప్లాన్‌ చేస్తారు. ఇంతకీ వారి ప్లాన్‌ ఏమైంది? రందాన్‌పల్లికి ఆయన ఎలా మాలిక్‌ అయ్యాడు? మాలిక్‌గా మారే క్రమంలో అతడు తన జీవితంలో ఏం కోల్పోయాడన్నది మిగిలిన కథ.

ఎలా ఉందంటే: ఒక సాధారణ వ్యక్తి ప్రజల కోసం, వ్యవస్థ కోసం ఒంటరిగా పోరాటం చేసి పరిస్థితుల ప్రభావంతో ఓ శక్తిగా ఎదుగుతాడు. అతడి చుట్టుపక్కల ఉన్న మనుషుల అండతో ఒక ‘డాన్‌’లా, ‘గాడ్‌ఫాదర్‌’లా మారి వాళ్లను కాపాడుతుంటాడు. అలాంటి గాడ్‌ఫాదర్ల అడ్డు తప్పించి ఆ ప్రాంతంపై పట్టు సాధించడానికి కొన్ని దుష్టశక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. మంచికి, చెడుకు జరిగే ఇలాంటి యుద్ధంలో గెలుపు ఎటువైపు ఉంటుందన్న ఆసక్తి ఎప్పుడూ అలరిస్తూనే ఉంటుంది. ఇలాంటి కథా నేపథ్యంలో వచ్చిన హాలీవుడ్‌ ‘గాడ్‌పాధర్‌’, మణిరత్నం ‘నాయకుడు’ ప్రేక్షకులపై విపరీతమైన ప్రభావాన్ని చూపించాయి. ఇప్పుడు అలాంటి కోవలో వచ్చిందే ఈ ‘మాలిక్‌’ కథ.

సులేమాన్‌ నేర జీవితాన్ని వదిలేయాలనుకోవడం.. పోలీసులు అతడిని చంపాలనుకోవడం.. తదితర సన్నివేశాలతో సినిమా ప్రారంభమవుతుంది. ఆరంభ సన్నివేశాలతోనే అసలు మాలిక్‌ ఎవరన్న సంగతి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుడిలో కలిగించేలా చేశాడు దర్శకుడు మహేశ్‌. అక్కడి నుంచి మాలిక్‌ కుటుంబం రందాన్‌పల్లికి ఎలా వచ్చింది? చిన్న చిన్న నేరాలు చేస్తూ సులేమాన్‌ ఎదగడం.. ఈ క్రమంలోనే ఓ హత్య చేసి అతడు డాన్‌గా మారడం.. స్థానిక పోలీసులు, అధికారులను ఎదిరించే స్థాయికి వెళ్లడం వంటి సన్నివేశాలతో ప్రథమార్థం అంతా సాగుతుంది. ఆయా సన్నివేశాల్లో నాటకీయత ఉన్నా కథనం నెమ్మదిగా సాగుతుంది.

సులేమాన్‌ పూర్తిస్థాయి నాయకుడిగా ఎలా ఎదిగాడన్న విషయాన్ని ద్వితీయార్థంలో చూపించాడు దర్శకుడు. స్థానికతకు అద్దం పట్టేలా, వాస్తవికతకు దగ్గరగా ఉండేలా ప్రతి సన్నివేశాన్నీ తీర్చిదిద్దాడాయన. సులేమాన్‌ని దెబ్బతీయాలని భావించిన అధికారులు, పోలీసులు చేసిన కుట్రలు, సృష్టించిన మత కల్లోలాల కారణంగా జీవితంలో ఎంతో విలువైన వాటిని ఆయన కోల్పోతాడు. ఆయా సన్నివేశాలు ప్రతి ఒక్కరి హృదయాలను ద్రవింపజేస్తాయి. ఇక పతాక సన్నివేశాలైతే కన్నీళ్లు పెట్టిస్తాయి. రందాన్‌పల్లిలో జరిగిన మత కల్లోలాలకు పోలీసులే కారణమని తెలిసినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో నాటకీయత, వాస్తవికతకు పెద్దపీట వేశారు దర్శకుడు. అయితే నిడివి, కథాగమనం నెమ్మదిగా సాగడం కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: అలీ అహ్మద్‌ సులేమాన్‌ మాలిక్‌గా ఫహద్‌ ఫాజిల్‌ నటన మెప్పిస్తుంది. ఆ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారు. యువకుడిగా, మధ్య వయస్కుడిగా, వయసుమళ్లిన వ్యక్తిగా మూడు వేరియేషన్స్‌లో తనదైన ప్రతిభ కనబరిచాడు. వయసుల వారీగా ఆయన నటించిన ప్రతి సన్నివేశంలోనూ ఎక్కడా ఫహద్‌ మనకు కనిపించడు. కేవలం సులేమాన్‌గా మాత్రమే అందరికీ గుర్తుండిపోతాడు. పెద్ద వయసున్న పాత్రలో ఫహద్‌ నటన సెటిల్డ్‌గా ఉంది. పంచ్‌ డైలాగులు లేకపోయినా.. తన హావభావాలు, ఆహార్యంతో సన్నివేశాలను రక్తికట్టించాడు. నిమిషా సజయన్‌ (సులేమాన్‌ భార్య) పాత్ర పరిధి ఉన్నంత వరకూ అద్భుతంగా నటించింది. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఆమె డైలాగ్‌ డెలివరీ మెప్పిస్తుంది. పెద్ద వయసున్న పాత్రలో నిమిషా అంతగా అతకలేదేమో అనిపించింది. వినయ్‌ ఫోర్ట్‌, దిలీప్‌ పోథన్‌, జోజీ జార్జ్‌, సలీమ్‌ కుమార్‌, ఇంధ్రాన్‌, దివ్యప్రభా ఇలా ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు.

సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సినిమాటోగ్రాఫర్‌ సాను జాన్‌ వర్గీస్‌ ప్రతి సన్నివేశాన్నీ చక్కగా తీర్చిదిద్దారు. సుమారు 12 నిమిషాలపాటు సాగే ప్రారంభ సన్నివేశాన్ని సింగిల్‌ టేక్‌లో చూపించడమంటే ఓ అద్భుతమనే చెప్పాలి. ఇలా ఆయన సినిమాలోని చాలా సన్నివేశాలు సింగిల్‌ టేక్‌లోనే చూపించారు. సంతోష్‌ రామన్‌ ప్రొడెక్షన్‌ డిజైన్‌ సినిమాకి ప్రధాన బలం. సుషిన్‌ శ్యామ్‌ సంగీతం సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లింది. పాటలు అంతంతమాత్రంగానే ఉన్నా.. నేపథ్య సంగీతం సినిమాకు మరో బలం. మూడు వేరు వేరు కాలాల్లో మనుషులు, ప్రాంతాలను చూపించిన విధానం కాస్ట్యూమ్‌ డిజైన్‌ పరంగా బాగుంది. థియేటర్‌ కోసం ఈ సినిమాని తీర్చిదిద్దారు. దీంతో సినిమా నిడివి పెరిగిపోయింది. సుమారు 2 గంటల 40 నిమిషాలు కాస్త ఎక్కువగానే అనిపిస్తుంది. ఓటీటీకి విడుదల చేసినప్పుడైనా కొన్ని సన్నివేశాలను తగ్గించి ఉంటే బాగుండేదనే భావన ప్రేక్షకుడి మదిలో మెదులుతుంది. దర్శకుడు మహేశ్‌ నారాయణనే ఎడిటర్‌ కూడా కావడంతో సన్నివేశాలపై కోతవేయలేకపోయాడేమో..! దర్శకుడిగా ‘మాలిక్‌’ను అద్భుతంగా తీర్చిదిద్దిన మహేశ్‌ నారాయణన్‌ ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

+బలాలు

+ ఫహద్‌ ఫాజిల్‌

+ మహేశ్‌ నారాయణన్‌ రచనా, దర్శకత్వం

+ సాంకేతిక విభాగం పనితీరు

- బలహీనతలు

- నిడివి ఎక్కువగా ఉండడం

- కథాగమనం నెమ్మదిగా సాగడం

చివరిగా: ఫహద్‌-మహేశ్‌ నారాయణన్‌ మేజిక్‌ ఈ మాలిక్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని