
Akhanda: డల్లాస్‌లో ‘అఖండ’ హడావుడి
హైదరాబాద్: నటసింహాం నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ’ బాక్సాఫీస్ రోరింగ్ ప్రారంభమైంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ‘అఖండ’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీంతో థియేటర్ల వద్ద వాతావరణం కోలాహలంగా మారింది. ‘జై బాలయ్య’ అంటూ నందమూరి అభిమానులు నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ బాలయ్య మేనియా కనిపిస్తోంది. డల్లాస్‌లో ‘అఖండ’ హడావుడి మొదలైంది. ఆ ప్రాంతంలో ఉంటోన్న తెలుగువారందరూ ముఖ్యంగా నందమూరి అభిమానులు.. అఖండ పోస్టర్లు చేతపట్టుకొని.. కారు ర్యాలీ నిర్వహించారు. ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు చేశారు. మరోవైపు థియేటర్ల వద్ద బాలయ్య బ్లాక్‌బస్టర్ కొట్టారంటూ ఆనందం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాల తర్వాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్‌లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రమిది. మాస్ ప్రేక్షకులు బాలయ్య నుంచి ఏం కోరుకుంటారో తెలిసిన బోయపాటి.. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ద్విపాత్రాభినయంలో బాలయ్య నటించారు. ప్రగ్యాజైస్వాల్ ఈ చిత్రానికి కథానాయిక. శ్రీకాంత్, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. తమన్ స్వరాలు అందించారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.