
Bangarraju: నాన్నా.. నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు
నాగార్జున పాటకు.. చైతూ ఫిదా
హైదరాబాద్: ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (Soggade Chinni Nayana) చిత్రంలో బంగార్రాజుగా సందడి చేసి.. సినీ ప్రియుల్ని మెప్పించారు కథానాయకుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna). ఇప్పుడాయన మరోసారి అదే పాత్రతో వినోదాలు పంచేందుకు ‘బంగార్రాజు’ (Bangarraju)తో సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘లడ్డుండా’ అనే లిరికల్ పాటను మంగళవారం నాగార్జున విడుదల చేశారు. ధనుంజయ, మోహన బోగరాజు, హరిప్రియ, నూతన్ మోహన్ ఈపాటను ఆలపించారు. ‘అబ్బాయ్ హార్మోనీ.. డంటకు డడనా’ అంటూ పాటకు ముందు వచ్చే సాకీని నాగార్జున హుషారెత్తించేలా ఆలపించారు. దీనికి సంబంధించిన వీడియోని నాగచైతన్య షేర్ చేస్తూ.. ‘‘నాన్నా.. నీ ఎనర్జీని ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు’’ అని ట్వీట్ చేశారు.
‘సోగ్గాడే చిన్ని నాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కుతోంది. ఇందులో నాగార్జునతోపాటు ఆయన తనయుడు నాగచైతన్య సైతం కీలక పాత్రలో కనిపించనున్నారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ.. చైకు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. అనూప్ రూబెన్స్ స్వరాలు అందిస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈసినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
► Read latest Cinema News and Telugu News