Published : 09 Oct 2021 11:46 IST

Gopichand Aaradugula Bullet Review: రివ్యూ: ఆర‌డుగుల బుల్లెట్‌

చిత్రం: ఆర‌డుగుల బుల్లెట్‌; నటీనటులు: గోపీచంద్, నయనతార, ప్రకాష్ రాజ్, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, జయ ప్రకాష్ రెడ్డి, చలపతి రావు తదితరులు; కథ,కథనం: వక్కంతం వంశీ; సంగీతం: మణిశర్మ; ఛాయాగ్రహ‌ణం: బాల మురుగన్; కూర్పు: కోటగిరి వెంకటేశ్వర రావు; నిర్మాత‌: తాండ్ర ర‌మేష్; ద‌ర్శకుడు: బి.గోపాల్; బ్యానర్: జయ బాలాజీ రియల్ మీడియా; విడుద‌ల: 8 అక్టోబ‌ర్ 2021

ఏళ్ల త‌ర‌బ‌డి సెట్స్‌పై మ‌గ్గే సినిమాలు కొన్ని ఉంటాయి. ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో ఎప్పుడో మొద‌లై, ఇంకెప్పుడో అవి ప్రేక్షకుల ముందుకొస్తాయి. అలాంటి చిత్రమే.. ‘ఆర‌డుగుల బుల్లెట్‌’. నాలుగేళ్లుగా ప‌లుసార్లు విడుద‌ల తేదీల్ని మార్చుకున్న ఈ చిత్రం.. ఎట్టకేల‌కు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.  గోపీచంద్ క‌థానాయ‌కుడు కావ‌డం, బి.గోపాల్ ద‌ర్శక‌త్వం వ‌హించ‌డం, వ‌క్కంతం వంశీ, అబ్బూరి ర‌వి, మ‌ణిశ‌ర్మ త‌దిత‌రులు ఈ సినిమాలో భాగం కావ‌డంతో ఎంత ఆల‌స్యమైనా ఒకింత ఆస‌క్తిని రేకెత్తించింది. మ‌రి చిత్రం ఎలా ఉందో చూద్దామా..

క‌థేంటంటే: నిజాయ‌తీకి మారుపేరైన ఓ ప్రభుత్వ ఉద్యోగి మూర్తి (ప్రకాశ్‌రాజ్‌). అత‌డి కుమారుడే శివ (గోపీచంద్‌). కుటుంబంపై ప్రేమ త‌ప్ప.. మిగ‌తా బాధ్యత‌లేవీ ప‌ట్టని యువ‌కుడు శివ‌. వ‌య‌సొచ్చిన కొడుకు అలా ఏ ప‌నీ లేకుండా తిర‌గ‌డం తండ్రికి అస్సలు న‌చ్చదు. ఎంత చెప్పినా అత‌డిలో మార్పు రాదు స‌రిక‌దా, న‌య‌నతో (న‌య‌న‌తార‌) ప్రేమ‌లో ప‌డతాడు. ఏం యోగ్యత ఉంద‌ని ప్రేమించావ్?అంటూ ప్రేయ‌సి ముందే శివని అవ‌మానిస్తాడు తండ్రి మూర్తి. ఆ త‌ర్వాత ఇంట్లో నుంచి బ‌య‌టికి పంపేస్తాడు. ఇంత‌లో కాశీ (అభిమ‌న్యు సింగ్) అనే ఓ రౌడీ నుంచి మూర్తికి ముప్పు ఏర్పడుతుంది. అస‌లు వారిద్దరి మ‌ధ్య శ‌త్రుత్వం ఎందుకు ఏర్పడింది? త‌న తండ్రి స‌మ‌స్యల్లో ఉన్నాడ‌ని తెలిశాక శివ స్పంద‌న ఏమిటి? త‌న‌ని వ‌ద్దనుకున్న కుటుంబం కోసం ఎలా పోరాటం చేశాడనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: ట్రెండ్ మాటెలా ఉన్నా.. అన్నీ అనుకున్నట్టు కుదిరాయంటే మాస్ సినిమాల‌కి బాక్సాఫీసు ద‌గ్గర తిరుగుండ‌దు. ఈ ఏడాది ఆరంభంలో విడుద‌లైన ‘క్రాక్’ వ‌ర‌కూ కూడా ఆ విష‌యాన్ని త‌ర‌చూ ఏదో ఒక సినిమా నిరూపిస్తూనే ఉంది. క‌థానాయ‌కులు కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కూడిన మాస్ క‌థ‌ల‌పై మొగ్గు చూపుతున్నారంటే కార‌ణం కూడా అదే. మాస్ క‌థ‌ల్లో లాజిక్‌ల గురించి ప్రేక్షకుడు కూడా అంత‌గా ప‌ట్టించుకోడు. హీరోయిజం మోతాదు ఎంతున్నా, పాట త‌ర్వాత ఫైటు, ఆ త‌ర్వాత ఓ కామెడీ సీన్ వంటి లెక్కల‌తో స‌న్నివేశాలు సాగుతున్నా ప్రేక్షకుడు ఓకే చేసేస్తాడు. కాక‌పోతే క‌థో, క‌థానేప‌థ్యమో ఏదో ఒక విష‌యం కొత్తగా ఉండాల‌నుకుంటాడు. ఈ సినిమాలో మాత్రం అవేవీ క‌నిపించ‌వు. క‌థ మొద‌లుకొని కామెడీ స‌న్నివేశాల వ‌ర‌కూ ప్రతిదీ.. ఎన్నో సినిమాల్లో చూశాం అన్నట్లుగానే ఉంటుంది. 

తండ్రీ కొడుకుల బంధం నేప‌థ్యంలో సాగే చిత్రమిది. తండ్రి చీవాట్లు పెట్టడం, కొడుకు ప‌డ‌టం, ప‌ట్టించుకోకుండా తిర‌గ‌డం, ఆ త‌ర్వాత క‌థానాయిక‌తో ప్రేమలో ప‌డ‌టం.. ఇలా స‌గ‌టు తండ్రీ కొడుకుల సినిమాల్లాగే సాగుతుంది. అందులో కొత్తద‌న‌మేమీ లేదు. క‌థానాయ‌కుడి తండ్రికి.. రౌడీ నుంచి స‌మ‌స్య వ‌చ్చిన‌ప్పుడే అస‌లు క‌థ మొద‌లైన‌ట్టు అనిపిస్తుంది. కానీ, ఆ ఇద్దరి మ‌ధ్య శ‌త్రుత్వాన్ని బ‌లంగా ఆవిష్కరించ‌లేక‌పోయారు. ఆ  రౌడీ పాత్రలో ఏమాత్రం బ‌లం లేక‌పోవ‌డంతో హీరోయిజం కూడా నీరుగారిపోయిన‌ట్టైంది. ప్రేమ స‌న్నివేశాల్లోనూ, కామెడీ ట్రాకుల్లోనూ కొత్తద‌నం లేదు. కుటుంబ నేప‌థ్యం అన్నప్పుడు భావోద్వేగాలు కీల‌కం. కానీ తండ్రీ కొడుకుల బంధం నేప‌థ్యంలో భావోద్వేగాలు పండ‌లేదు. కొద్దిలో కొద్దిగా గోపీచంద్ - న‌య‌న‌తార జోడీ, వారిద్దరి మ‌ధ్య కెమిస్ట్రీ ఆక‌ట్టుకుంటుంది. గోపీచంద్ చేసే పోరాటాలు, ఆయ‌న క‌నిపించే తీరు కూడా మెప్పిస్తుంది.

ఎవ‌రెలా చేశారంటే: గోపీచంద్‌కి అల‌వాటైన పాత్రే. ఇందులో ఆయ‌న మ‌రింత హుషారుగా క‌నిపిస్తాడు. అందంగా కూడా క‌నిపించాడు. పోరాట ఘ‌ట్టాల‌తోనూ అల‌రించాడు. న‌య‌న‌తార పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేదు. పాట‌ల కోసమే అన్నట్టుగా ఆమె పాత్ర సాగుతుంటుంది. పాట‌ల్లోనూ, కొన్ని ప్రేమ స‌న్నివేశాల్లోనూ వారిద్దరి మ‌ధ్య కెమిస్ట్రీ అల‌రిస్తుంది. ప్రకాశ్‌రాజ్‌కి ఈ పాత్ర కొత్తదేమీ కాదు. త‌న‌దైన శైలిలో ప్రభావం చూపించారు. అభిమ‌న్యు సింగ్ విల‌నిజంలో ప‌సలేదు. ఆ పాత్ర లోప‌మే అది.  హాస్యన‌టులు ఎమ్మెస్ నారాయ‌ణ‌, జ‌య‌ప్రకాశ్‌రెడ్డి ఇందులో క‌నిపిస్తారు. ఎమ్మెస్ నారాయ‌ణ పాత్రకి మ‌రొక‌రితో డ‌బ్బింగ్ చెప్పించ‌డంతో అది అంత‌గా అత‌క‌లేదు. బ్రహ్మానందం కాలం చెల్లిన కామెడీ స‌న్నివేశాల్లో క‌నిపిస్తారు. మిగిలిన పాత్రల గురించి చెప్పుకోవ‌ల్సిందేమీ లేదు. బ‌ల‌మైన సాంకేతిక బృంద‌మే ప‌నిచేసింది. వ‌క్కంతం వంశీ క‌థ‌లోనూ, క‌థ‌నంలోనూ బ‌లం లేదు. అబ్బూరి ర‌వి మాట‌లు అక్కడ‌క్కడా ప‌ర్వాలేద‌నిపిస్తాయి. మ‌ణిశ‌ర్మ నేప‌థ్య సంగీతం ఆక‌ట్టుకుంటుంది. బి.గోపాల్ మేకింగ్ క‌థ‌కి త‌గ్గట్టే ఉంటుంది. క‌థ‌ల్ని ఎంచుకోవ‌డంలోనూ, క‌థ‌నాన్ని న‌డిపించ‌డంలోనూ మ‌రిన్ని జాగ్రత్తలు తీసుకుంటే త‌ప్ప ఈ త‌రం ప్రేక్షకుల్ని మెప్పించ‌లేమ‌నే విష‌యం ఆయ‌న‌కి మ‌రోమారు అర్థమ‌య్యేలా చేస్తుందీ చిత్రం.

బ‌లాలు

గోపీచంద్ - న‌య‌న‌తార జోడీ

ప్రథ‌మార్ధం

పోరాట ఘ‌ట్టాలు

బ‌ల‌హీన‌త‌లు

రొటీన్‌గా సాగే క‌థ‌, క‌థ‌నం

భావోద్వేగాలు

చివ‌రిగా: గురి త‌ప్పిన బుల్లెట్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని