HERO Trailer: ‘హీరో’ పగకి కారణమేంటి? 

ఇతర భాషల్లో విజయం అందుకున్న చిత్రాల్ని ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ డబ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకి వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కన్నడ సినిమా ‘హీరో’ని అదే పేరుతో జులై 24 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.

Published : 21 Jul 2021 14:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇతర భాషల్లో విజయం అందుకున్న చిత్రాల్ని ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ డబ్‌ చేసి తెలుగు ప్రేక్షకులకి వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కన్నడ సినిమా ‘హీరో’ని అదే పేరుతో జులై 24 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. రిషబ్‌ శెట్టి కథానాయకుడిగా దర్శకుడు ఎం. భరత్‌ రాజ్‌ తెరకెక్కించిన చిత్రమిది. గనవి లక్ష్మణ్‌ నాయిక. ప్రమోద్‌ శెట్టి ప్రతినాయకుడు. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది.

‘దట్టమైన అడవులతో నిండిన లంక ఇది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఉత్కంఠ పెంచుతూనే నవ్వులు పంచుతుంది. ఇందులో బార్బర్‌గా కనిపించాడు కథానాయకుడు. క్షౌరం చేసేందుకు విలన్ ప్రమోద్‌ ఇంటికి వెళ్తాడు రిషబ్‌. ప్రమోద్‌ భార్య (కథానాయిక), రిషబ్‌కి మధ్య పరిచయం ఉండటంతో ఇద్దరూ దగ్గరవుతారు. అదే సమయంలో విలన్‌ కంట పడతారు. విలన్‌ గ్యాంగ్‌తో ‘హీరో’ పోరాటాలు, ఛేజింగులు మొదలవుతాయి. చివరిలో ‘నువ్వు వచ్చిన పని ముగించకుండానే వెళ్తావా’ అని హీరోని హీరోయిన్‌ అడగటం ఉత్కంఠ పెంచింది. దాంతో ఇంతకీ హీరో పగకి కారణమేంటి? అనే సందేహం కలుగుతుంది. కథానాయకుడు.. కథానాయిక గొంతు కోసే సన్నివేశం మరో ట్విస్ట్‌. నటీనటుల హావభావాలు ఆకట్టుకుంటున్నాయి. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. మరి ‘హీరో’ పగ ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని