Akhanda: ‘అఖండ’ హైలైట్స్‌‌ అదుర్స్‌.. బాలయ్య చేతికి గాయం.. కారణమదే

మాస్‌ ఫల్స్‌ తెలిసిన నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో....

Updated : 28 Nov 2021 17:26 IST

హైదరాబాద్‌: మాస్‌ పల్స్‌ తెలిసిన నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘అఖండ’. ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మూడో చిత్రం ఇది. డిసెంబర్‌ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ‘అఖండ’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను శనివారం సాయంత్రం ఎంతో వేడుకగా నిర్వహించారు. అల్లు అర్జున్‌, రాజమౌళి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఈ కార్యక్రమం ఆద్యంతం సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకొంది. మరి ఈ మొత్తం ఈవెంట్‌లో చోటుచేసుకున్న కొన్ని హైలైట్స్‌ ఏమిటంటే..

తొలిసారి బన్నీ-బాలయ్య

సినీ పరిశ్రమలో కీలకంగా చెప్పుకొనే నందమూరి, అల్లు వారి హీరోలిద్దరూ ఒకే స్టేజ్‌పై కలవడం తెలుగు సినీ ప్రియులను ఆకట్టుకొంది. బాలకృష్ణ, బన్నీ సరదాగా మాట్లాడుకోవడం.. నవ్వులు పూయించడం ఆసక్తిగా ఉందని అందరూ చెప్పుకొంటున్నారు.


మాస్‌ జాతర అదిరింది..!

ఈవెంట్‌లో భాగంగా ‘అఖండ’ రెండో ట్రైలర్‌ను దర్శకధీరుడు రాజమౌళి విడుదల చేశారు. ‘అఖండ మాస్‌ జాతర’ పేరిట విడుదలైన ఈ ట్రైలర్‌ను బాలకృష్ణ మాస్‌ డైలాగ్‌లు, ఫైట్‌ సీక్వెన్స్‌లతో రూపొందించారు. ‘‘మేము ఎక్కడికైనా వస్తే తలదించుకోం. తల తెంచుకుని వెళ్లిపోతాం’’, ‘‘దేవుడ్ని కరుణించమని అడుగు. కనిపించమని కాదు’’ అంటూ బాలయ్య చెప్పే డైలాగ్‌లు ఈలలు వేయించేలా ఉన్నాయి.


‘జై బాలయ్య’.. అదిరిందయ్యా..!

‘అఖండ’ సినిమాలో ఉన్న ఒకే ఒక్క మాస్‌ పాట జై బాలయ్య. దీనికోసం హీరోహీరోయిన్స్‌ ఎంతగానో శ్రమించారు. ‘జైబాలయ్య’ వీడియో పాటను ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో విడుదల చేశారు. బాలయ్య డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోతున్నారు. అదిరింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.


బాలయ్య గాయానికి కారణమదే..!

బాలయ్య గత కొన్నిరోజుల నుంచి చేతికి బ్యాండ్‌ వేసుకొని కనిపిస్తున్నారు. ఏ ఫంక్షన్‌కు వచ్చినా ఆయన ఆ హ్యాండ్‌బ్యాండ్‌ లేకుండా రావడం లేదు. దీంతో ‘అఖండ’ షూట్‌లో ఆయనకు గాయమైందని అందరూ చెప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య చేతికి గాయం కావడానికి కారణమేమిటనే విషయాన్ని శనివారం బోయపాటి బయటపెట్టారు. ‘‘బాలయ్యకు దెబ్బ తగలడానికి నేనే కారణం. ఏదైనా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసినప్పుడు ఒళ్లు నొప్పులు రావడం సాధారణంగా జరిగే విషయమే. ఆ నొప్పులు తగ్గించుకోవడానికి కాస్త ఎక్స్‌ర్‌సైజ్‌ చేస్తాం. అదే మాదిరిగా, ‘జై బాలయ్య’ సాంగ్‌కి డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసిన తర్వాత ఇంటికి వెళ్లిన బాలయ్య నొప్పులు తగ్గించుకోవడం కోసం ఎక్స్‌ర్‌సైజ్‌ చేస్తుండగా.. ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిపోయారు. వెంటనే ఆయన నాకు ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని వివరించారు. ఆ పాట కోసం అప్పటికే రూ.కోటిన్నర పెట్టి సెట్‌ వేయించాం. తెల్లవారితే షూట్‌ చేయాలి? ఏం చేయాలో అర్థంకాక ఆలోచిస్తున్నప్పుడు.. ‘‘నేను రేపు సెట్‌కి వస్తాను. సాంగ్‌ షూట్‌ చేద్దాం’’ అని చెప్పారు. ఆ మాటకు నేను ఏం చెప్పాలో అర్థం కాక.. ‘‘సినిమా మొత్తంలో ఉన్న మాస్‌ సాంగ్‌ ఇది ఒక్కటే. బాగా చేయాలి. ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి సాంగ్‌ ఆపేద్దాం’’ అని చెప్పాను. ‘‘డైరెక్టర్‌గారు ఫ్యాన్స్‌ కోసం చేయాలి. మాస్‌ లేకపోతే ఎట్లా? వాళ్ల కోసం నేను మాస్‌ సాంగ్‌ చేయకపోతే ఎట్లా?’’ అని బాలయ్య నాతో అన్నారు.  ఆ తర్వాత చేతికి కట్టు కట్టించుకుని వచ్చి మరీ డ్యాన్స్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని