Cinema News: కలయిక.. కళ కళ

కొన్నేళ్లుగా తెలుగు చిత్రసీమపై కలయికలు అత్యంత ప్రభావం చూపిస్తున్నాయి. కథల కంటే కూడా కాంబినేషన్లకే ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్నారని ఈమధ్య సినీ పెద్దలు గట్టిగానే చెబుతున్న మాట. ఓ స్టార్‌ హీరో... మరో స్టార్‌ దర్శకుడు తొలిసారి జట్టు కట్టారంటే అది ఆసక్తికరమైన కాంబినేషన్‌ అవుతుంది. అంతకుముందు విజయం అందుకున్న హీరో హీరోయిన్లైనా... హీరో, దర్శకులైనా మరోసారి కలుస్తున్నారంటే... హిట్‌ కాంబినేషన్‌లో సినిమా

Updated : 29 Dec 2021 07:07 IST

కొన్నేళ్లుగా తెలుగు చిత్రసీమపై కలయికలు అత్యంత ప్రభావం చూపిస్తున్నాయి. కథల కంటే కూడా కాంబినేషన్లకే ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తున్నారని ఈమధ్య సినీ పెద్దలు గట్టిగానే చెబుతున్న మాట. ఓ స్టార్‌ హీరో... మరో స్టార్‌ దర్శకుడు తొలిసారి జట్టు కట్టారంటే అది ఆసక్తికరమైన కాంబినేషన్‌ అవుతుంది. అంతకుముందు విజయం అందుకున్న హీరో హీరోయిన్లైనా... హీరో, దర్శకులైనా మరోసారి కలుస్తున్నారంటే... హిట్‌ కాంబినేషన్‌లో సినిమా అంటూ పరిశ్రమ మొదలుకొని, ప్రేక్షకుల వరకు ప్రత్యేకమైన అంచనాలతో చూడటం మొదలవుతుంది. ఇలా చిత్రసీమలో కలయికకి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వీటి ఆధారంగానే ఆయా సినిమాలకి మార్కెట్‌ కూడా జరుగుతుంటుంది. 2021లోనూ కలయికల సందడి స్పష్టంగా కనిపించింది. హిట్‌ కాంబినేషన్‌లో వచ్చిన దాదాపు సినిమాలు ఆ అంచనాలకి తగ్గట్టుగానే విజయాల్ని అందుకున్నాయి.

హిట్టు జోడీ అంటే ఒకప్పుడు హీరో హీరోయిన్ల ప్రస్తావనే ప్రముఖంగా వినిపించేది. ఆ తర్వాత  హీరో - దర్శకుడి జోడీ కూడా అంతే కీలకంగా మారింది. నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ఎంత బాగా పండుతుందో... కొద్దిమంది దర్శకులు, హీరోల మధ్య కూడా అంతే! తన హీరోని తెరపై ఎలా చూపిస్తే ప్రేక్షకులకు, అభిమానులకి నచ్చుతుందో ఆయా దర్శకులకి తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదేమో అనిపిస్తుంటుంది. అందుకే ఆ ఇద్దరినీ కలిపి మళ్లీ మళ్లీ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తుంటారు నిర్మాతలు. అలా ముచ్చటగా మూడోసారి కలిసి చేసి విజయాల్ని అందుకున్న కలయికలు ఈ ఏడాది చాలానే ఉన్నాయి.


‘అఖండ’ విజయం

హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా బరిలోకి దిగిన బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయిక అనుకున్నది సాధించింది. ‘అఖండ’మైన విజయాన్ని అందుకుని తమ కాంబినేషన్‌కి తిరుగులేదని చాటి చెప్పింది. బాలకృష్ణ కథానాయకుడిగా ‘సింహా’, ‘లెజెండ్‌’ చిత్రాల్ని తెరకెక్కించి వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు అగ్ర దర్శకుడు బోయపాటి శ్రీను. మూడోసారి ఈ కలయికలో సినిమా అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు తగ్గట్టుగానే ‘అఖండ’ని తెరకెక్కించి మరోసారి ఘన విజయాన్ని నమోదు చేశారు. అఘోరాగా, మురళీకృష్ణగా రెండు పాత్రల్లో నట విశ్వరూపం ప్రదర్శించారు బాలకృష్ణ. కరోనాతో ఏర్పడిన క్లిష్ట పరిస్థితుల్లోనూ ఈ చిత్రం అమెరికాలో మిలియన్‌ డాలర్లకిపైగా వసూలు చేసి సత్తా చాటింది. వేగంగా రూ.100 కోట్ల మైలురాయిని అధిగమించి, సినిమా విడుదలై 25 రోజులైనా మంచి వసూళ్లతో ఇప్పటికీ ప్రదర్శితమవుతోంది.


‘క్రాక్‌’ జాతర

‘డీజే కాదు, ఇది ఓజే.. ఒంగోలు జాతర’ అంటూ రవితేజ చేసిన సందడికి మరోసారి బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిసింది. ‘డాన్‌శీను’, ‘బలుపు’ విజయాల తర్వాత రవితేజతో మరోసారి జట్టు కట్టిన గోపీచంద్‌ మలినేని ‘క్రాక్‌’తో హ్యాట్రిక్‌ని నమోదు చేశారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మాస్‌ ప్రేక్షకుల్ని విజయవంతంగా థియేటర్లకి తీసుకొచ్చి పరిశ్రమకి భరోసానిచ్చింది. పోలీస్‌ అధికారిగా రవితేజ నటన, గోపీచంద్‌ మలినేని తనదైన శైలిలో మాస్‌ అంశాల్ని కథలో మేళవించిన తీరు ప్రేక్షకుల్ని మెప్పించింది. 


హిట్‌ జోడీలు కూడా

ఇదివరకటి చిత్రాలతోనే హిట్‌ జోడీ అనిపించుకున్న నాయకానాయికలకి కూడా ఈ ఏడాది మంచి ఫలితాలే దక్కాయి. వెంకటేష్‌ - మీనా ‘దృశ్యం2’తోనూ, పవన్‌ కల్యాణ్‌ - శ్రుతిహాసన్‌ ‘వకీల్‌సాబ్‌’తోనూ, రవితేజ - శ్రుతిహాసన్‌ కలిసి ‘క్రాక్‌’తోనూ, ‘శ్యామ్‌ సింగరాయ్‌’తో నాని - సాయిపల్లవి మరోసారి కలిసి నటించారు. వీళ్లందరికీ విజయాలు దక్కడం విశేషం.


వీళ్లూ కలిశారు...

రామ్‌ - కిషోర్‌ తిరుమల కలయికలో తెరకెక్కిన మూడో చిత్రం ‘రెడ్‌’ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళంలో విజయవంతమైన ‘తడమ్‌’కి రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓ వర్గం ప్రేక్షకుల్ని మెప్పించింది. రామ్‌ ద్విపాత్రాభినయం అలరించింది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత వెంకటేష్‌ - శ్రీకాంత్‌ అడ్డాల కలిసి ‘నారప్ప’ చేశారు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్‌’కి రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొంది విజయాన్ని నమోదు చేసింది. శ్రీకాంత్‌ అడ్డాలని మళ్లీ ఫామ్‌లోకి తీసుకొచ్చింది. ‘నిన్ను కోరి’ తర్వాత ‘టక్‌ జగదీష్‌’తో నాని - శివ నిర్వాణ మరోసారి కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే ఓటీటీ వేదికలో విడుదలైంది. ‘గౌతమ్‌ నందా’ తర్వాత గోపీచంద్‌ - సంపత్‌ నంది కలిసి ‘సీటీమార్‌’ చేసి విజయాన్ని అందుకున్నారు.


తగ్గేదే లేదన్న ‘పుష్ప’

అంచనాలు ఎన్నున్నా సరే తగ్గేదే లేదని నిరూపించింది అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కలయిక. ‘ఆర్య’, ‘ఆర్య2’ తర్వాత ఈ ఇద్దరూ కలిసి చేసిన ‘పుష్ప’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం రూ.200 కోట్ల మైలురాయిని అధిగమించి, మరిన్ని అంకెలు పెంచుకుంటూ దూసుకెళుతోంది. అమెరికాలో రెండు మిలియన్‌ డాలర్లకిపైగా వసూళ్లతో ప్రదర్శితమవుతోంది. పుష్పరాజ్‌గా అల్లు అర్జున్‌ నటన, ఆయన సరికొత్త మేకోవర్‌ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మరోసారి ఈ కలయికలో సినిమాకి కావల్సినంత ప్రోత్సాహాన్నిచిందీ విజయం. ‘పుష్ప2’పై మరిన్ని అంచనాల్ని పెంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని