Vijay Sethupathi: కృతిశెట్టితో సినిమా చేయలేను: విజయ్‌ సేతుపతి

కృతిశెట్టితో తాను సినిమా చేయాలనుకోవడం లేదని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి అన్నారు. కృతిశెట్టి-వైష్ణవ్‌ తేజ్‌ జంటగా నటించిన ‘ఉప్పెన’ చిత్రంలో విజయ్‌ సేతుపతి రాయనంగా ఆమె తండ్రి పాత్రలో...

Updated : 06 Sep 2021 11:25 IST

హైదరాబాద్‌: కృతిశెట్టితో తాను సినిమా చేయలేనని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి అన్నారు. కృతిశెట్టి-వైష్ణవ్‌ తేజ్‌ జంటగా నటించిన ‘ఉప్పెన’ చిత్రంలో విజయ్‌ సేతుపతి ఆమె తండ్రి పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో విజయ్‌ నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషించారు. కాగా, తాజాగా ‘లాభం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్‌ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. తాను కథానాయకుడిగా చేయనున్న ఓ సినిమాలో కృతిశెట్టిని హీరోయిన్‌గా ఎంపిక చేశారని అన్నారు.

‘‘ఉప్పెన’లో బేబమ్మ(కృతిశెట్టి) తండ్రి పాత్రలో నటించి తెలుగువారికి చేరువయ్యాను. ఆ సినిమా విడుదలైన కొన్ని నెలల తర్వాత తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ చేశాను. అందులో కథానాయికగా కృతిశెట్టిని ఎంచుకుంటే బాగుంటుందని టీమ్‌ భావించి.. ఆమె ఫొటో నాకు పంపించారు. నేను వెంటనే వాళ్లకు ఫోన్‌ చేసి.. ‘ఇటీవల ఓ సినిమాలో నేను ఆమెకు తండ్రిగా నటించాను. కూతురు పాత్ర పోషించిన ఆమెతో రొమాన్స్‌ చేయలేను. కాబట్టి ఆమె వద్దు’ అని చెప్పాను. ‘ఉప్పెన’ క్లైమాక్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ఆమె కొంచెం కంగారు పడింది. దాంతో నేను.. ‘బేబమ్మ.. నాకు నీ వయసు కొడుకే ఉన్నాడు. కాబట్టి నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. భయపడకు. ఎలాంటి కంగారు లేకుండా ధైర్యంగా చెయ్‌’ అని ప్రోత్సహించాను. కూతురిలా భావించిన ఆమెకు జోడీగా నటించడం నా వల్ల కాదు’’ అని విజయ్‌ సేతుపతి వివరించారు.

ఇక, ‘లాభం’ సినిమా విషయానికి వస్తే.. వ్యవసాయం, దళారీ వ్యవస్థ, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలియజేసే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో విజయ్‌ రైతు సమస్యలపై పోరాడే వ్యక్తిగా కనిపిస్తారు. శ్రుతిహాసన్‌ కథానాయిక. ఎస్‌.పి.జననాథన్‌ దర్శకుడు. ఇమాన్‌ సంగీతం అందించారు. సెప్టెంబర్‌ 9న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని