Ichata Vahanamulu NilupaRadu: నాగార్జున చెప్పిన ఆ మాట వల్లే నాలో మార్పు వచ్చింది!

‘మావయ్య నాగార్జున ఇచ్చిన సలహా వల్ల నటుడిగా కొత్త ప్రయాణం ప్రారంభించా’ అని యువ నటుడు సుశాంత్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి నాయిక. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహించారు........

Updated : 07 Dec 2022 20:22 IST

హైదరాబాద్‌: ‘మావయ్య నాగార్జున ఇచ్చిన సలహా వల్ల నటుడిగా కొత్త ప్రయాణం ప్రారంభించా’ అని యువ నటుడు సుశాంత్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి నాయిక. ఎస్‌.దర్శన్‌ దర్శకత్వం వహించారు. రవిశంకర్‌ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్‌ కోయలగుండ్ల నిర్మాతలు. ఈ నెల 27న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం ముందస్తు విడుదల వేడుక నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. 

ఈ సందర్భంగా సుశాంత్‌ మాట్లాడుతూ.. ‘‘నా కెరీర్‌ ప్రారంభంలో అలాంటి సినిమాలు చేయాలి, ఇలాంటి సినిమాలు చేయాలనే లెక్కలు వేసుకునేవాడ్ని. కథల ఎంపికలో అప్పుడు నాకు అంత స్పష్టత లేదు. కథ నాకు నచ్చినా తెలిసిన వాళ్లకి చెప్పి సలహాలు తీసుకునేవాడ్ని. ‘సొంతగా నిర్ణయం తీసుకో.. సినిమా ఆడినా ఆడకపోయినా..’ అని మావయ్య నాగార్జున ఓసారి నాతో చెప్పారు. అప్పటి నుంచి నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టా. ఆ ఫలితమే ‘చి.ల.సౌ’ చిత్రం. తర్వాత ‘అల వైకుంఠపురములో’, ఇప్పుడు ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన త్రివిక్రమ్‌ గారికి థాంక్స్‌. టీమ్‌ వర్క్‌తో రూపొందిన చిత్రమిది. అందరూ చాలా కష్టపడ్డారు. ఈ సినిమా తెరకెక్కడానికి ముఖ్య కారణం రవిశంకర్, ఏక్తా శాస్త్రి, హరీశ్‌. కరోనా మహమ్మారి కారణంగా ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ, ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా అని ఇవ్వలేదు’ అని తెలిపారు.  

అనంతరం త్రివిక్రమ్‌ మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తర్వాత ఇలాంటి వేడుకకి రావడం ఆనందంగా ఉంది. ప్రపంచంలో థియేటర్లకి వచ్చేందుకు సాహసిస్తున్న జాతి తెలుగు జాతి మాత్రమే. సుశాంత్‌ ఈ సినిమా చేస్తున్నట్టు  ‘అల వైకుంఠపురములో’ చిత్ర షూటింగ్ సమయంలో చెప్పాడు. సినిమా బాగా వచ్చిందని చాలా మంది అన్నారు. ‘చి.ల.సౌ’ సినిమాలోని సుశాంత్‌ నటనని మెచ్చి, నా చిత్రంలో అవకాశం ఇచ్చాను. దర్శకుడు దర్శన్‌కి నా శుభాకాంక్షలు. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం నాకు బాగా నచ్చింది. నటీనటులందరికీ నా బెస్ట్‌ విషెస్‌. కరోనా పూర్తిగా తగ్గిపోయి మునుపటి పరిస్థితులు రావాలని, అది ఈ సినిమాతోనే మొదలవ్వాలని కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు. 

‘వందల సంఖ్యలో ఆడియో, ప్రీ రిలీజ్ ఈవెంట్లకి ఓ ప్రేక్షకుడిగా హాజరయ్యాను. వేదికపై నేనుంటే ఎలా ఉంటుందోనని ఊహించుకునేవాడ్ని. ఆ కల ఈరోజు నెరవేరింది. ఈ సందర్భంగా మా అమ్మానాన్నలు, తమ్ముడికి ధన్యవాదాలు చెబుతున్నా. వాళ్ల వల్లే నేనిక్కడ ఉన్నాను. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. నా జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథ రాశా. ఆ ఘటన 2010లో చెన్నైలో జరిగింది. ‘ఢమరుకం’ చిత్రానికి పనిచేసిన సమయంలో మా టీమ్‌కి ఈ కథ చెప్తే.. బాగుంది, సినిమా తియ్‌ అని ప్రోత్సహించారు. 2013లో స్క్రిప్టు పూర్తి చేశా. అప్పటి నుంచి సుమారు 250 సార్లు ఈ కథని పలువురి వద్ద వినిపించాను. చివరగా సుశాంత్‌తో తెరకెక్కించే అవకాశం దక్కింది. ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, దర్శకుడు విద్యాసాగర్‌ కారణంగా ఇది సాధ్యమైంది’ అని దర్శన్‌ తెలిపారు.

‘తెలుగు వారందరికీ నమస్కారం. ఈ సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుండటం చాలా ఆనందంగా ఉంది. నాయికగా నాకు అవకాశం ఇచ్చిన దర్శక- నిర్మాతలకు ధన్యవాదాలు’ అని మీనాక్షి చౌదరి చెప్పింది. ఈ కార్యక్రమంలో నటులు వెంకట్‌, ప్రియదర్శి, అభినవ్‌ గోమటం, శ్రీనివాస్‌ అవసరాల, సంగీత దర్శకుడు ప్రవీణ్‌ లక్కరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని