Indian Idol Season12: ఇండియన్‌ ఐడల్‌.. తుదిపోరులో అదరగొట్టింది వీరే!

దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని అలరించే కార్యక్రమం ‘ఇండియన్‌ ఐడల్‌’. అదివారం రాత్రి జరిగిన సీజన్‌ 12లో పవన్‌దీప్‌ రాజన్‌ విజేతగా నిలిచాడు. టైటిల్‌ పోరులో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియతో సహా పవన్‌దీప్‌

Updated : 16 Aug 2021 05:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా సంగీత ప్రియుల్ని అలరించే కార్యక్రమం ‘ఇండియన్‌ ఐడల్‌’. అదివారం రాత్రి జరిగిన సీజన్‌ 12లో పవన్‌దీప్‌ రాజన్‌ విజేతగా నిలిచాడు. టైటిల్‌ పోరులో తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియతో సహా పవన్‌దీప్‌ రాజన్‌, అరుణిత కంజిలాల్‌, నిహల్‌, సేలీ కంబ్లే, మహ్మద్‌ దనిష్‌, ఎంతో ప్రతిభ చాటారు. ఫైనల్స్‌ వరకూ రావడం అంటే మాటలు కాదు కదా! మరి వాళ్లు ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ల గానం ఎలా ఉంటుందో ఓ లుక్కేద్దామా..

షణ్ముఖ ప్రియ..

తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అమ్మాయి షణ్ముఖ ప్రియ. ఈమెకి రియాలిటీ షోలు కొత్తేమీ కాదు. ఇప్పటికే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్న షణ్ముఖ ‘స రి గ మ ప కిడ్స్‌’ (తెలుగు) విజేతగా నిలిచింది ఈ విశాఖపట్నం అమ్మాయి. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్‌ సంఖ్య 2000 నుంచి 31,3000 (సుమారు) చేరుకుందంటేనే అర్థమవుతుంది ఆమెకి ఎంత ఫాలోయింగ్‌ ఏర్పడిందో! ‘ఇండియన్‌ ఐడల్‌ ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకాన్ని అందించింది. ఇక్కడ పాడాలని నేనెప్పటి నుంచో కలలు కన్నాను. ఈ షో చూస్తూ పెరిగాను. ఎప్పటికైనా  అక్కడికి వెళ్లాలి అనుకునేదాన్ని. నేనే కాదు నా కుటుంబమూ ఇదే డ్రీమ్‌తో ఉండేది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అన్ని రకాల పాటల్ని పాడాను’ అని అంటుంది షణ్ముఖ.


పవన్‌దీప్‌ రాజన్‌..

ఫోక్‌ సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడతాడు ఉత్తరాఖండ్‌కి చెందిన పవన్‌దీప్‌ రాజన్‌. అంతర్జాతీయ స్థాయి ఉన్న ఇలాంటి షోలో తనకి అవకాశం రావడం నమ్మలేకపోతున్నానంటుంటాడు. ‘స్నేహితులు, కుటుంబ సభ్యులకి దూరంగా ఉంటున్నాననే బాధ తొలినాళ్లలో ఉండేది. తర్వాతర్వాత ఆ ఆలోచన పోయింది. ఇప్పుడేమో ఈ షో ముగుస్తుందంటేనే అదోలా ఉంది. కానీ, తప్పదు కదా. కళాకారుల్ని ప్రోత్సహించే ఈ వేదికకి విచ్చేసిన అతిథులు, న్యాయ నిర్ణేతల నుంచి ఎంతో నేర్చుకున్నాను. నన్ను ఆదరిస్తోన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చాడు పవన్‌ దీప్‌.


అరుణిత కంజిలాల్‌..

ప్రముఖ రియాలిటీ షో ‘స రి గ మ ప’ (బెంగాలీ) విజేత నిలిచిన అరుణితది కోల్‌కతా. ఇండియన్‌ ఐడల్‌ వేదికపై పాడటమే ఈ పద్దెనిమిదేళ్ల గాయని కల. అనుకున్నదే తడవుగా ప్రయత్నం మొదలుపెట్టింది. లక్ష్యం చేరుకుంది. గెలుపోటములు పక్కనపెడితే ఇప్పటికే ప్రేక్షకుల హృదయాన్ని కొల్లగొట్టింది. ‘ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన ఇండియన్‌ ఐడల్‌ కార్యక్రమంలో పాల్గొనాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. లాక్‌డౌన్‌ సమయంలో ఆడిషన్స్‌ జరిగాయి. నా తల్లిదండ్రులు ప్రయత్నించవచ్చు కదా అని అన్నారు. ఆ ప్రయత్న ఫలితమే ఇప్పుడు నేనిలా ఉండటానికి కారణం. ఈ సీజన్‌లో చాలా గట్టి పోటీ ఉంది’ అని చెప్పింది అరుణిత. అన్నట్టు అరుణిత, పవన్‌దీప్‌ జోడీకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఈ ఇద్దరూ కలిసి ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు.


నిహల్‌..

నిహల్‌ది మంగళూరు. ఇతనికి చిన్నప్పటి నుంచే సంగీతం అంటే చాలా ఇష్టం. నాలుగేళ్లకే పాటలు పాడేసి, అందరినీ అలరించేవాడు. అలా సింగింగ్‌పై ఉన్న మక్కువ ఇక్కడి వరకూ తీసుకొచ్చింది. ‘ఇండియన్‌ ఐడల్‌ టాప్‌ సిక్స్‌ కంటెస్టెంట్ల జాబితాలో ఒకడిగా నిలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడుతున్నారు. నేనూ నా వంతు ప్రయత్నం చేస్తున్నా’ అని అంటున్నాడు నిహల్‌.


సేలీ కంబ్లే..

‘గమ్యాన్ని చేరుకోవడం కంటే దాన్ని చేరుకునే ప్రయాణమే ఎంతో కీలకం’ అంటోంది ఈ మహారాష్ట్ర అమ్మాయి. ‘తొలిసారి ఇండియన్‌ ఐడల్‌ వేదికపై ప్రదర్శన ఇచ్చేటప్పుడు చాలా కంగారు పడ్డాను. ప్రస్తుతం ధైర్యం వచ్చింది. ఈ షో మా అందరిలో మార్పు తీసుకొచ్చింది. ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12 నాకెన్నో పాటలు నేర్పింది. నాకింకా గుర్తుంది... జులై 25న ఆడిషన్‌ కోసం నేను పాడిన పాటకి సంబంధించిన వీడియో అప్‌లోడ్‌ చేశాను. నేను ఎంపిక అవుతానని అప్పుడు ఊహించలేదు. ఇక్కడి వచ్చాక ఎంపిక చేసుకున్న ప్రతి పాటా నాదే అన్నట్టు భావించి, మనసు పెట్టి పాడాను’ అని తన మనసులో మాట పంచుకుంది.


మహ్మద్‌ దనీష్‌..

‘ఇలాంటి అద్భుతమైన ప్రయాణం ముగుస్తుండటం చాలా బాధగా ఉంది. దాదాపు సంవత్సరం గడిచినా నిన్ననే ప్రారంభమైనట్టు ఉంది’ అంటున్నాడు మహ్మద్‌ దనీష్‌. ‘ఇంతమంది ప్రేక్షకులు నాపై అభిమానం చూపించడం నమ్మలేకపోతున్నా. నా తల్లిదండ్రుల ప్రార్థనల వల్లే ఇది సాధ్యమైందా? అని అనిపిస్తుంటుంది. కొన్ని నెలల అద్భుత ప్రయాణం ముగిశాక గమ్యానికి చేరుకున్నాం. కరోనా కారణంగా తొలిసారి ఆన్‌లైన్‌ ఆడిషన్స్‌ జరిగాయి’ అని చెప్పుకొచ్చాడు. ఈ కార్యక్రమ న్యాయనిర్ణేతల్లో ఒకరైన హిమేశ్‌ రేష్మియాతో కలిసి ఓ మ్యూజిక్‌ వీడియోని రూపొందించే అవకాశం అందుకున్నాడు దనీష్‌. ఇతనిది ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌.

ఆదిత్య నారాయణ్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమానికి హిమేశ్‌ రేష్మియా, అను మాలిక్‌, సోను కక్కర్‌ న్యాయ నిర్ణేతలు. రసవత్తరంగా సాగే ఆఖరి ఎపిసోడ్‌కి సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అడ్వాణీ, ఉదిత్‌ నారాయణ్‌, అల్కా యజ్ఞిక్‌ అతిథులుగా విచ్చేశారు.






Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని