Induvadana Teaser: ‘ఇందువదన’.. భయపెడుతోంది!

‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారులోకం’ తదితర చిత్రాలతో యువతని ఆకట్టుకున్న నటుడు వరుణ్ సందేశ్‌. కొన్నాళ్ల విరామం అనంతరం ‘ఇందువదన’ అనే విభిన్న ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Updated : 27 Dec 2022 20:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘హ్యాపీడేస్‌’, ‘కొత్త బంగారులోకం’ తదితర చిత్రాలతో యువతని ఆకట్టుకున్న నటుడు వరుణ్ సందేశ్‌. కొన్నాళ్ల విరామం అనంతరం ‘ఇందువదన’ అనే విభిన్న ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా టీజర్‌ని విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ లవ్‌, థ్రిల్లింగ్‌ అంశాలతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అడవి నేపథ్యంలో సాగే కథ ఇది. ఓ అడవిలో ‘అస్కర బస్కా’ అని నాయిక వార్నింగ్‌ ఇస్తే ‘లష్కర్‌ తుష్క’ అంటూ కథానాయకుడు చెప్పిన తీరు మెప్పిస్తుంది. ప్రతి ప్రేమ కథలో విలన్లు ఉన్నట్టే వీళ్లని విడదీయటానికి ఓ రౌడీ గ్యాంగ్‌ ఉంటుంది. వాళ్లొచ్చి హీరోని చంపే ప్రయత్నం చేయగా ‘వీడు చావడన్నా.. చావడు.. ఎందుకంటే నేను బతికే ఉన్నా కదా’ అని హీరోయిన్‌ పలికించిన హావభావాలు ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉన్నాయి. టీజర్‌ ముగింపులో నాయిక దెయ్యంలా ప్రత్యక్షమవడం ఉత్కంఠని రేకెత్తిస్తోంది.

కథానాయిక ఎందుకలా మారింది? ఈ ప్రేమజంటకి ఎదురైన భయంకర సంఘటన ఏంటి? ఈ లవ్‌ స్టోరీ మిస్టరీగా ఎందుకు మారింది? ‘అస్కర బస్కా’ తదితర పదాలకు అర్థమేంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వరుణ్‌ సందేశ్‌ సరసన ఫర్నాజ్‌ శెట్టి నటిస్తోంది. నాయికానాయకలిద్దరూ తమ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నారు. నేపథ్య సంగీతం ఈ టీజర్‌కి ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రానికి ఎం.ఎస్‌.ఆర్‌. దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ బాలాజీ పిక్చర్స్‌ పతాకంపై మాధవి ఆదుర్తి నిర్మిస్తున్నారు. శివ కాకాని సంగీతం అందిస్తున్నారు. రఘుబాబు, అలీ, నాగినీడు, సురేఖ వాణి, తాగుబోతు రమేశ్‌, ధన్‌రాజ్‌, మహేశ్‌ విట్టా తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని