Published : 23 Nov 2021 09:21 IST

Naga chaitanya: బర్త్‌డే స్పెషల్‌.. చైతూ గురించి ఈ విషయాలు తెలుసా?

సినీ పరిశ్రమలో రెండు ప్రముఖ కుటుంబాల వారసుడు... అయినా  వారసత్వం గురించి చెప్పుకోవడం కనిపించదు... అభిమానులు, ఆస్తులు తక్కువేం కాదు... కానీ గొప్పలకు పోయే మనస్తత్వం కాదు...చూడ్డానికి సాఫ్ట్‌గా కనిపించినా.. బండి యాక్సిలేటర్‌ తొక్కితే రేసరే! తనే అభిమానించే వారంతా ముద్దుగా ‘చైతూ’గా పిలుచుకునే అక్కినేని నాగచైతన్య(Naga chaitanya)...ఎదిగికొద్దీ ఒదుగుతూ.. పక్కింటి కుర్రాడిలా కలిసిపోయే ఈ బర్త్‌డే బోయ్‌ విశేషాలు తెలుసుకుందామా!

వారసుడిగా..

యువసామ్రాట్‌ అక్కినేని నాగార్జున, దగ్గుబాటి లక్ష్మిలకు ముప్ఫై ఆరేళ్ల కిందట హైదరాబాద్‌లో జన్మించాడు చైతూ. అటు అక్కినేని కుటుంబం.. ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ.. ఘనమైన వారసత్వం. కానీ తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిపోవడంతో తల్లి లక్ష్మి దగ్గరే ఎక్కువగా చెన్నైలో పెరిగాడు. అక్కడే పీఎస్‌బీబీ స్కూల్‌లో స్కూలింగ్‌ పూర్తిచేసి హైదరాబాద్‌ తిరిగొచ్చాడు. సెయింట్‌ మేరీస్‌ కాలేజీలో కామర్స్‌ పూర్తి చేశాడు. తను మెరిట్‌ విద్యార్థి కాదు.. అలాగని వెనకబెంచీ విద్యార్థి కాదు. క్లాసులకెళ్లింది తక్కువ.


తెరంగేట్రం..

టీనేజీలో 98 కేజీలతో చాలా లావుగా ఉండేవాడు. అంతా ‘డంబూ’ అని పిలిచేవారు. అమ్మమ్మ తరపు దగ్గుబాటి కుటుంబంలో బాగా ముద్దు చేసేవారు. డిగ్రీ మధ్యలోకి వచ్చేవరకూ ఏం కావాలనేది క్లారిటీ లేదు. సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచనే లేదు. అప్పుడప్పుడు నాన్నతో కలిసి షూటింగ్‌లకు వెళ్లడంతో మెల్లగా సినిమాలపై ఆసక్తి మొదలైంది. నాన్నతో చెబితే ‘నీ ఇష్టం’ అన్నారు. తర్వాత ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టి బరువు తగ్గాడు. నెలన్నరపాటు ముంబయిలోని ఒక వర్క్‌షాప్‌కి పంపించారు నాగార్జున. తర్వాత కూడా యాక్టింగ్‌పై ఆసక్తి ఉంటే చూద్దాం అన్నారు. వెళ్లొచ్చాడు. సినిమాల్లోకి వెళ్తానన్నాడు. అక్కడి నుంచి కాలిఫోర్నియాలోని ఓ యాక్టింగ్‌ స్కూల్‌లో ఏడాదిన్నర శిక్షణ తీసుకున్నాడు. ‘అక్కినేని కుటుంబంలో పుట్టడంతో సహజంగానే సినిమాలపై ఆసక్తి మొదలైంది. కానీ యాక్టర్‌ కావాలని నన్ను ఎవరూ బలవంతం చేయలేదు. 20 ఏళ్ల వయసున్నప్పుడు సినిమాల్లోకి వెళ్లాలా? వద్దా? అవి నాకు సూటవుతాయా? లేదా? అని చాలా సందిగ్ధంలో ఉన్నా. చివరికి ఓ నిర్ణయం తీసుకున్నా. నేను పరిశ్రమలోకి వెళ్లాలని రాసి పెట్టి ఉందని అప్పుడు అర్థమైంది’ అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.


మెరుగైన నటుడిగా...

2009లో ‘జోష్‌’ సినిమాతో నాగచైతన్య తెరంగేట్రం చేశాడు. ఇప్పటిదాకా మొత్తం పాతిక చేశాడు. ఏ మాయ చేశావే, 100 పర్సెంట్‌ లవ్‌, ప్రేమమ్‌, మనం, రారండోయ్‌ వేడుకచూద్దాం, మజిలీ, లవ్‌స్టోరీలు బాక్సాఫీసు దగ్గర విజయం సాధించాయి. కొన్ని చిత్రాల్లో నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఫిల్మ్‌ఫేర్‌, సైమా, సినీమా, సంతోషం.. పలు అవార్డులు అందుకున్నాడు.


మాధ్యమాలకు దూరం

సామాజిక మాధ్యమాలు, మీడియాకు దూరంగా ఉండే తెలుగు నటుల్లో చైతన్య ఒకడు. ఈమధ్య ఫర్వాలేదుగానీ మొదట్లో మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చింది కూడా తక్కువే. ‘వ్యక్తిగత జీవితం ప్రైవేటుగానే ఉండాలి. అన్నీ సోషల్‌ మీడియాలో పంచుకుంటే ఇంక వ్యక్తిగతం ఏముంటుంది? జీవితంలో చాలా సమయం కెమెరా ముందే ఉంటా. ఒంటరిగా ఉండేది కొద్దిసమయమే. ఆన్‌లైన్‌లో అది కూడా పంచుకోవాలంటే ఇంక అర్థం ఏముంటుంది?’ ఇదీ చైతూ అభిప్రాయం.


రేసింగ్‌పై మమకారం

చూడ్డానికి సాఫ్ట్‌గా కనిపించినా తను సూపర్‌ బైక్‌లు, హై-స్పీడ్‌ కార్లను అవలీలగా నడిపేయగలడు. నిజానికి ముందు రేసర్‌ కావాలనుకున్నాడు. కొన్ని పోటీల్లో కూడా పాల్గొన్నాడు. ఫెరారీ, నిస్సాన్‌ జీటీ-ఆర్‌, పోర్షె పనమెరా, పోర్షె కాయన్నే, రేంజ్‌రోవర్‌ వోగ్‌లాంటి అత్యంత వేగవంతమైన కార్లు తన గ్యారేజీలో ఉన్నాయి. వీటితోపాటు ఎంవీ అగస్టా, బీఎండబ్ల్యూ బైక్‌లూ కొలువుదీరాయి. అప్పుడప్పుడూ వీటిపై కూడా హైదరాబాద్‌ రోడ్లపై జామ్మంటూ దూసుకెళ్తుంటాడు. ఖాళీగా ఉన్నప్పుడు ఈ బైక్‌లను సరదాగా ‘స్పిన్‌’ చేస్తుంటాడు.


కండరగండడేం కాదు

సిక్స్‌ప్యాక్‌లు పెంచడం, కండలు ప్రదర్శించడంలాంటివేం లేవుగానీ చైతూ క్రమం తప్పకుండా వర్కవుట్లు చేస్తాడు. ఇంట్లోనే చిన్నపాటి జిమ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ‘జిమ్‌కి వెళ్లడం, గేమ్‌ ఆడటం అనేవి యాంత్రికంగా కాకుండా మనస్ఫూర్తిగా ఉండాలి. మనసు పెట్టి చేయాలి. వాటితో మనకు ఎమోషనల్‌ అటాచ్‌మెంట్‌ ఉండాలి. అప్పుడే వ్యాయామాన్ని ఎంజాయ్‌ చేస్తాం. ఫిట్‌నెస్‌ సాధిస్తాం’ అంటూ తన అభిప్రాయం చెప్పాడోసారి.


ఏకైక స్నేహితుడు

చైతూకు ముందునుంచీ మొహమాటం ఎక్కువ. ఎవరితోనూ పెద్దగా స్నేహం చేయడు. ఇండస్ట్రీలో బెస్ట్‌ ఫ్రెండ్‌ ఎవరంటే వెంటనే చెప్పే పేరు రానా దగ్గుబాటి. తను ఆన్‌స్క్రీన్‌, ఆఫ్‌స్క్రీన్‌లో కూడా స్నేహితుడే. బంధువు కావడంతో చిన్నప్పట్నుంచీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. రానా నాగచైతన్యని ‘స్వీట్‌ కిడ్‌’ అంటుంటాడు. తన మంచితనం, వ్యక్తిత్వాన్ని ఎవరైనా ఇష్టపడతారు అంటూ మెచ్చుకుంటాడు. సినిమా పరిశ్రమలో కాకుండా తనకు కాలేజీ ఫ్రెండ్స్‌ ఇంకో ముగ్గురు ఉన్నారంటాడు నాగచైతన్య.


* బటర్‌ చికెన్‌ అంటే బాగా ఇష్టం. వారంలో రెండురోజులైనా లాగిస్తాడు.

* నాగార్జున, చైతూ స్నేహితుల్లా ఉంటారు. కొన్ని విషయాల్లో చైతూ సలహాలు తీసుకుంటానంటారు నాగార్జున.

* ‘యూ నో’ అనేది నాగచైతన్య ఊతపదం.

* కత్రినా కైఫ్‌ అంటే చైతూకి క్రష్‌.

* శివ, నిన్నే పెళ్లాడతా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు తన ఫేవరెట్‌ సినిమాలు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని