Jayamma Panchayathi: జయమ్మ గొడవేంది?

జయమ్మ చాలా గడుసైన మహిళ. ఆమెకో సమస్య వచ్చింది. చుట్టు పక్కల ఊళ్లల్లో ఎవరికీ ఎప్పుడూ రానటువంటి సమస్య అది. అందుకే పంచాయితీ పెట్టింది. తన గొడవలో న్యాయం ఉందని పంచాయితీ పెద్దలు తేల్చారు.....

Updated : 13 Dec 2021 07:02 IST

యమ్మ చాలా గడుసైన మహిళ. ఆమెకో సమస్య వచ్చింది. చుట్టు పక్కల ఊళ్లల్లో ఎవరికీ ఎప్పుడూ రానటువంటి సమస్య అది. అందుకే పంచాయితీ పెట్టింది. తన గొడవలో న్యాయం ఉందని పంచాయితీ పెద్దలు తేల్చారు. రెండు రోజుల్లో ఈ తగవు తేల్చకపోతే మీరూ ఉండరు, మీ పంచాయతీ ఉండదని హెచ్చరించింది జయమ్మ. ఇంతకీ ఆమెకి వచ్చిన సమస్య ఎలాంటిది? అది ఎలా పరిష్కారమైందో తెలియాలంటే ‘జయమ్మ పంచాయితీ’ చూడాల్సిందే. ప్రముఖ యాంకర్‌ సుమ ప్రధానలో నటించిన చిత్రమిది. విజయ్‌ కుమార్‌ కలివరకు దర్శకత్వం వహిస్తున్నారు. వెన్నెల క్రియేషన్స్‌ పతాకంపై బలగ ప్రకాష్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని ఆదివారం ప్రముఖ కథానాయకుడు రానా దగ్గుబాటి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘ఎవరి పేరు చెబితే తెలుగు పరిశ్రమలో ముందస్తు విడుదల వేడుక తేదీలు మారిపోతాయో ఆవిడే సుమ. ఈమె ఏ సంస్కృతిలోనైనా, ఏ స్థాయి వ్యక్తులతోనైనా కలిసిపోగలరు. ఆమె వేడుకల్ని నిర్వహిస్తున్నారంటే అందరూ సౌకర్యంగా ఉంటారు. అంతటి ప్రేమని ఇచ్చిన సుమకి ఎంత  తిరిగిచ్చినా తక్కువే. ఈ సినిమాని ఘన విజయం సాధించాలి. ఇలానే మరెన్నో భాషల్లో షోలు, సినిమాలు చేస్తూనే ఉండాలి’’ అన్నారు. సుమ మాట్లాడుతూ ‘‘రానా దగ్గుబాటి తొలి చిత్రం ‘లీడర్‌’ తొలి వేడుకని నేనే నిర్వహించా. ఇప్పుడు నా సినిమా వేడుకకి ఆయన హాజరు కావడం ఆనందంగా ఉంది. భిన్నంగా ఏదైనా  ప్రయత్నించాలని మూడేళ్లుగా చాలా మందికి చెబుతున్నా. సరే అంటారు కానీ, ఎవ్వరూ అవకాశం ఇవ్వలేదు. ఇక నమ్మకం కోల్పోయిన దశలో దర్శకుడు విజయ్‌ కుమార్‌ని తీసుకొచ్చారు భువన్‌. ఆయన కథ చెప్పినప్పుడు ఈమధ్యకాలంలో ఇలాంటి కథని చూడలేదనిపించింది. శ్రీకాకుళం నేపథ్యంలోసాగే కథ ఇది. ఆ యాసని నేర్చుకుని ఈ సినిమా చేశా. దీనికి వెయ్యేనుగుల బలం కీరవాణి సర్‌. స్క్రిప్ట్‌ విని చాలా బాగుందని మెచ్చుకున్నారు. జయమ్మ సుమలా కాదు, చాలా బలమైన మహిళ. గ్రామీణ నేపథ్యంలో సాగే ఆమె కథే ఇది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నేనూ తనలాగే ఉండాలనుకున్నా’’ అన్నారు.  నిర్మాత మాట్లాడుతూ ‘‘భవిష్యత్తులో సుమ అని కాకుండా, జయమ్మ అనే పిలుస్తారు. విజయ్‌ చాలా మంచి కథతో తెరకెక్కించాడు. మైమరిపించేలా ఉంటుందీ చిత్రం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాయాగ్రాహకుడు అనూష్‌కుమార్‌తోపాటు, అమర్‌ అఖిల, దినేష్‌, షాలిని తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని