Maa Elections: మెగా ఫ్యామిలీతో వివాదం ఎప్పుడో ముగిసింది.. బండ్ల గణేశ్‌ ఆరోపణలు అర్థ రహితం

Jeevitha Rajashekar: మా ఎన్నికల నేపథ్యంలో జీవితా రాజశేఖర్‌ ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూ

Updated : 07 Sep 2021 09:23 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌(మా)లో ఉన్న సభ్యుల సంక్షేమం కోసం తన ఆలోచనావిధానాలకు దగ్గరగా ప్రకాశ్ రాజ్ ప్యానెల్ ఉన్నందునే ఆ ప్యానెల్ తరపున జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేస్తున్నట్లు జీవితా రాజశేఖర్ తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి తనపై బండ్ల గణేశ్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితంగా ఉన్నాయన్నారు. జనరల్ సెక్రటరీగా పోటీ నుంచి తప్పుకొనే ప్రసక్తే లేదన్నారు. అలాగే మెగా కుటుంబంతో తమకు గతంలో విబేధాలున్న మాట వాస్తవమేనని, అయితే అవన్నీ ఇప్పుడు సద్దుమణిగాయని ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖీలో స్పష్టం చేశారు.

నిన్నటి వరకూ ఒంటరిగా పోటీ చేస్తానన్న మీరు, ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో పోటీ చేయడం వెనుక కారణం ఏంటి?

జీవిత: ఈసారి ఒంటరిగా పోటీచేస్తానని నేను ఎక్కడా చెప్పలేదు. అదంతా మీడియా సృష్టే. ఈసారి కూడా జనరల్‌ సెక్రటరీగా పోటీ చేద్దామనే అనుకున్నా. ఎందుకంటే నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. గత ఎన్నికల్లో గెలిచినప్పుడు ‘మా’ సభ్యులతో మంచి అనుబంధం ఏర్పడింది. వాళ్లకు కావాల్సిన సాయం చేస్తూ వచ్చాను. ఈ క్రమంలో ఒంటరిగా వెళ్లాలా? లేక ఏదైనా ప్యానెల్‌ నుంచి పోటీ చేయాలా? అన్న నిర్ణయం తీసుకోలేదు. విష్ణుగారు, మోహన్‌బాబుగారు, ప్రకాశ్‌రాజ్‌గారు నాతో మాట్లాడారు. ‘మా’ సభ్యులకు ఏం విధంగా సాయం చేయాలన్న విషయాలపై నాకు అవగాహన ఉంది. ఇదే విషయాన్ని ప్రకాశ్‌రాజ్‌గారితో చర్చిస్తే ఆయన ఆమోదించారు. ఇంకా అదనంగా ఏమేం చేయొచ్చో కూడా ఆయన సూచించారు. అందుకే ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌లో పోటీ చేసేందుకు ఒప్పుకొన్నా.

‘మా’కు మహిళా అధ్యక్షురాలిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారు!

జీవిత: మహిళా అధ్యక్షురాలిని ఎందుకు ఎన్నుకోలేకపోతున్నారన్నది నాకూ ప్రశ్నగానే మిగిలిపోయింది. జయసుధగారు పోటీ చేసినప్పుడు ఆమె అవుతారేమో అనుకున్నా. అది జరగలేదు. భవిష్యత్‌లో తప్పకుండా అవ్వాలి. ప్రకాశ్‌రాజ్‌గారి ప్యానెల్‌లో ఎక్కువ మంది మహిళలకు అవకాశం ఇచ్చారు. ఇంకా మహిళా శక్తి పెరగాలి.

మీరు తరచూ మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతోంది. ఆ కారణంతోనే బండ్ల గణేశ్‌ బయటకు వస్తున్నానని చెప్పారు. దీనిపై స్పష్టమైన సమాధానం ఇవ్వండి.

జీవిత: మెగా ఫ్యామిలీకి మాకూ వివాదం జరిగి చాలా సంవత్సరాలు అయింది. మా పిల్లలకు అప్పుడు ఆరేళ్లు. ఇప్పుడు ఇరవై ఏళ్లు. ఒక ఇంట్లో ఉండే అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, తల్లిదండ్రులు గొడవలు పడతారు. ఆ ఒక్క విషయాన్ని పట్టుకుని ప్రతిసారీ ‘మెగా ఫ్యామిలీ-రాజశేఖర్‌గారు’ అంటూ పెద్దది చేసి చూపిస్తున్నారు తప్ప, ఆ తర్వాత ఎప్పుడూ వివాదం జరగలేదు. డైరీ విడుదల సందర్భంగా జరిగిన వివాదంలో చిరంజీవిగారికి సంబంధం లేదు. నరేశ్‌, మిగిలిన ‘మా’ ప్యానల్‌కు సంబంధించి రాజశేఖర్‌ మాట్లాడారు. ‘మా’లోని ఇతర సభ్యులకు సర్దిచెబుతూ పనిచేయాలని సూచించారు. అయితే, అందుకు నరేశ్‌ ఒప్పుకోలేదు. మరి వాళ్లకూ, నరేశ్‌కు ఏం జరిగిందో మాకు తెలియదు. అయితే, అలా మాట్లాడానికి అది సరైన సమయం కాదని చిరంజీవి అన్నారంతే.  అయితే, మీడియానే దాన్ని పెద్దది చేసి చూపించింది. ప్రతిదాన్నీ ఎప్పుడో జరిగిన గొడవకు ఆపాదిస్తున్నారు. ఎవరి సమస్యలు వాళ్లకున్నాయి. కొవిడ్‌తో జీవనమే మరింత కష్టంగా మారింది. పనిలేని వాళ్లు చేసే అసత్య ప్రచారం ఇది. బండ్ల గణేశ్‌ మాట్లాడింది కూడా అర్థం లేదు.

మీరు ప్యానెల్‌లో ఉండటం వల్లే పోటీ చేస్తున్నానని బండ్ల గణేశ్‌ అన్నారు! కారణం ఏంటి?

జీవిత: ఆ సమస్య ఏంటో ఆయననే అడిగి తెలుసుకోవాలి. అయితే, బండ్ల గణేశ్‌ ఒక కారణం చెప్పారు. అది నాకే కాదు, విన్న వాళ్లకు కూడా హాస్యాస్పదంగా ఉంది. గతంలోనూ, ఇప్పుడూ బండ్ల గణేశ్‌తో మాకు ఎలాంటి విభేదాలు లేవు.. అలాగనీ 24గంటలూ కలిసుండే స్నేహం కూడా లేదు. మా కుటుంబానికి తెలిసిన వ్యక్తి. మంచి స్నేహితుడు అంతే. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా సక్సెస్‌ఫుల్‌ మ్యాన్‌. ప్రజాస్వామ్యంలో అందరికీ పోటీ చేసే అర్హత ఉంది. జీవిత పోటీ చేయడం వల్ల బయటకు వస్తున్నానని ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. ‘మా’కు అందరూ సపోర్ట్‌ చేస్తారు. గతంలో చిరంజీవిగారు అదే చెప్పారు. గెలిచిన వాళ్లకు తన పూర్తి సహకారం ఉంటుందని అంటారు తప్ప.. ఫలానా వాళ్లకు మద్దతు ఇస్తానని ఎక్కడా చెప్పలేదు.

ప్రస్తుతం ఉన్న వివాదాల నేపథ్యంలో ప్యానెల్స్‌ రద్దు చేసి, ఎన్నిక జరపాలని కొందరు సూచించారు. మీరేమంటారు?

జీవిత: వచ్చే ఎన్నికల్లో అది జరగాలని కోరుకుంటున్నా. అయితే, కొంతమందిని ఏకగ్రీవం చేస్తే, ఇంకా మంచిది. అప్పుడే గెలిచిన వాళ్లు కూడా బాధ్యతతో పనిచేస్తారు. పైగా కమిటీలో యూనిటీ ఉంటుంది.

చిత్ర పరిశ్రమలో తరచూ వివాదాలు వస్తున్నాయి. ఇప్పుడు డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు మొదలయ్యాయి. దీనిపై మీరేమంటారు.

జీవిత: ఎన్నికలు అయిపోతే వివాదాలు ఏమీ ఉండవు. ‘మా’ సభ్యులందరికీ ఒకటే విన్నపం. ఏదో ఒక ప్యానెల్‌ను పూర్తి మెజార్టీతో గెలిపించండి. ఒక ప్యానెల్‌ గెలిస్తే, తప్పకుండా వాళ్ల మాటకు కట్టుబడి ఉంటారు. ఇతరులతో పోలిస్తే, సినిమా పరిశ్రమలో డ్రగ్స్‌ వాడే వాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారు. గ్లామర్‌ ప్రపంచం కావటంతో అందరి దృష్టి సినిమా వాళ్లపై ఉంటుంది. ఏ విషయమైనా సరే దయచేసి సినిమా వాళ్లపై రాళ్లు విసరొద్దు. తప్పు చేసిన వాళ్లకు తప్పకుండా శిక్షపడాలి. అయితే, తప్పు చేశాడా? లేదా? అన్న స్పష్టత రాకుండానే వాళ్లని లక్ష్యంగా చేసుకోవడం కూడా మంచిది కాదు. ‘మా’ ప్యానెల్‌ గెలిస్తే, దీనిపై స్పష్టమైన వైఖరి అవలంబిస్తాం. లీగల్‌ ప్యానెల్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచన  కూడా ఉంది. నటుల మర్యాద కాపాడటానికి గట్టిగా పోరాడతాం. ఈ విషయంలో ప్రకాశ్‌రాజ్‌ చొరవ చూపిస్తున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని