Kanabadutaledu: ఈ కథలో హీరోల్లేరు అందరూ విలన్లే..!

ట్రైయాంగిల్‌ ప్రేమకథతో క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సిద్ధమైన చిత్రం ‘కనబడుటలేదు’. నటుడు సునీల్‌ కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది....

Published : 08 Aug 2021 14:32 IST

హైదరాబాద్‌: ట్రైయాంగిల్‌ ప్రేమకథతో క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా సిద్ధమైన చిత్రం ‘కనబడుటలేదు’. నటుడు సునీల్‌ కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుక జరిగింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ‘కనబడుటలేదు’ ట్రైలర్‌ విడుదల చేసింది. ఇందులో సునీల్‌ డిటెక్టివ్‌గా కనిపించనున్నారు.

‘ఆదిత్య అనే అబ్బాయి శిశిత అనే అమ్మాయిని ప్రేమించాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం సూర్య అనే మరో అబ్బాయితో ప్రేమలో పడుతుంది. సూర్య-శిశితల విషయం పెద్దవాళ్లకు తెలియడంతో ఇంట్లో గొడవలు జరుగుతాయి. దాంతో వాళ్లిద్దరూ ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకుంటారు. అప్పటి నుంచి సూర్య కనిపించకుండాపోతాడు. సూర్య కేసు డీల్‌ చేస్తున్న విక్టర్‌ రాజు అనే ఎస్సై కూడా కనిపించకుండాపోతాడు’ అంటూ సాగే ట్రైలర్‌ ప్రతి క్షణం ఉత్కంఠకు గురి చేసింది. డిటెక్టివ్‌గా సీరియస్‌ లుక్‌లో సునీల్‌ నటన ఆకట్టుకునేలా ఉంది. ‘ఈ కథలో హీరోల్లేరు అందరూ విలన్లే’ అనే డైలాగ్‌లు ప్రేక్షకుడిని కథలో లీనం చేసేలా ఉన్నాయి. బాలరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని