Updated : 29 Oct 2021 17:13 IST

puneeth Rajkumar: కన్నడ పవర్‌స్టార్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూత

రాష్ట్రవ్యాప్తంగా థియేటర్లు బంద్‌

ఆస్పత్రికి చేరుకుంటున్న సినీ, రాజకీయ ప్రముఖులు

రేపు అంత్యక్రియలు

బెంగళూరు: ప్రముఖ కన్నడ హీరో, పవర్‌స్టార్‌ పునీత్ రాజ్‌కుమార్‌ (46) తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం ఇంట్లో జిమ్‌ చేస్తుండగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోయిన ఆయన్ని కుటుంబసభ్యులు హుటాహుటిన విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. వెంటనే స్పందించిన వైద్యులు ఆయన్ను బతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయినా పునీత్‌ ప్రాణాలు దక్కలేదు. పునీత్‌ మరణంతో కన్నడ సినీ పరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం కన్నడ చిత్రపరిశ్రమకు తీవ్రలోటు అని సినీ ప్రముఖులు వెల్లడించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. పునీత్‌ మరణవార్త విని అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సినీ నటులు, రాజకీయ ప్రముఖులు పునీత్‌ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఉదయం ఏం జరిగిందంటే..!

రోజూ లాగే పునీత్‌ రాజ్‌కుమార్‌ వ్యాయామం చేయడం మొదలు పెట్టారు. ఉదయం 9.30 గంటల సమయంలో వ్యాయామం చేస్తున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. గుండెలో నొప్పిగా ఉందని చెప్పడంతో, ఆయన సిబ్బంది వెంటనే దగ్గర్లోని రమణశ్రీ ఆస్పత్రికి తరలించారు. కార్డియాక్‌ అరెస్ట్‌ అయినట్లు గుర్తించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం మరొక ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో పునీత్‌ను విక్రమ్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు ఐసీయూకు తరలించి చికిత్స అందించే ప్రయత్నం చేశారు. అయితే, పరిస్థితి చేయి దాటిపోయింది. పునీత్‌ తుదిశ్వాస విడిచారు. అయితే, ఈ విషయాన్ని వెంటనే ప్రకటించలేదు. సమాచారం తెలుసుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, హోం మంత్రి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. తర్వాత ఏం చేయాలన్న దానిపై చర్చించారు. పునీత్‌ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడారు. పునీత్‌ అంత్యక్రియలు గురించి ఈ సందర్భంగా చర్చించారు. పునీత్‌ భౌతిక కాయాన్ని తొలుత ఆయన నివాసానికి అనంతరం అభిమానుల సందర్శనార్థం కంఠీరవ స్టేడియానికి తరలించనున్నారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కర్ణాటకలో హై అలర్ట్‌

మరోవైపు క‌ర్ణాట‌క రాష్ట్రవ్యాప్తంగా హైఅల‌ర్ట్ ప్రకటించారు. ఆస్పత్రి ఆవరణతోపాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు పెంచారు. రెండు రోజులపాటు సినిమా థియేటర్లు మూసివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పునీత్‌ మరణవార్త తెలిసి పెద్ద ఎత్తున అభిమానులు విక్రమ్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. వారిని అదుపు చేయటం పోలీసులకు ఇబ్బందిగా మారింది.

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ మూడో కుమారుడు పునీత్‌ రాజ్‌కుమార్‌. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన పునీత్‌.. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘బెట్టడా హువు’ చిత్రానికి గానూ ఉత్తమ బాలనటుడిగా అవార్డు సొంతం చేసుకున్నారు. హీరోగా ఇప్పటివరకూ ఆయన 32 చిత్రాల్లో నటించారు. ‘వసంత గీత’, ‘భాగ్యవంత’, ‘ఏడు నక్షత్రాలు’, ‘భక్త ప్రహ్లాద’, ‘యరివాను’ వంటి చిత్రాలు ఆయనకు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇటీవల ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘యువరత్న’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పునీత్‌ సుపరిచితమే. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులోనూ డబ్‌ అయ్యాయి.Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని