Karan Johar: నా ఇల్లేం హాట్‌స్పాట్ కాదు.. నేను ఇచ్చింది పార్టీ కాదు 

బాలీవుడ్‌లో ప్రముఖులు కరోనా బారినపడటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇంటిలో ఇచ్చిన విందు ఈ వివాదానికి కేంద్ర బిందువైంది. దీనిపై కరణ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు.

Published : 15 Dec 2021 15:24 IST

ముంబయి: బాలీవుడ్‌లో ప్రముఖులు కరోనా బారినపడటం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ఇంటిలో ఇచ్చిన విందు ఈ వివాదానికి కేంద్ర బిందువైనట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కరణ్‌ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. తన ఇల్లేమీ కరోనా హాట్‌స్పాట్ కాదని.. తాను ఇచ్చింది కేవలం విందు మాత్రమేనన్నారు. అది పార్టీ కాదని తనపై వస్తోన్న విమర్శలను తోసిపుచ్చారు.

‘నాతో సహా నా కుటుంబం, ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. నేను రెండుసార్లు పరీక్ష చేయించుకున్నాను. దేవుడి దయ వల్ల అందరికీ నెగెటివ్ వచ్చింది. ఈ నగరాన్ని సురక్షితంగా ఉంచేందుకు బీఎంసీ తీసుకుంటున్న చర్యలకు సెల్యూట్ చేస్తున్నాను. దీనిపై కొందరు మీడియా సిబ్బందికి స్పష్టత ఇవ్వదల్చుకున్నాను. ఎనిమిది మంది వ్యక్తులు ఆత్మీయంగా కలుసుకుంటే అది పార్టీ కాదు. కొవిడ్ నిబంధనలను కఠినంగా పాటించే నా ఇల్లు.. కచ్చితంగా కొవిడ్ హాట్‌స్పాట్ కాదు. కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండటం మనందరి బాధ్యత. మహమ్మారిని ఎవరు తేలిగ్గా తీసుకోరు. రిపోర్టింగ్‌ చేసే సమయంలో కొందరు మీడియా సిబ్బంది సంయమనం పాటించాలని కోరుతున్నాను’ అంటూ కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రాంలో పోస్టు పెట్టారు.

కరీనా కపూర్, అమృత అరోడాతో పాటు కొంతమంది బీటౌన్ ప్రముఖులు ఈ నెల 8వ తేదీన కరణ్‌జోహార్ ఇంట్లో డిన్నర్‌కి వెళ్లారు. ఆ తర్వాతే కరీనా, అమృత కరోనా బారినపడ్డారు. వీరితో పాటు సీమా ఖాన్‌, మహీప్‌ కపూర్‌లకు కూడా కొవిడ్‌ సోకింది. ఈ పార్టీకి హాజరైన వారిలో పలువురికి వైరస్‌ సోకినట్లు తెలుస్తోంది. అయితే పార్టీలో ఒకరు దగ్గుతూ కన్పించారని, వారి నుంచే మిగతా వారికి వైరస్‌ సోకి ఉంటుందని కరీనా అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని