Updated : 08 Oct 2021 16:56 IST

Konda Polam Movie Review: ‘కొండ పొలం’ మూవీ రివ్యూ

చిత్రం: కొండ‌పొలం; న‌టీన‌టులు: వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, కోట శ్రీనివాసరావు, సాయిచంద్, హేమ, ఆంటోని, రవిప్రకాశ్, మహేశ్ విట్ట, రచ్చ రవి త‌దిత‌రులు; ఛాయాగ్రహ‌ణం: జ్ఞాన శేఖర్ వీఎస్; కథ: సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి; ఎడిటర్: శ్రావన్ కటికనేని; క‌ళ‌: రాజ్ కుమార్ గిబ్సన్; పోరాటాలు: వెంకట్; సంగీతం: ఎంఎం కీరవాణి; నిర్మాత: సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి; దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి; సంస్థ‌: ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌; విడుద‌ల‌: 08-10-2021

చాలా రోజుల త‌ర్వాత తెలుగు తెర‌పైకొచ్చిన న‌వ‌లా చిత్రం ‘కొండ‌పొలం(Konda Polam)’. స‌న్న‌పురెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి రాసిన న‌వ‌ల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. విజ‌య‌వంత‌మైన ‘ఉప్పెన‌’ త‌ర్వాత వైష్ణ‌వ్‌తేజ్(vaishnav tej) న‌టించిన చిత్రం కావ‌డం... క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం!

క‌థేంటంటే: ర‌వీంద్ర‌నాథ్ (వైష్ణ‌వ్‌తేజ్‌) గొర్రెల కాపరుల కుటుంబానికి చెందిన ఓ యువ‌కుడు.  ఉద్యోగవేట‌లో హైద‌రాబాద్ చేరుకుంటాడు. నాలుగేళ్లు ప్ర‌య‌త్నించినా ఉద్యోగం రాదు. ఆత్మ‌విశ్వాస లోప‌మే త‌న‌కి శాపంగా మారుతుంది. ఎంత‌కీ ఉద్యోగం రాక‌పోవ‌డంతో తిరిగి ఊరికి చేరుకుంటాడు. క‌రవు కాట‌కాల వ‌ల్ల తండ్రితో పాటు గొర్రెల్ని మేప‌డం కోసం కొండ‌పొలానికి వెళ‌తాడు. అక్క‌డికి వెళ్లాక  ఆ యువ‌కుడికి అడ‌వి ఏం నేర్పింది?  గొర్రెల్ని కొండ‌పొలానికి(Konda Polam) తీసుకెళ్లి వ‌చ్చాక అత‌నిలో వ‌చ్చిన మార్పేమిటి?యూపీఎస్సీలో ఐ.ఎఫ్‌.ఎస్‌కి ఎంపికయ్యేంత ఆత్మ‌విశ్వాసాన్ని ఎలా సంపాదించాడ‌నేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: న‌ల్ల‌మ‌ల నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ఓ యువ‌కుడి సాహ‌స యాత్ర. వెన్నెముక లేన‌ట్టుగా భ‌యం భ‌యంగా క‌నిపించే ఓ యువ‌కుడు... ఆత్మ‌విశ్వాసంతో త‌ల‌పైకెత్తి నిలిచేంత ధైర్యాన్ని, త‌న‌పై త‌న‌కి న‌మ్మ‌కాన్ని అడ‌వి, అడ‌విలాంటి ఓ యువ‌తి ఎలా ఇచ్చార‌నేది ఈ సినిమాలో ఆస‌క్తిక‌ర‌మైన అంశం. గొర్రెల కాపరుల జీవిత చిత్రాన్ని తెర‌పై స‌హ‌జంగా ఆవిష్క‌రిస్తూ మొద‌ల‌య్యే ఈ క‌థ‌... అడ‌విలోకి వెళుతున్న‌ కొద్దీ ప్ర‌యాణం సాగుతున్న‌ కొద్దీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంది. క‌థానాయ‌కుడికి ఎదుర‌య్యే ఒక్కొక్క స‌వాల్‌... ఒక్కో వ్య‌క్తిత్వ వికాస పాఠంలా ఉంటుంది. అడ‌వి ఎంత గొప్ప‌దో, దాన్ని ప‌రిర‌క్షించాల్సిన బాధ్యత మ‌న‌పై ఎంత ఉందో ఆ స‌న్నివేశాలు చాటి చెబుతాయి.

ఆరంభంలో పిరికివాడిగా క‌నిపించిన క‌థానాయ‌కుడు... అడ‌వితో మ‌మేక‌మైన‌కొద్దీ  ధైర్య‌శాలిగా మారే క్ర‌మం, పులితో చేసే పోరాటం సినిమాకి హైలైట్‌. న‌వ‌ల వేరు, దాన్ని సినిమాగా మ‌ల‌చ‌డం వేరు. పుస్త‌కంలో ప్ర‌తిదీ డీటెయిల్డ్‌గా చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది.  కానీ, సినిమాలో అన్ని సౌల‌భ్యాలు ఉండ‌వు. అక్క‌డే ద‌ర్శ‌కుడి ప‌నిత‌నం క‌నిపిస్తుంది.  పుస్త‌కం స్థాయిలో ఉత్కంఠ, భావోద్వేగాలు  ఈ సినిమాలో పండ‌క‌పోవ‌డంతో అక్క‌డ‌క్క‌డా  స‌న్నివేశాలు సాగ‌దీత‌గా అనిపిస్తాయి.  విజువ‌ల్ ఎఫెక్ట్స్ కూడా ఆశించిన స్థాయిలో లేక‌పోవ‌డంతో ఉత్కంఠ రేకెత్తించాల్సిన పోరాట ఘ‌ట్టాలు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి. న‌వ‌ల‌లో లేని ఓబులమ్మ పాత్ర సినిమాలో ఉంటుంది. ఆ పాత్ర ఆధారంగా అంత‌ర్లీనంగా ఓ ప్రేమ‌క‌థ‌ని జోడించారు ద‌ర్శ‌కుడు. ఆ ప్ర‌య‌త్నం సినిమాకి మేలే చేసింది. కొద్దిలో కొద్దిగా వాణిజ్యాంశాల్ని మేళ‌వించిన‌ట్టైంది.  ఓబు - ర‌వీంద్ర నేప‌థ్యంలో ప‌తాక స‌న్నివేశాలు ఆసక్తిగా సాగాయి. సినిమాకి మాట‌లు, పాట‌లు ప్ర‌ధాన  ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి.

ఎవ‌రెలా చేశారంటే: వైష్ణ‌వ్‌తేజ్(vaishnav tej) త‌న న‌ట‌న‌తో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. గొర్రెల కాప‌రుల కుటుంబానికి చెందిన యువ‌కుడిగా పాత్ర‌లో ఒదిగిపోయాడు. రాయ‌ల‌సీమ యాస ప‌లికిన విధానం కూడా మెప్పిస్తుంది. పులితో చేసే పోరాట ఘ‌ట్టాల్లోనూ, క‌థానాయిక‌తో క‌లిసి చేసిన స‌న్నివేశాల్లోనూ  ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఓబుల‌మ్మ‌గా ర‌కుల్(rakul preet singh) కూడా చాలా స‌హ‌జంగా న‌టించింది.  సాయిచంద్‌, ర‌విప్ర‌కాశ్, కోట శ్రీనివాస‌రావు, మ‌హేశ్ పాత్ర‌లు కూడా హ‌త్తుకునేలా ఉంటాయి. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది.  మాట‌లు, పాట‌లు సినిమాకి బ‌లాన్నిచ్చాయి.  కీర‌వాణి ర‌య్ ర‌య్ ర‌య్యారే అంటూ స‌మ‌కూర్చిన నేప‌థ్య సంగీతం స‌న్నివేశాల‌కి ఊపు తీసుకొచ్చింది. జ్ఞాన‌శేఖ‌ర్ కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ నాసిర‌కంగా అనిపిస్తాయి.  ఓ న‌వ‌ల‌ని సినిమాగా మ‌లిచిన విష‌యంలో క్రిష్ ప్ర‌య‌త్నం మెచ్చుకోత‌గ్గ‌ది. కానీ క‌థ‌నం, పాత్ర‌ల మ‌ధ్య  భావోద్వేగాల ప‌రంగా ఆయ‌న మ‌రిన్ని క‌స‌ర‌త్తులు చేయాల్సింది. 

బ‌లాలు

+ అడ‌వి నేప‌థ్యంలో సాగే క‌థ

+ వైష్ణవ్‌ తేజ్ న‌ట‌న

+ కీర‌వాణి సంగీతం,  ప‌తాక స‌న్నివేశాలు

బ‌ల‌హీన‌త‌లు

- నిదానంగా సాగే కొన్ని స‌న్నివేశాలు

- భావోద్వేగాలు అంతగా పండకపోవటం

చివ‌రిగా:  కొండ‌పొలం(Konda Polam)... ఓ వ్యక్తిత్వ వికాస పాఠం!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

ఇదీ చదవండి: రివ్యూ: కోల్డ్‌కేస్‌


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts