Lakshya: ‘లక్ష్య’కి భావోద్వేగాలే బలం

వెండితెరపై ఇప్పటిదాకా చూడని ఓ కొత్త ఆట నేపథ్యంతోపాటు, అన్ని రకాల భావోద్వేగాలున్న సినిమానే మా ‘లక్ష్య’ అన్నారు నిర్మాతలు నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌, పుస్కూరు రామ్మోహన్‌రావు. ఆ ఇద్దరూ శరత్‌ మరార్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘లక్ష్య’.

Updated : 09 Dec 2021 09:28 IST

వెండితెరపై ఇప్పటిదాకా చూడని ఓ కొత్త ఆట నేపథ్యంతోపాటు, అన్ని రకాల భావోద్వేగాలున్న సినిమానే మా ‘లక్ష్య’ అన్నారు నిర్మాతలు నారాయణ్‌దాస్‌ కె.నారంగ్‌, పుస్కూరు రామ్మోహన్‌రావు. ఆ ఇద్దరూ శరత్‌ మరార్‌తో కలిసి నిర్మించిన చిత్రం ‘లక్ష్య’. నాగశౌర్య, కేతిక శర్మ జంటగా నటించారు. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.  

* ‘‘సినిమాకి ఆన్‌లైన్‌ టికెటింగ్‌ వ్యవస్థ మంచిదే. టికెట్‌ ధరలే ఇబ్బందికరంగా ఉన్నాయి. తెలంగాణలో బాగున్నా, ఆంధ్రప్రదేశ్‌లోనే సమస్య. ఆ విషయంపై ప్రభుత్వంతో చర్చిస్తున్నాం. త్వరలోనే సానుకూలంగా స్పందిస్తారని నమ్ముతున్నాం. మన దగ్గరున్న థియేటర్లు దేశంలో ఎక్కడా లేవు. అత్యాధునిక హంగులతో నిర్మించాం. ప్రేక్షకులు అలాంటి థియేటర్లలోనే సినిమా చూడాలనుకుంటారు. కచ్చితంగా టికెట్‌ ధరలు పెంచాల్సిందే. ఆ ధరలు మరీ ఎక్కువ కాకూడదు, తక్కువ   కాకూడదనేదే మా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ ధరలు మరీ తక్కువగా నిర్ణయించారు. అది నిర్మాతలకి కష్టంగా మారింది. ప్రస్తుతం మా సంస్థలో నాగార్జున చిత్రంతోపాటు, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌ కథానాయకుడిగా ఓ సినిమా నిర్మిస్తున్నాం. శివకార్తికేయన్‌తో ఓ సినిమా, సుధీర్‌బాబుతో ఓ ప్రాజెక్టు చేస్తున్నాం. సందీప్‌కిషన్‌, విజయ్‌ సేతుపతి, గౌతమ్‌ మేనన్‌ల కలయికలో మరోటి చేస్తున్నాం’’.

* ‘‘మా సంస్థ నుంచి వచ్చిన ‘లవ్‌స్టోరి’ మంచి విజయాన్నిచ్చింది. ఆ ఉత్సాహంలోనే ఈ వారం ‘లక్ష్య’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. విలువిద్య నేపథ్యంలో ఇప్పటివరకు సినిమా రాలేదు. ఆ అంశమే అందరినీ ఆకట్టుకుంటుంది. మొదట ఈ కథ విన్నప్పుడు భయపడ్డా. పూర్తి కథ విన్నాక చేయాలని నిర్ణయించాం. ఆటతోపాటు, బలమైన భావోద్వేగాలు ఉన్న చిత్రమిది. రెండు తెలుగు రాష్ట్రాల్లో 250 థియేటర్లలోనూ, ఓవర్సీస్‌లో వంద థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు థియేటర్లకి వస్తారా? రారా? అనే సందేహాలు ఉండేవి. ‘అఖండ’తో ఆ భయాలన్నీ తొలగిపోయాయి. రెండేళ్ల కిందటే ఈ సినిమా శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులు అమ్మేశాం. ఇప్పుడు థియేటర్‌లో ప్రేక్షకులు చూడాలనేది మా కోరిక. సినిమాలు చిన్నవా పెద్దవా అనేది కాదు. కథ బాగుంటే అన్నీ చూస్తారు ప్రేక్షకులు’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని