Bigg Boss Telugu 5: షణ్ముఖ్‌.. నేనూ ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాం: సిరి

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈవారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ‘నీ ఇల్లు బంగారం కాను’ ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ఈ సందర్భంగా సన్నీకి మానస్‌ ఒక స్పెషల్‌ పవర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిని ఉపయోగించే విషయమై...

Published : 18 Nov 2021 10:47 IST

పూసలు దొంగిలించి.. కెప్టెన్సీ పోటీకి అర్హత సాధించిన సిరి

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ‘నీ ఇల్లు బంగారం కాను’ ఎంతో ఆసక్తిగా సాగుతోంది. ఈ సందర్భంగా సన్నీకి మానస్‌ ఒక స్పెషల్‌ పవర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. దానిని ఉపయోగించే విషయమై సన్నీని కన్ఫెషన్‌ రూమ్‌లోకి పిలిచాడు బిగ్‌బాస్‌. మానస్‌ ఇచ్చిన స్పెషల్‌ పవర్‌ ఉపయోగించడం ద్వారా.. ఇంటి సభ్యుల్లో ఒకరి నుంచి సగం బంగారు పూసలు తీసుకొని వేరొకరి ఇవ్వాలని బిగ్‌బాస్‌ చెప్పాడు. దీంతో తాను సిరి వద్ద నుంచి సగం పూసలు తీసుకుని.. మానస్‌కి ఇస్తానని కన్ఫెషన్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చిన సన్నీ ఇంటి సభ్యులకు తెలిపాడు. ఇది విన్నా వెంటనే షణ్ముఖ్‌ కలగజేసుకుని.. ‘‘మన ఇద్దరి మధ్య దూరం పెరిగింది. సిరి వద్ద నుంచి తీసుకున్న సగం పూసలను నాకిస్తే.. మన మధ్య స్నేహం బలపడుతుంది’’ అని సన్నీతో చెప్పాడు. అందుకు మానస్‌ కూడా అంగీకరించడంతో సన్నీ ఆ బంగారు పూసలను షణ్ముఖ్‌కు ఇచ్చేశాడు. ఇలా జరుగుతుందని తాను ముందే ఊహించానని సిరి చెప్పడం గమనార్హం.

మొదటి రౌండ్‌లో పింకీ విజయం..

మొదటి రౌండ్‌లో ఎక్కువ బంగారుపూసలను సంపాదించిన మానస్‌-ప్రియాంకలకు బిగ్‌బాస్‌ ఓ స్పెషల్‌ టాస్క్‌ ఇచ్చాడు. ఎయిర్‌పంప్‌తో బెలూన్స్ పగలిపోయేవరకూ గాలి నింపాలని బిగ్‌బాస్‌ సూచించాడు. ఈ టాస్క్‌లో ప్రియాంక బెలూన్స్‌ ఎక్కువగా పగలకొట్టి విజయం సాధించింది. టాస్క్‌ పూర్తైన అనంతరం ఇంటిలోని మిగతా సభ్యుల వద్ద ఉన్న బంగారు పూసలను కొట్టేసేందుకు సిరి స్కెచ్‌ వేసింది. రవి బాస్కెట్‌లో ఉన్న పూసలు దొంగిలించింది. ఇది చూసిన షణ్ణు.. ‘‘నువ్వు వరెస్ట్‌ అన్నీ దొంగతనం చేస్తున్నావ్‌. దాంతో వాళ్లందరూ నిన్ను ఆడుకుంటారు. పైగా నేను కాపాడాలి’’ అని అన్నాడు. ‘‘ఇది, నా గేమ్‌ నా ఇష్టం’’ అని ఆమె నవ్వుకుంటూ వెళ్లిపోయింది.

షణ్ముఖ్‌కు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నా..

నిన్న వాష్‌ ఏరియాలో షణ్ముఖ్‌-సిరిల మధ్య జరిగిన గొడవ గురించి రవి ఆరా తీశాడు. ‘‘మా ఇద్దరి మధ్య ఎమోషనల్‌ కనెక్షన్‌ వచ్చేసింది’’ అని సిరి చెప్పింది. ఈ విషయంలో ఇద్దరి తప్పు ఉందని ఆమె అభిప్రాయపడింది. ‘‘మీ ఇద్దరూ నాకస్సలు అర్థం కావడం లేదు. ఒకరి కోసం ఒకరు ఏం చేసుకోవడానికైనా సిద్ధమైనట్లు అనిపిస్తుంది’’ అని రవి అన్నాడు. అనంతరం సిరి మాట్లాడుతూ.. ‘‘షణ్ముఖ్‌ నాపై త్వరగా కోపం తెచ్చుకుంటున్నాడు. అది ఎందుకో అర్థం కావడం లేదు’’ అని చెప్పింది.

శ్రీరామ్‌కు స్పెషల్‌ పవర్‌.. రవికి ఝలక్‌ ఇచ్చిన శ్రీరామ్‌

పవర్‌ రూమ్‌లోకి వెళ్లే అవకాశం శ్రీరామ్‌కి రాగా బిగ్‌బాస్‌ అతనికి ఓ స్పెషల్‌ పవర్‌ ఇచ్చాడు. ఆ స్పెషల్‌ పవర్‌ దక్కించుకోవాలంటే 30 బంగారు పూసలు తనకి ఇవ్వాలని బిగ్‌బాస్‌ తెలిపాడు. ఒక్క బంగారు పూస కూడా లేని శ్రీరామ్‌.. వచ్చిన స్పెషల్‌ పవర్‌ని ఇంటి సభ్యులపై ప్రయోగించాలనుకున్నాడు. దాంతో పవర్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చి.. తన దగ్గర స్పెషల్‌ పవర్‌ ఉందని.. మీకు కావాలంటే తనకి 50 బంగారు పూసలు ఇవ్వాలని చెప్పాడు. దీంతో, మరో ఆలోచన లేకుండా ఆ పవర్‌ కోసం రవి 50 బంగారు పూసలను శ్రీరామ్‌కు ఇచ్చాడు. శ్రీరామ్‌ ఇచ్చిన కవర్‌ చూసి రవి ఫీజులు ఎగిరిపోయాయి. ఇంటి సభ్యులందరూ నవ్వుకున్నారు.

రెండో రౌండ్‌లో సన్నీ-సిరి టాప్‌లో ఉండటంతో వీళ్లకి ప్రత్యేకంగా టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. టాస్క్‌లో దృష్టిలో ఉంచుకుని సిరి తరఫున వేరొకరు ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవచ్చని.. బిగ్‌బాస్‌ చెప్పడంతో సిరి తెలివిగా మానస్‌ని ఎంచుకుంది. ఈ టాస్క్‌లో మానస్‌ గెలిచి.. సిరికి కెప్టెన్సీ పోటీకి అవకాశం ఇచ్చాడు. ఈ టాస్క్‌లో రూల్స్‌ సరిగ్గా చెప్పలేదని సన్నీ.. రవి మీద ఫైర్‌ అయ్యాడు. అతన్ని సముదాయించేందుకు ప్రయత్నించిన మానస్‌-కాజల్‌ మీద కూడా సన్నీ అరిచాడు. కోపం తగ్గించేందుకు పదే పదే స్విమ్మింగ్‌పూల్‌లో దూకాడు. మరి, ‘నీ ఇల్లు బంగారం కాను’ టాస్క్‌లో విజయం సాధించి ఎవరు ఈ వారం కెప్టెన్సీ పోటీకి అర్హత సాధిస్తారో తెలియాలంటే గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌ చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని