
Jabardasth: టెన్షన్ పడుతూ బాలకృష్ణకు రోజా ఫోన్
హైదరాబాద్: ‘బొబ్బిలి సింహం’, ‘భైరవద్వీపం’ చిత్రాలతో నందమూరి బాలకృష్ణ, రోజా జోడీ అప్పట్లో సూపర్‌హిట్స్ అందుకున్నారు. ఆ రెండు సినిమాలు విడుదలై సుమారు 28 సంవత్సరాలైనప్పటికీ ఈ జోడీకి క్రేజ్ మాత్రం తగ్గలేదు. వీరిద్దరూ మరోసారి కలిసి నటిస్తే చూడాలని వారి అభిమానుల ఆశ. ఈ క్రమంలోనే తాజాగా రోజా.. బాలకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడారు. వీరిద్దరి సరదా సంభాషణకు ‘జబర్దస్త్’ వేదికైంది.
రోజా, మనో న్యాయనిర్ణేతలుగా.. అనసూయ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమవుతోన్న కామెడీ షో ‘జబర్దస్త్’. కమెడియన్ల ఆటో పంచులు.. న్యాయనిర్ణేతల కౌంటర్లతో ఈ షో తెలుగువారికి ఎంతో చేరువైన విషయం తెలిసిందే. తాజాగా వచ్చేవారానికి సంబంధించిన ఓ సరికొత్త ప్రోమో బయటకు వచ్చింది. దొరబాబు, పరదేశీ, శాంతిస్వరూప్‌లపై ఆది ఎప్పటిలాగే వరుస పంచులతో అలరించారు. ఇక, మద్యానికి బానిసైన భర్తగా రాఘవ నవ్వులు పూయించారు. ఇలా ఎంతో సరదాగా సాగుతోన్న ఎపిసోడ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ‘‘మేడమ్.. మా అందరి సమక్షంలో ఇప్పుడు మీరు బాలకృష్ణ సర్‌కు ఒక్కసారి కాల్ చేయాలి’’ అని అనసూయ కోరడంతో.. ‘‘మంచి మూడ్‌లో ఉంటే ఓకే. లేకపోతే..’’ అంటూ రోజా టెన్షన్ పడుతూ బాలయ్యకు ఫోన్ చేసి.. ‘‘హలో సర్.. బాగున్నారా?’’ అని అడగ్గా.. ‘‘రోజాగారు నమస్కారం. బాగున్నానమ్మా. మన అఖండ షూట్‌లో ఉన్నాను’’ అని ఆయన సమాధానమిచ్చారు. అనంతరం.. ‘‘మళ్లీ మనిద్దరం కలిసి ఎప్పుడు సినిమా చేద్దాం. ‘భైరవద్వీపం’ పార్ట్ 2నా? లేక ‘బొబ్బిలిసింహం’ పార్ట్ 2నా?అని అందరూ అడుగుతున్నారు?’’ అని రోజా అనడంతో.. ‘‘మన కాంబినేషన్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు’’ అని ఆయన నవ్వుతూ సమాధానమిచ్చారు. అంతేకాకుండా, ‘జబర్దస్త్’ జడ్జీగా తాను వస్తానని ఆయన అన్నారు. ఆయన మాటలతో ‘జబర్దస్త్’ సెట్‌లో సందడి వాతావరణం నెలకొంది. అసలు బాలకృష్ణకు రోజా ఎందుకు ఫోన్ చేశారో తెలియాలంటే వచ్చే గురువారం వరకూ వేచి ఉండాల్సిందే. ఈలోపు ప్రోమో చూసేయండి!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.