
MAA: ‘మా’ సభ్యుల కోసం ఉచిత వైద్య శిబిరాలు
- మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు తన ప్రధాన అజెండాలోని ఒకొక్క హామీని పూర్తి చేయడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ‘మా’ సభ్యుల ఆరోగ్యంపై దృష్టి సారించినట్లు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇప్పుడిందులో భాగంగానే హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ఆస్పత్రులతో ఒప్పందం చేసుకున్నారు. ఇకపై ప్రతి మూడు నెలలకొకసారి ఉచిత మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయనున్నట్లు ట్విటర్ వేదికగా తెలియజేశారు. ఆరోగ్యబీమా క్లెయిం కన్నా ఎక్కువ ఖర్చయితే.. ఆ బిల్లులో రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రతి ఆస్పత్రిలో ‘మా’ సభ్యుల కోసం ఒక సహాయకుడిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మహిళా సభ్యులు ఎవరైనా అనారోగ్యం పాలైతే వారి చికిత్స కోసం ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తామన్నారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్‌తో బాధపడే మహిళలకు అత్యుత్తమ చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ‘మా’ సభ్యులకు ప్రత్యేకంగా చికిత్స అందించి, బిల్లులో రాయితీలు కల్పిస్తున్న డాక్టర్ నాగేశ్వరరెడ్డి (ఏఐజీ), డాక్టర్ భాస్కర్‌రావు (కిమ్స్), సంగీత (అపోలో), డాక్టర్ సుబ్రమణియం (సీఈవో అపోలో), డాక్టర్ గురవారెడ్డి (సన్‌షైన్), డాక్టర్ అనిల్ కృష్ణ (మెడికవర్)లను స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలిపామన్నారు. అలాగే అడిగిన వెంటనే ఆరోగ్య పరీక్షలకు అయ్యే ఖర్చులో 50శాతం రాయితీ ఇస్తామన్న టెనెట్ డయాగ్నస్టిక్స్ మేనేజ్‌మెంట్ సురేశ్, చరణ్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. డిసెంబర్‌లో మెడికవర్, మార్చిలో ఏఐజీ, జూన్‌లో అపోలో, సెప్టెంబర్‌లో కిమ్స్ ఆస్పత్రిలో ఆరోగ్య శిబిరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంచు విష్ణు పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.