Updated : 27 Dec 2021 10:01 IST

Maanaadu movie Review: రివ్యూ: మానాడు

చిత్రం: మానాడు; నటీనటులు: శింబు, ఎస్‌.జె.సూర్య, కల్యాణి ప్రియదర్శన్‌, ఎస్‌.ఎ.చంద్రశేఖర్‌; సినిమాటోగ్రఫీ: రిచర్డ్‌ ఎం.నాథన్‌; ఎడిటింగ్‌: ప్రవీణ్ కె.ఎల్‌; సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా; నిర్మాత: సురేశ్‌ కామాట్చి; రచన, దర్శకత్వం: వెంకట్‌ ప్రభు; విడుదల: సోనీ లివ్‌ ఓటీటీ

‘మన్మధ’, ‘వల్లభ’ వంటి ప్రేమకథా చిత్రాలతో తెలుగులోనూ గుర్తింపు దక్కించుకున్నారు తమిళ కథానాయకుడు శింబు. ఆయన కథానాయకుడిగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమిళ చిత్రం ‘మానాడు’. తెలుగులో ‘ది లూప్‌’ పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే, కరోనా కారణంగా పెద్దగా ప్రేక్షకులకు చేరలేదు. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో విడుదలై తెలుగులోనూ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. మరి ఇందులో శింబు పాత్ర ఏంటి? ఆయన ఎందుకు లూప్‌లో ఇరుక్కుపోయాడు? దాని నుంచి బయట పడటానికి ఆయన చేసిన సాహసం ఏంటి?(Maanaadu Movie review)

కథేంటంటే: అబ్దుల్‌ ఖాలిక్‌(శింబు)(simbu) ఎన్నారై. స్నేహితుడు ఈశ్వర మూర్తి(అమరన్‌) ప్రేమించిన జరీనా(అంజినా కీర్తి)కు మరొకరితో పెళ్లి జరుగుతుందని తెలిసి దాన్ని చెడగొట్టడానికి దుబాయ్‌ నుంచి ఇండియాకు వస్తాడు. విమాన ప్రయాణంలో అతడికి సీతామహాలక్ష్మి(కల్యాణి ప్రియదర్శన్‌) పరిచయమవుతుంది. ఇద్దరూ కలిసి ఒకే పెళ్లికి వెళతారు. మగపెళ్లి వాళ్లకు తెలియకుండా స్నేహితులతో కలిసి పెళ్లికుమార్తె జరీనాను అక్కడి నుంచి తీసుకెళ్తాడు‌. రిజిస్టర్‌ ఆఫీస్‌కు వెళ్లే క్రమంలో సడెన్‌గా ఖాలిక్‌ నడుపుతున్న కారు కింద పడి రఫీక్‌(డేనియల్‌) చనిపోతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన డీసీపీ ధనుష్కోటి(ఎస్‌జే సూర్య)(SJ Suryah) ఖాలిక్‌ను బెదిరించి సీఎం(ఎస్‌ఏ చంద్రశేఖర్‌)ను చంపాల్సిందిగా ఆదేశిస్తాడు. మరి ఖాలిక్ సీఎంను చంపాడా? అసలు సీఎంను చంపడానికి కారణం ఎవరు? దీని వెనుక దాగి ఉన్న కుట్ర ఏంటి? ఆ కుట్రను అబ్దుల్‌ ఖాలిక్ ఎలా ఛేదించాడు?

ఎలా ఉందంటే: కాలం చుట్టూ తిరిగే కథలతో వచ్చిన ఎన్నో సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. హాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ వరకూ ప్రతి చిత్ర పరిశ్రమలోనూ ఇలాంటి కథలు కొత్తేమీ కాదు. అయితే, కాలం అనే కాన్సెప్ట్‌ను ఎవరు? ఎలా ఉపయోగించుకుని ఆసక్తికరంగా మలిచారన్నదానిపైనే సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. ‘ఆదిత్య 369’, ‘టెనెట్‌’, ‘కుడి ఎడమైతే’, ‘24’ ఇవన్నీ కాలంతో ముడిపడిన సినిమాలే. అలాంటి కాలం కథతో వెంకట్‌ ప్రభు తీసిన చిత్రమే ‘మానాడు’. ‘టైమ్‌ లూప్‌’ అనే కాన్సెప్ట్‌ను తీసుకుని తికమక లేకుండా ప్రేక్షకుడిని ఎంటర్‌టైన్‌ చేసేలా ‘మానాడు’ను తీర్చిదిద్దడంలో దర్శకుడు వెంకట్ ప్రభు సఫలమయ్యారు. ఖాలిక్‌ దుబాయ్‌ నుంచి రావడంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు అసలు పాయింట్‌కు రావడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఖాలిక్‌ యాక్సిడెంట్‌ చేయడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. డీసీపీ ధనుష్కోటి.. ఖాలిక్‌ను బెదిరించి సీఎంను చంపించడం.. ఆ తర్వాత ఉగ్రవాది పేరుతో ఖాలిక్‌ను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి చంపడంతో టైమ్‌ లూప్‌ మొదలవుతుంది.

తాను టైమ్‌ లూప్‌లో చిక్కుకున్నానని తెలియడానికి ఖాలిక్‌కు పెద్దగా సమయం ఏమీ పట్టదు. ఖాలిక్‌ మాత్రమే టైమ్‌ లూప్‌లో ఇరుక్కుపోవడానికి దర్శకుడు చెప్పిన లాజిక్‌, అందుకు నేపథ్యం బాగుంది. దేశంలో ఉగ్రవాద ఘటనలు జరిగినప్పుడల్లా ఒక వర్గం ప్రజలు ఎలాంటి నిందారోపణకు గురవుతున్నారన్న విషయాన్ని దర్శకుడు చెప్పే ప్రయత్నం చేశాడు. కథానాయకుడిని పాత్రను అబ్దుల్‌  ఖాలిక్‌గా చూపించడం వెనుకా కారణం అదే! తమ స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు రాజకీయ నాయకులు కుల, మత ఘర్షణలు ఎలా సృష్టిస్తారన్న విషయాన్ని చూపించే ప్రయత్నం చేశారు. సీఎంను కాపాడేందుకు ఖాలిక్‌ ప్రయత్నాలు చేయడం, ధనుష్కోటి మరొక ప్రయత్నంతో వాటిని విఫలం చేయడం. ఇలా టైమ్‌లూప్‌ రన్‌ అవుతూ ఉంటుంది. అసలు దీనికి మూలం ఎక్కడనేది తెలుసుకునేందుకు ప్రయత్నం మొదలు పెట్టిన తర్వాత ఖాలిక్‌కు విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. అయితే, డీసీపీ ధనుష్కోటి నుంచి తప్పించుకునే క్రమంలో ప్రతిసారీ ఖాలిక్‌ చనిపోతుంటాడు. దీంతో మళ్లీ కథ మొదటికి వస్తుంది. ఇలా సాదాసీదాగా వెళ్లిపోతే అది వెంకట్‌ ప్రభు సినిమా ఎందుకవుతుంది? ఖాలిక్‌తో పాటు ధనుష్కోటి కూడా టైమ్‌లూప్‌లో ఇరుక్కుపోయేలా ఇచ్చిన ట్విస్ట్‌ అదుర్స్‌. అది ఎలా అన్నది మాత్రం తెరపై చూడాల్సిందే. ఇద్దరూ టైమ్‌ లూప్‌లో ఇరుక్కుపోయాక వచ్చే సన్నివేశాలు నువ్వా-నేనా అన్నట్లు సాగుతాయి. సీఎం చనిపోకుండా కాపాడేందుకు ఖాలిక్‌ ప్రయత్నాలు చేయడం, ఈ విషయం ముందే తెలిసిన ధనుష్కోటి ఎత్తుకు పై ఎత్తు వేయడంతో చివరి వరకూ సినిమా ఉత్కంఠతో సాగుతుంది. ఈ క్రమంలో ధనుష్కోటిగా ఎస్‌జే సూర్య పలికే సంభాషణలు, హావభావాలు ప్రేక్షకులను అసలైన వినోదాన్ని పంచుతాయి. పతాక సన్నివేశాలు మెప్పిస్తాయి. దీనికి కొనసాగింపు ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెబుతాడు.

ఎవరెలా చేశారంటే: అబ్దుల్‌ ఖాలిక్‌ పాత్రలో శింబు అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ఆయన ఖాతాలో మంచి హిట్ పడింది. తెరపై పూర్తి ఎనర్జీతో కనిపించాడు. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర డీసీపీ ధనుష్కోటి. ఎస్‌జే సూర్య ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ఆయన పలికే సంభాషణలు, హావభావాలు మెప్పిస్తాయి. ఖాలిక్‌-ధనుష్కోటి ఎదురుపడే సన్నివేశాలు విశేషంగా అలరిస్తాయి. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. రిచర్డ్‌ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్‌ కె.ఎల్‌ ఎడిటింగ్‌ బాగున్నాయి. యువన్‌ శంకర్‌రాజా నేపథ్య సంగీతం సినిమాలో ప్రేక్షకుడిని లీనం చేస్తుంది. దర్శకుడు వెంకట్‌ ప్రభు ఎంచుకున్న టైమ్‌ లూప్‌ సబ్జెక్ట్‌ కాస్త క్లిష్టమైనదే. కానీ, అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా సన్నివేశాలను రాసుకున్న విధానం, వాటిని తెరకెక్కించిన తీరు బాగుంది. ఒక వ్యక్తి జీవితంలో అదీ ఒక రోజులో జరిగిన సంఘటనలు మళ్లీ మళ్లీ జరగడం తెరపై చూపిస్తే, ప్రేక్షకుడికి విసుగువస్తుంది. కానీ, అలాంటి ఆలోచనే రాకుండా వెంకట్‌ ప్రభు కథనంతో మేజిక్‌ చేశారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సైన్స్‌ ఫిక్షన్‌, టైమ్‌ ట్రావెల్‌ చిత్రాలను ఇష్టపడేవారికి ‘మానాడు’ విపరీతంగా నచ్చుతుంది. మధ్య మధ్యలో వదలిపెట్టకుండా మొదటి నుంచి చివరి వరకూ సినిమా చూస్తే, సాధారణ ప్రేక్షకుడూ ఎలాంటి తికమకలేకుండా సినిమాను ఎంజాయ్‌ చేయొచ్చు. తమిళంతో పాటు, తెలుగులోనూ ‘సోనీ లివ్‌’ ఓటీటీలో అందుబాటులో ఉందీ చిత్రం.

బలాలు

+ శింబు, ఎస్‌జే సూర్యల నటన

+ కథ, కథనం

+ దర్శకత్వం

బలహీనతలు

- ఆరంభ సన్నివేశాలు

చివరిగా: ‘మానాడు’ వాళ్లు టైమ్‌లూప్‌లో ఇరుక్కుంటారు.. ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తారు!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని