Maha Samudram: ఓటీటీలో మహాసముద్రం వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడ అంటే..?

సిద్ధార్థ్‌, శర్వానంద్‌ స్నేహితులుగా నటించిన చిత్రం ‘మహాసముద్రం’. అదితీ రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌

Published : 13 Nov 2021 14:59 IST

హైదరాబాద్‌: సిద్ధార్థ్‌, శర్వానంద్‌ స్నేహితులుగా నటించిన చిత్రం ‘మహాసముద్రం’. అదితీ రావ్‌ హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ హీరోహీరోయిన్లు. ‘ఆర్‌ఎక్స్‌100’ ఫేమ్‌ అజయ్‌ భూపతి తెరకెక్కించాడు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేశారు. ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రావు రమేశ్‌, జగపతిబాబు కూడా కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు.

క‌థేంటంటే: ఎదుటోడు ఒక్క చెంప‌పై కొడితే రెండు చెంప‌లు వాయించి రావాల‌ని న‌మ్మే.. భ‌గ‌త్ సింగ్ లాంటి భావ‌జాల‌మున్న కుర్రాడు అర్జున్ (శ‌ర్వానంద్‌). ఓ చిన్న వ్యాపారం పెట్టుకుని జీవితంలో స్థిర‌ప‌డాల‌న్న ల‌క్ష్యంతో జీవిస్తుంటాడు.  పైసా కోసం.. ప‌వ‌ర్ కోసం ఎలాగైనా ఎస్ఐ అవ్వాల‌ని క‌ల‌లుగ‌నే కుర్రాడు విజ‌య్ (సిద్ధార్థ్‌). రెండు వేరు వేరు వ్య‌క్తిత్వాలున్న ఈ ఇద్ద‌రినీ స్నేహం ఒక్క‌టి చేస్తుంది. మ‌హా అలియాస్ మ‌హాల‌క్ష్మి (అదితి రావు హైద‌రి)కి విజ‌య్ అంటే ప్రాణం. రెండేళ్లుగా ఇద్ద‌రూ ప్రేమ‌లో ఉంటారు. విజ‌య్‌ని పెళ్లి చేసుకుని త్వర‌గా జీవితంలో స్థిర‌ప‌డాల‌నేది మ‌హా కోరిక‌. ధ‌నుంజ‌య్ (గ‌రుడ రామ‌చంద్ర‌) విశాఖ ప‌ట్ట‌ణానికి ఓ డాన్‌.  వైజాగ్ అడ్డాగా చేసుకుని  డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ నుంచి మొద‌లు దొంగ నోట్ల చెలామ‌ణీ వ‌ర‌కూ అనేక అక్ర‌మ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తుంటాడు.  ఓరోజు అనుకోని ప‌రిస్థితుల్లో అత‌నికి విజ‌య్‌కీ మ‌ధ్య ఓ పెద్ద గొడ‌వ జ‌రుగుతుంది.  ఆ గొడ‌వ‌లో ధ‌నుంజ‌య్ తీవ్రంగా గాయ‌ప‌డి మ‌ర‌ణపు అంచుల దాకా వెళ్తాడు. దీంతో వైరి వ‌ర్గం నుంచి విజ‌య్ ప్రాణానికి ముప్పు వ‌స్తుంద‌నే ఉద్దేశంతో త‌న‌ని మ‌హాతో క‌లిసి మ‌రో ఊరికి పంపించే ప్ర‌య‌త్నం చేస్తాడు అర్జున్‌. అప్పుడే అర్జున్‌కి.. మ‌హాకి ఓ ఊహించ‌ని షాకిస్తాడు విజ‌య్‌. దీంతో ఆ ఇద్ద‌రి జీవితాల్లో ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటాయి.  త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో ధ‌నుంజ‌య్‌ను చంపి అర్జున్ ఓ డాన్‌గా మార‌తాడు. మ‌రి త‌న త‌మ్ముడ్ని చంపినందుకు.. అత‌నిపై గూని బాబ్జీ (రావు ర‌మేష్‌) ఎలా ప‌గ తీర్చుకున్నాడు?  త‌న సామ్రాజ్యాన్ని తిరిగి ద‌క్కించుకునేందుకు ఏం చేశాడు.  అర్జున్‌, మ‌హాల‌ను వ‌దిలి వెళ్లిన‌ విజ‌య్ తిరిగొచ్చాడా?  ఈ క‌థ‌లో చుంచుమామ (జ‌గ‌ప‌తిబాబు) పాత్రేంటి? అన్న‌ది తెర‌పైనే చూడాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని