Maha Samudram: ‘మహా సముద్రం’ ట్రైలర్‌.. పోటాపోటీగా శర్వానంద్‌, సిద్ధార్థ్‌! 

‘మహా సముద్రం’ ట్రైలర్‌ని విడుదల చేసిన చిత్రబృందం. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కథానాయికలు.

Updated : 23 Sep 2021 20:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శర్వానంద్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అజయ్‌ భూపతి దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. సుంకర రామబ్రహ్మం నిర్మాత. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ సినిమా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. లవ్‌, యాక్షన్‌ సన్నివేశాలతో సాగే ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఒకే ఫ్రేమ్‌లో శర్వానంద్‌, సిద్ధార్థ్‌ కనిపించి సందడి చేశారు. ఇద్దరూ పోటీపడి నటించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. 

సముద్రం సన్నివేశంతో ఈ ట్రైలర్‌ ప్రారంభమైంది. ‘సముద్రం చాలా గొప్పది. చాలా రహస్యాల్ని తనలోనే దాచుకుంటుంది’ అంటూ శర్వానంద్‌ ఎంట్రీ ఇచ్చిన తీరు మెప్పిస్తోంది. శర్వానంద్‌, సిద్ధార్థ్‌ పవర్‌ఫుల్‌గా కనిపించి సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. జగపతి బాబు, రావు రమేశ్‌ ప్రతినాయక పాత్రల్లో మెప్పించారు. నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ‘‘ఇక్కడ మనకి నచ్చినట్టు బతకాలంటే.. మన జాతకాల్ని దేవుడు మందుకొట్టి రాసుండాలి’’ అంటూ శర్వానంద్‌ చెప్పే డైలాగ్‌.. ‘‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా’’ అంటూ సిద్ధార్థ్‌ పలికే సంభాషణల్లో దర్శకుడు అజయ్‌ భూపతి మార్క్‌ కనిపిస్తోంది. ‘‘నేను దూరదర్శన్‌లో మహాభారత యుద్ధం చూసిన మనిషినిరా.. ఎదుటోడు వేసిన బాణానికి ఎదురు ఏ బాణం వేయాలో నాకు బాగా తెలుసు’’ అంటూ రావు రమేశ్‌ తన స్టైల్‌లో డైలాగ్‌ చెప్పడం ఆకట్టుకుంటోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని