
MaheshBabu: నా కోసం ఈ చిన్న పని చేయండి చాలు.. అభిమానులకు విజ్ఞప్తి!
హైదరాబాద్: తనపై ఉన్న అభిమానాన్ని చూపించడానికి భారీ ఏర్పాట్లు అవసరం లేదని కేవలం ఓ చిన్న పనికి నాంది పలకమని అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు పిలుపునిచ్చారు. ఆగస్టు 9న తన పుట్టినరోజుని పురస్కరించుకుని ప్రతి అభిమాని మూడు మొక్కలు చొప్పున నాటాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ‘నా పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి యేటా మీరు నాపై చూపించే ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. ఎంపీ సంతోష్‌కుమార్ ప్రారంభించిన ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌లో భాగంగా ఈ ఏడాది నా పుట్టినరోజు నాడు ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ ఫొటోలను నన్ను ట్యాగ్ చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగలరు. తద్వారా నేను కూడా వాటిని చూడగలను’ అని మహేశ్ పోస్ట్ పెట్టారు.
ఈసారి తన పుట్టిన రోజు వేడుకల్ని మహేశ్‌బాబు సినిమా సెట్లోనే జరుపుకోనున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ ‘సర్కారు వారి పాట’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా గోవాలో జరుపుకోవాల్సిన ఓ షెడ్యూల్ చిత్రీకరణ వాయిదా పడింది. ప్రస్తుతం పరిస్థితులు కుదుటపడటంతో ఆ షెడ్యూల్‌ని ఇప్పుడు ఖరారు చేసినట్టు సమాచారం. పుట్టిన రోజు (ఆగస్టు 9) కంటే ఒక రోజు ముందు మహేశ్ గోవా పయనమవ్వనున్నారు. తర్వాతి రోజు ఆయన సతీమణి, పిల్లలు గోవా చేరుకోనున్నారు. వాళ్లతో కలిసి ‘సర్కారు’ సెట్లోనే పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకోనున్నారట మహేశ్. 2018లో ‘మహర్షి’ షూటింగ్లో భాగంగా గోవాలోనే బర్త్‌డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఆగస్టు 9న ‘సర్కారు’ టీజర్ వస్తుందని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మహేశ్ అభిమానులు. మరి ఆ రోజు ఏం సర్ప్రైజ్ ఇస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని మహేశ్ ఫస్ట్‌లుక్ నెట్టింట సంచలనం సృష్టించింది. బ్యాంకు అక్రమాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు.