
MaheshBabu: మన పిల్లలకు రక్షణ ఉంటుందా?: మహేశ్‌బాబు
ఆవేదన వ్యక్తం చేసిన సూపర్‌స్టార్
హైదరాబాద్: సైదాబాద్ పరిధిలోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన హత్యాచారం ఘటనపై కథానాయకుడు మహేశ్‌బాబు స్పందించారు. సమాజం నానాటికి దిగజారిపోతోందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో పిల్లలకు రక్షణ ఉంటుందా? అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ ట్వీట్ చేశారు.
‘‘సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అకృత్యంతో సమాజం ఎంత దిగజారిపోయిందో అర్థమవుతోంది. మన ఇంటి ఆడపిల్లలు సురక్షితంగా ఉన్నారా? నిరంతరం ఈ ప్రశ్న ప్రతిఒక్కర్నీ కలచివేస్తోంది. ఎంతో ఆవేదనకు గురి చేస్తోంది. బాధిత కుటుంబం పడుతోన్న బాధను ఊహించలేకపోతున్నాను. ఆ చిన్నారికి, ఆమె కుటుంబానికి త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని అధికారులను కోరుకుంటున్నాను’ అని మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. మరోవైపు నటుడు మంచు మనోజ్ మంగళవారం సింగరేణి కాలనీకి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు.