MAA Elections: ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ రాజీనామా చేయడం దురదృష్టకరం: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్ అభివృద్ధికి తాను అన్నివిధాలు కష్టపడతానని నటుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడి..

Updated : 16 Oct 2021 16:53 IST

హైదరాబాద్‌: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్(మా) అభివృద్ధికి తాను అన్నివిధాలా కష్టపడతానని నటుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడి.. ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌పై ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఆయన శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తన మేనిఫెస్టోలో చర్చించిన ప్రతిదీ అమలు జరిగేలా తాను కృషి చేస్తానన్నారు. ‘మా’ అభివృద్ధి కోసం అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.

‘‘హోరాహోరీగా జరిగిన ‘మా’ ఎన్నికల్లో మేము గెలిచాం. ప్రత్యర్థి ప్యానెల్‌ వాళ్లు దాన్ని గౌరవించాలి. ‘మా’ అభివృద్ధికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దానిపై వాళ్ల సలహాలు కూడా తీసుకుంటాను. ఆ విషయంలో ప్రత్యర్థి ప్యానెల్‌లోని వాళ్లూ నాకు సపోర్ట్‌ చేయాలని కోరుకుంటున్నాను. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం వారి కారణాల వల్ల తమ పదవులకు ప్రత్యర్థి ప్యానెల్‌లోని సభ్యులు రాజీనామా చేశారు. అది చాలా దురదృష్టకరం. కానీ, మేము ‘మా’ అభివృద్ధి కోసం పాటుపడతాం. ఎన్నికల సమయంలో నాకెంతో సపోర్ట్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇకపై నేను కానీ నా టీమ్‌లోని సభ్యులు కానీ ‘మా’ ఎన్నికల వ్యవహరంపై మీడియాలో మాట్లాడము. కేవలం మేము చేయబోయే కార్యక్రమాల గురించే మాట్లాడతాం’ అని మంచు విష్ణు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని