MAA Elections: నాగబాబు.. ఆ విషయంలో నాకెంతో బాధగా ఉంది: మంచు విష్ణు

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో నటుడు నాగబాబు మద్దతు తనకే ఉంటుందని భావించానని.. ఆ విషయంలో ఒకింత బాధగా ఉందని నటుడు మంచు విష్ణు తెలిపారు. మరో మూడు రోజుల్లో జరగనున్న...

Published : 08 Oct 2021 02:54 IST

మా అక్క, తమ్ముడు ఏం చేశారని.. ఆరోపిస్తారు..

హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల్లో నటుడు నాగబాబు మద్దతు తనకే ఉంటుందని భావించానని.. ఆ విషయంలో ఒకింత బాధగా ఉందని నటుడు మంచు విష్ణు తెలిపారు. మరో మూడు రోజుల్లో జరగనున్న ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న ఆయన ప్రచార కార్యక్రమంలో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొలిటికల్‌ ఎజెండాతోనే కొంతమంది ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ఆయన అన్నారు. క్రమశిక్షణ అంటేనే ప్రకాశ్‌రాజ్‌కి పడదని అంటూ సెటైర్లు వేశారు.

‘‘మా’ అధ్యక్షుడిగా నేను ఎప్పుడో బాధ్యతలు స్వీకరించాల్సింది. కాకపోతే అప్పుడున్న పరిస్థితుల రీత్యా నాన్న వద్దని చెప్పడంతో ఆగిపోయాను. పరిశ్రమలోని కొంతమంది పెద్దలు అడగడంతోనే ఇప్పుడు మరలా పోటీలో నిల్చున్నాను. ఎన్నికల తేదీ వచ్చిన తర్వాతే నా ప్యానల్‌ని ప్రకటించాను. మొదట్లో మేము ఎక్కడా ఆగ్రహావేశాలతో మాట్లాడలేదు. ప్రత్యర్థి ప్యానల్‌ వాళ్లు నన్ను, ఫ్యామిలీని టార్గెట్‌ చేయడం వల్లే ఇటీవల నేను ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఎన్నికల బరిలోకి దిగడానికంటే ముందు ప్రకాశ్‌రాజ్‌ నాకు ఫోన్‌ చేశారు. ‘హెల్తీగా పోటీ పడదాం.. వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవద్దు’ అన్నారు. కానీ ఇప్పుడు ఆయనే నా ఫ్యామిలీపై ఆరోపణలు చేస్తున్నారు. నాపై వ్యాఖ్యలు చేయమనండి. మా అక్క, తమ్ముడు ఏం చేశారని.. వాళ్లపై ఆరోపణలు చేస్తారు? నాగబాబు అంకుల్‌ నాకు సపోర్ట్‌ చేస్తారని భావించాను. కానీ, ఆయన ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్‌ చేస్తున్నారు. ఆ విషయంలో కొంత బాధగా ఉంది. ప్రకాశ్‌రాజ్‌కు క్రమశిక్షణ అంటేనే పడదు. అందుకే ఫిల్మ్‌ ఛాంబర్‌ అసోసియేషన్‌ ఆయన్ని రెండుసార్లు సస్పెండ్‌ చేసింది. ఆయన మంచి నటుడు. సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ బాగా నటిస్తారు. ప్రస్తుతం సినీ పరిశ్రమలో తలెత్తున్న వివాదాలు చూసి నాన్న చాలా బాధపడుతున్నారు. ఒకవేళ అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌, ప్రభాస్‌ ‘మా’ అధ్యక్షుడిగా నిల్చుంటామని చెబితే తప్పకుండా నేను పోటీలో ఉండేవాడిని కాదు. ఎందుకంటే వాళ్లు ఎటువంటి పొలిటికల్‌ ఎజెండా లేకుండా అసోసియేషన్‌ అభివృద్ధి కోసం పనిచేసేవాళ్లు’ అని విష్ణు వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని