Cinema news: ప్రజలు ధైర్యంగా థియేటర్‌లో సినిమా చూడొచ్చు: మంత్రి తలసాని

కరోనా థర్డ్‌వేవ్‌ అంటూ సాగే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, ప్రజలు ధైర్యంగా థియేటర్‌కు వచ్చి సినిమా చూడొచ్చని తెలంగాణ

Updated : 03 Dec 2021 17:40 IST

హైదరాబాద్‌: కరోనా థర్డ్‌వేవ్‌ అంటూ సాగే అసత్య ప్రచారాలు నమ్మొద్దని, ప్రజలు ధైర్యంగా థియేటర్‌కు వచ్చి సినిమా చూడొచ్చని తెలంగాణ సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌(talasani srinivas yadav) అన్నారు. శుక్రవారం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకుల(tollywood)తో ఆయన భేటీ అయ్యారు. కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉందన్నారు. 

కరోనా థర్డ్‌వేవ్‌ వస్తుందన్న ఊహాగానాలు మొదలైన నేపథ్యంలో థియేటర్ల మూత, ఆక్యుపెన్సీ తగ్గింపు తదితర ప్రచారాలను నమ్మొదని మంత్రి తలసాని తెలిపారు. కరోనా దృష్ట్యా థియేటర్‌లపై ఆంక్షలు విధిస్తామన్న ప్రచారం అపోహేనని కొట్టిపారేశారు. ‘కరోనా వల్ల రెండేళ్లుగా సినీ పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పరిస్థితుల్లో ఒమిక్రాన్‌ భయాలు మొదలయ్యాయి. తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు. థియేటర్‌ ఆక్యుపెన్సీపై ఎలాంటి ఆంక్షలు లేవు. తెలంగాణ ప్రభుత్వం 100శాతం ఆక్యుపెన్సీకి అవకాశం ఇచ్చినా గత కొన్ని రోజులు ఆ స్థాయి ప్రేక్షకులు థియేటర్స్‌కు రావటం లేదు. ‘అఖండ’ విడుదలైన తర్వాత థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య కాస్త పెరిగింది. త్వరలో భారీ బడ్జెట్‌ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు విడుదలవుతున్నాయి. థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. ఇలాంటి సమయంలో దర్శక-నిర్మాతలు అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్‌ రెండు డోసులు దాదాపు పూర్తయ్యాయి.  సినీ పరిశ్రమపై వేల కుటుంబాలు ఆధారపడ్డాయి. వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది’ అని తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు.

గతంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలపై ఈ సందర్భంగా చర్చించినట్లు మంత్రి తలసాని వివరించారు. మంత్రితో భేటీ అయిన వారిలో నిర్మాతలు దిల్‌రాజు, డీవీవీ దానయ్య, చినబాబు, యేర్నేని నవీన్‌, ప్రమోద్‌, అభిషేక్‌ నామా దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్‌ తదితరులు ఉన్నారు.

Read latest Cinema News and Telugu News


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని