Mohan Babu: మోహన్‌బాబు ఇంటి హోమ్‌ టూర్‌.. ఫుల్‌ వీడియో!

‘మోహన్‌బాబు హోం టూర్‌’. ఇంటి ప్రత్యేకల్ని వివరించిన మంచు లక్ష్మి..

Published : 31 Dec 2021 01:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత శిఖరాల్ని అధిరోహించారు మోహన్‌బాబు. ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఒకప్పుడు ఇంటి అద్దె చెల్లించలేని దుస్థితిని ఎదుర్కొన్న ఆయన.. ఇప్పుడు ఆరు ఇళ్లు నిర్మించుకోగలిగారు. వాటిల్లో ఇంద్రభవనాన్ని తలపించే ఓ ఇంటిని తన కూతురు, నటి లక్ష్మి అభిమానులకు చూపించారు. ‘మా నాన్న హోమ్‌ టూర్‌’ పేరిట ఆ ఇంటి ప్రత్యేకతల్ని పంచుకున్నారు. ఇటీవల ప్రోమోతో సందడి చేసిన ఆమె ఇప్పుడు ఫుల్ వీడియోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

మోహన్‌బాబు ప్రకృతిని ఎంత ప్రేమిస్తారో, స్నేహితులకు ఎంత విలువిస్తారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. కళ్లు చెదిరే ఈ భవనంలో జిమ్‌, స్విమ్మింగ్‌ పూల్, డ్యాన్స్‌ ఫ్లోర్‌, థియేటర్‌ (క్యూబ్‌) తదితర అధునాతన వసతులన్నీ ఉన్నాయి. ఇంటి చుట్టూ పలు రకాల మొక్కలు, ఇంటి గోడలపై మోహన్‌బాబు కుటుంబ సభ్యుల ఫొటోలు, ఆయన అందుకున్న అవార్డులు దర్శనమిస్తాయి. ఇంటి ఆవరణలో మోహన్‌బాబు ఎక్కడ ఏం చేస్తారో, ఒక్కో గది ప్రత్యేకతను లక్ష్మి వివరించారు. 

‘ఇది నాన్నగారు కట్టించుకున్న ఆరో ఇల్లు. గోడ ఖాళీగా కనిపిస్తే చాలు అక్కడ ఆయన ఫొటోలు పెట్టేస్తారు. నాన్నకు చెట్లంటే బాగా ఇష్టం. అందుకే ప్రతి ఇంటి దగ్గరా మొక్కలు ఉండేలా చూస్తారు. నాకు ఇక్కడకు వస్తే ఏదో తెలియని ఆనందం. మా నాన్నగారిది మారుమూల గ్రామం మోదుగులపాలెం. స్వర్ణముఖి నదిని దాటి ఆ ఊరును చేరుకోవాలి. వర్షం వస్తే చాలా ఇబ్బంది పడాలి. ‘ఈ జీవితంలో నేను ఏదైనా సాధించాలి’ అనుకుని ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చారు. స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగారు. తన స్వగ్రామానికి ఎంతో సాయమందించారు. ఆయన జర్నీ తలచుకున్నప్పుడల్లా భావోద్వేగానికి గురవుతా. ఆయన కూతురిగా ఎంతో గర్విస్తున్నా. ఆయన నాకు మంచి జీవితం, విద్య, పేరు, ప్రఖ్యాతలందించారు. ఈ వీడియో చూసిన వారిలో ఒక్కరు ఇన్‌స్పైర్‌ అయినా చాలు. అదే నాకు ఆనందం. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన్‌బాబు స్నేహితుడి గురించి కూడా లక్ష్మి చెప్పుకొచ్చారు. మధ్యమధ్యలో మోహన్‌బాబు ఎంట్రీ అలరించింది. కూతురు, మనవరాలితో ఆయన చేసిన అల్లరి వినోదం పంచింది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని