Updated : 01 Dec 2021 10:54 IST

Sirivennela Sitharama Sastry: మిత్రమా.. పాటకోసమే బతికావు: ఇళయరాజా

సంగీత దర్శకుడి భావోద్వేగం

హైదరాబాద్‌: ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అకాల మరణం పట్ల ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సంతాపం ప్రకటించారు. సీతారామశాస్త్రి మరణం తనను ఎంతో బాధకు గురి చేస్తోందన్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా సిరివెన్నెలతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.

‘‘సాహితీ హిమాలయం సీతారాముడు’ వ్యాపారాత్మక సినిమా పాటల్లో సైతం.. కళాత్మకతని, కవితాత్మని అందించి.. తనదైన ముద్రతో అందమైన అర్థవంతమైన, సమర్థవంతమైన పాటలని మన మెదళ్లలోకి జ్ఞాన గంగలా ప్రవహింపజేసిన కవీశ్వరుడు సీతారాముడు. ఎన్నో సంవత్సరాల ప్రయాణం మాది. వేటూరికి సహాయకుడిగా వచ్చి.. అతి తక్కువ కాలంలో శిఖర స్థాయికి చేరుకున్న సరస్వతీ పుత్రుడు. మా ఇద్దరి కలయికలో ఎన్నో పాటలు ప్రాణం పోసుకున్నాయి. తన పాటల ‘‘పదముద్రలు’’ నా హార్మోనియం మెట్లపై నాట్యం చేశాయి. ‘రుద్రవీణ’, ‘స్వర్ణకమలం’, ‘బొబ్బలిరాజా’.. ఇలా ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు, రేపు రాబోయే ‘రంగమార్తాండ’ కూడా. సీతారాముడు రాసిన పాటలకు నువ్వా నేనా అంటూ పోటీపడుతూ సంగీతాన్ని అందించిన సందర్భాలెన్నో’’

‘‘సీతారాముడు.. పాటలతో ప్రయాణం చేస్తాడు. పాటతో అంతర్యుద్ధం చేస్తాడు. పాటలో అంతర్మథనం చెందుతాడు. పాటని ప్రేమిస్తాడు. పాటతో రమిస్తాడు. పాటని శాసిస్తాడు. పాటని పాలిస్తాడు. పాట నిస్తాడు. మన భావుకతకి భాషను అద్ది, మనకు తెలిసిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు. అందుకే సీతారాముడి పాటలు ఎప్పటికీ గుర్తుంటాయి. తన సాహిత్యం నాతో ఆనంద తాండవం చేయించింది. శివ తాండవం చేయించింది. ‘‘వేటూరి’’ నాకు తెలుగు సాహిత్యం మీద ప్రేమను పెంచితే.. ‘‘సీతారాముడు’’ నాకు తెలుగు సాహిత్యం మీద గౌరవాన్ని పెంచాడు. ధన్యోస్మి మిత్రమా..!! ఇంత త్వరగా సెలవంటూ శివైక్యం చెందడం మనస్సుకు బాధగా ఉంది. ‘‘పాటకోసమే బతికావు.. బతికినంత కాలం పాటలే రాశావు’’ ఆ ఈశ్వరుడు నీకు సద్గతిని ప్రసాదించాలని కోరుకుంటున్నా’’ అని ఇళయరాజా భావోద్వేగానికి గురయ్యారు.

ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు.. సిరివెన్నెల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. ‘‘కాలం సిరివెన్నెలని తీసుకెళ్లగలదు. కానీ.. ఆయన కలం నుంచి వచ్చిన మాటకి, పాటకి మరణం ఎక్కడిది. తెలుగు భాష ఉన్నంత కాలం సిరివెన్నెల పాటలతో నింపిన స్ఫూర్తి ప్రతీ ఒక్కరి మదిలో కదులుతూనే ఉంటుంది. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని ట్వీట్‌ చేశారు.

Read latest Cinema News and Telugu News

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని