Shyam Singha Roy: ‘సిరివెన్నెల’తో పనిచేయడం వెలకట్టలేని జ్ఞాపకం: మిక్కీ జే మేయర్‌

‘సిరివెన్నెల’ లాంటి లెజెండ్‌తో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం నిజంగా తన అదృష్టమని యువ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌(Mickey J Meyer) అన్నారు.

Published : 13 Dec 2021 22:41 IST

హైదరాబాద్‌: ‘సిరివెన్నెల’ లాంటి లెజెండ్‌తో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం నిజంగా తన అదృష్టమని యువ సంగీత దర్శకుడు మిక్కీ జే మేయర్‌ (Mickey J Meyer) అన్నారు. ఆయన సంగీతం అందించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’ (Shyam Singha Roy). నాని (Nani) కథానాయకుడు. రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకుడు. సాయిపల్లవి (Sai pallavi), కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్‌ కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మిక్కీ జే మేయర్‌ పంచుకున్న విశేషాలు..

* ‘శ్యామ్ సింగరాయ్’ కథ రెండు టైమ్ పీరియడ్స్‌కు సంబంధించింది. 70వ దశకంలోని వాతావరణాన్ని ఇందులో చూపించనున్నారు. దానికి తగ్గట్టే సంగీతం, నేప‌థ్య సంగీతం అందించా.

* నాకు భారతీయ సంగీత వాయిద్య పరికరాలపై మంచి నాలెడ్జ్ ఉంది. కాబ‌ట్టి ఆ కాలంలో ఉపయోగించిన వాయిద్యాలనే ఇందులో ఎక్కువ‌గా వాడాను. కోల్‌కతా నేపథ్యం, కథకు తగ్గట్టుగానే మ్యూజిక్ ఇచ్చాను. టాలీవుడ్‌లో ఇలాంటి నేపథ్యంలో రాబోతోన్న మొదటి సినిమా ఇదే అవుతుంది.

* దర్శకుడు రాహుల్ ఈ క‌థ చెప్పగానే చాలా కొత్తగా ఫీలయ్యా. ఇలాంటి కథకు మంచి సంగీతం అందించే అవకాశం పుష్కలంగా ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా విడుదలయ్యాక పాటలు, నేపథ్య సంగీతానికి ఇంకా మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నా!

* సిరివెన్నెల లాంటి లెజెండ్‌తో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం నిజంగా నా అదృష్టం. ఆయ‌న‌తో గ‌డిపిన సమయం వెలకట్టలేని జ్ఞాపకం. ఈ సినిమా కోసం ఆయ‌న రెండు పాటలు రాశారు. అందులో సిరివెన్నెల‌ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఆయన రాసిన మరో పాట త్వరలోనే విడుదలవుతుంది. ఆ పాట‌లో సిరివెన్నెల సాహిత్యం అద్భుతంగా ఉంటుంది.

* పాట ఏ సింగ‌ర్‌తో పాడించాలి అనే విష‌యంలో హీరో, దర్శకుల నుంచి నేను సలహాలు తీసుకుంటా. కానీ, తుది నిర్ణయం మాత్రం నాదే. ఎందుకంటే ఆ పాట ట్యూన్ చేసేట‌ప్పుడే అది ఎవ‌రు పాడితే బాగుంటుందనేది నిర్ణయించుకుంటా.

* ప్రస్తుతం నందినీరెడ్డి, స్వప్నా దత్ కాంబినేషన్‌లో ఓ సినిమాకు సంగీతం అందిస్తున్నాను. అలాగే శ్రీవాస్-గోపీచంద్ కాంబినేష‌న్‌లో ఒక  ప్రాజెక్ట్ ఉంది. దిల్ రాజుగారి బ్యానర్‌లో మరో సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నా. వీటితో పాటు ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ప్రైవేట్ ఆల్బమ్స్‌ కూడా చేస్తున్నాను.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని