Akhanda: ‘అఖండ’.. మునుపెన్నడూ చూడని కథ: తమన్‌

సంగీత దర్శకుడు తమన్‌ ఇంటర్వ్యూ. బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ గురించి తమన్‌ పంచుకున్న విశేషాలివీ...

Published : 23 Nov 2021 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘‘అఖండ’ సినిమాకు సంగీతం అందించేందుకు రీసెర్చ్‌ చేశా. ఇలాంటి కథ ఇంతకుమందెన్నడూ రాలేదు’’ అని సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు. బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రగ్యా జైస్వాల్ కథానాయిక. జగపతిబాబు, శ్రీకాంత్‌ కీలక పాత్రలు పోషించారు. ద్వారకా క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న విడుదలకానుంది. ఈ సందర్భంగా తమన్‌ మీడియాతో మాట్లాడారు. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  

ఇలాంటి కథ చూసుండరు..

ఈ సినిమా కోసం చాలా శ్రమించా. ఇందులోని అఘోరా పాత్రకు నేపథ్య సంగీతం అందించేందుకు రీసెర్చ్ చేశా. అనుకున్నట్టుగానే సంగీతం అద్భుతంగా వచ్చింది. టైటిల్‌ సాంగ్‌ బాగుందని బాలకృష్ణ ప్రశంసించారు. నా కెరీర్‌లో ఈ సినిమాకి ది బెస్ట్ వర్క్‌ చేశానని చెప్పొచ్చు. బోయపాటి శ్రీను, బాలకృష్ణ.. ఈ ఇద్దరితో విడివిడిగా పనిచేస్తేనే ఏదో తెలియని హుషారు వస్తుంది. అలాంటిది ఈ ఇద్దరి కాంబినేషన్‌లో కలిసి పనిచేయడం కొత్త అనుభూతినిచ్చింది. ‘అఖండ’ కథ ‘నెవర్‌ బిఫోర్.. నెవర్‌ అగైన్’ అనిపిస్తుంది. బాలకృష్ణ అభిమానులకు కావాల్సిన అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉన్నాయి. బాలకృష్ణ నటనలో విజృంభించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను మధ్య మంచి అనుబంధం ఉంది. వారి కాంబినేషన్‌లో ఏ సినిమా చేసినా అది సూపర్‌ హిట్టే!  ఈ సినిమా చూస్తే అఘోరాలపై స్పష్టత వస్తుంది. వారెందుకు అలా ఉంటారో అర్థమవుతుంది.

దాని గురించి ఆలోచించను..

ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది. నా విషయానికొస్తే.. సుమారు 120 మంది గాయకులతో చాలా ప్రయోగాలు చేశా. సినిమాకు ఏం కావాలో అదే ఇచ్చాను. ఏ పాటకు ఏ సింగర్‌ న్యాయం చేయగలరో వారినే ఎంపిక చేసుకున్నా. ఈ సినిమానే కాదు నా ప్రతి సినిమాకూ అలానే చేస్తుంటా. రెమ్యునరేషన్‌ గురించి ఆలోచించి ఒకరు పాడాల్సిన పాటని మరొకరితో పాడించను. శంకర్‌ మహదేవన్‌ శివుడి గురించి ఎన్నో పాటలు పాడారు. ఆయన స్వరమైతేనే బాగుంటుందని టైటిల్‌ గీతాన్ని పాడించాం. ఈ పాటను కంపోజ్ చేసేందుకు సుమారు నెల సమయం పట్టింది. సినిమాలో ఓ గొప్ప సన్నివేశం పూర్తయిన వెంటనే ఆ పాట వస్తుంది.

ఉత్సాహమిచ్చారు..

దర్శకుడు కథ చెప్పినప్పుడే నాకు ఉత్సాహం కలిగింది. బాలకృష్ణతోపాటు జగపతిబాబు, శ్రీకాంత్‌ తదితర సీనియర్‌ నటులుండటంతో అది ఇంకాస్త ఎక్కువైంది. బాలకృష్ణ గారు సైన్స్‌ను నమ్మే వ్యక్తి. అందరితోనూ ఎంతో కలివిడిగా ఉంటారు. ఆయనతో మరో సినిమా చేస్తున్నా.

ప్రచారంలో మార్పు..

సినిమా ప్రచారంలో మార్పులొచ్చాయి. ఒకప్పుడు అన్ని పాటలూ ఒకేసారి విడుదలైతే ఈ రోజుల్లో ఒక్కో పాట ఒక్కోసారి విడుదలవుతుంది. ఆడియో కంపెనీలూ ఈ ట్రెండ్‌కే మొగ్గుచూపుతున్నాయి. లిరికల్‌ వీడియోల ద్వారా గాయకులు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. ఈ విషయంలో దర్శకులు, హీరోలకు థ్యాంక్స్‌ చెప్పాలి. నం.1 పొజిషన్‌ అనే దాన్ని నేను పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్లిపోతానంతే’’ అని తమన్‌ చెప్పుకొచ్చారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని