
Lakshya Review: రివ్యూ: లక్ష్య
చిత్రం: లక్ష్య; నటీనటులు: నాగశౌర్య, కేతిక శర్మ, సచిన్ ఖేడ్కర్, జగపతిబాబు, రవిప్రకాష్, సత్య, శత్రు, వైవా హర్ష, తదితరులు; సంగీతం: కాల భైరవ; కూర్పు: జునైద్; ఛాయాగ్రహణం: రామ్‌రెడ్డి; దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి; నిర్మాతలు: నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్‌రావు,శరత్ మరార్; విడుదల తేదీ: 10-12-2021
కొత్తదనం నిండిన కథలను అందిపుచ్చుకోవడంలో ముందుండే యువ కథానాయకుల్లో నాగశౌర్య ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరిత కథలతో ప్రయోగాలు చేస్తుంటారు. ఇటీవలే ‘వరుడు కావలెను’తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడీ జోష్‌లోనే ‘లక్ష్య’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. విలువిద్య నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ డ్రామా చిత్రమిది. సంతోష్ జాగర్లపూడి తెరకెక్కించారు. చిత్ర కథానేపథ్యం కొత్తది కావడం.. ప్రచార చిత్రాలు, పాటలు ఆసక్తికరంగా ఉండటంతో సినీప్రియుల దృషి ఈ చిత్రంపై పడింది. మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుందా?శౌర్య ఖాతాలో మరో విజయం చేరిందా?
కథేంటంటే: పుట్టుకతోనే విలువిద్యను ఒంటబట్టించుకున్న కుర్రాడు పార్థు (నాగశౌర్య). ఆ ప్రతిభ తన తండ్రి వాసు (రవిప్రకాష్) నుంచి వారసత్వంగా వచ్చింది. అతనూ విలువిద్యలో ఆరితేరిన క్రీడాకారుడే. ఆర్చరీలో వరల్డ్ ఛాంపియన్ కావాలన్నది తన కల. కానీ, అనుకోకుండా రోడ్డు ప్రమాదంలో కన్నుమూస్తాడు. దీంతో తన కొడుకు కలను మనవడి ద్వారా తీర్చుకోవాలని తాపత్రయపడతాడు వాసు తండ్రి (సచిన్ ఖేడ్కర్). పార్థు కూడా తన తండ్రీ, తాతల కలను నెరవేర్చడమే లక్ష్యంగా పెట్టుకుంటాడు. తన లక్ష్య సాధన కోసం ప్రత్యేక శిక్షణ తీసుకునేందుకు కురుక్షేత్ర ఆర్చరీ అకాడమీలో చేరతాడు. అదే అకాడమీలో రాహుల్ (శత్రు) కూడా విలువిద్యలో శిక్షణ తీసుకుంటుంటాడు. వరుసగా రెండు సార్లు ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్‌గా నిలిచిన అతనికీ వరల్డ్ ఛాంపియన్‌గా నిలవాలనే కోరిక ఉంటుంది. ఆర్చరీలో తనని కొట్టేవాడే లేడని విర్రవీగే అతనికి పార్థు రూపంలో గట్టి పోటీ ఎదురవుతుంది. స్టేట్ ఆర్చరీ ఛాంపియన్ షిప్‌లో అతని చేతిలో ఓసారి ఓటమి పాలవుతాడు. దీంతో ఆ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన రాహుల్.. ఎలాగైనా పార్థు లక్ష్యాన్ని దెబ్బతీయడానికి ప్రణాళిక రచిస్తాడు. అదే సమయంలో పార్థు తాత చనిపోవడంతో మానసికంగా బాగా కుంగిపోతాడు. ఆటలో లయ తప్పుతాడు. ఇదే అవకాశంగా భావించిన రాహుల్ అతన్ని డ్రగ్స్‌కు అలవాటు పడేలా చేస్తాడు. ఆ తర్వాత జరిగే ఓ సంఘర్షణలో పార్థు చేతికి తీవ్ర గాయమవుతుంది. దీంతో ఆర్చరీకే దూరమవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? పార్థు తన లక్ష్య సాధన కోసం తిరిగి విల్లు చేత బట్టాడా? ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకున్నాడా? ఈ లక్ష్య సాధనలో పార్థసారథి (జగపతిబాబు).. పార్థుకు ఎలా సాయపడ్డాడు? రితిక(కేతిక శర్మ)తో పార్థు ప్రేమాయణం ఏ కంచికి చేరింది? అన్నది తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే: క్రీడా నేపథ్య చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమీ కాదు. క్రికెట్.. హాకీ.. బాక్సింగ్.. రన్నింగ్.. ఇలా రకరకాల ఆటల నేపథ్యంతో ఎన్నో సినిమాలొచ్చాయి. వీటిలో చాలా వరకు మంచి విజయాల్ని అందుకున్నాయి. ఇప్పటి వరకు ఇన్ని కథలొచ్చినా ఆర్చరీ నేపథ్యంలో ఇంత వరకు ఒక్క చిత్రమూ రాలేదు. ఇప్పుడా లోటును ‘లక్ష్య’తో తీర్చేశాడు నాగశౌర్య. నిజానికి విలువిద్య అన్నది మనదేశంలో పుట్టిన ఆటే అయినా.. ప్రజల్లో ఆదరణ తక్కువే. మిగిలిన క్రీడల్లో ఉన్నంత డ్రామా, సంఘర్షణ ఇందులో కనిపించదు. అందుకే ఈ ఆటవైపు చూసే వారి సంఖ్య తక్కువే. సినిమా వాళ్లూ ఈ తరహా స్పోర్ట్స్ డ్రామాల వైపు అంతగా ఆసక్తి చూపించకపోవడానికి ఇదీ ఓ కారణమే. కానీ, ఇలాంటి ఆటను కథాంశంగా మలుచుకొని సినిమా చేసిన దర్శకుడు సంతోష్.. హీరో నాగశౌర్య సాహసాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. అన్ని స్పోర్ట్స్ డ్రామాల్లో లాగే ఇందులోనూ అనేక రాజకీయాలు.. గెలుపోటములు.. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు.. అన్నీ కనిపిస్తాయి. కానీ, ఆట చుట్టూ బలమైన డ్రామా పండలేదు. ఆటలో సరైన సంఘర్షణ, మలుపులు కనిపించలేదు. దీంతో సినిమా ఆద్యంతం చప్పగా సాగుతున్న అనుభూతినిస్తుంది.
ప్రధమార్ధంలో ఒలింపిక్స్ అర్హత పోటీలు చూపించడం.. అదే సమయంలో పార్థు మరో చోట గాయాలతో పడిపోయి ఉండటం వంటి సన్నివేశాలతో సినిమా ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది. ఆ వెంటనే ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలతో పార్థు బాల్యాన్ని, అతని నేపథ్యాన్ని చకచకా పరిచయం చేసి ప్రేక్షకుల్ని నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకుడు. పార్థు కురుక్షేత్ర ఆర్చరీ అకాడమీలోకి అడుగు పెట్టాకే కథకు కాస్త ఊపొచ్చినట్లవుతుంది. అయితే ఓవైపు తెరపై సన్నివేశాలన్నీ చకచకా కదిలిపోతున్నా.. వాటిలో సరైన ఫీల్ లేకపోవడంతో ప్రేక్షకులు ఏ దశలోనూ కథతో కనెక్ట్ అవ్వరు. ముఖ్యంగా ఆట చుట్టూ తిరగాల్సిన కథ తాత-మనవళ్ల అనుబంధాల చుట్టూ తిరగడం.. అందులోనూ సరైన భావోద్వేగాలు పండకపోవడంతో సినిమా మరింత చప్పగా మారిపోతుంది. ఇక పార్థు ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్‌గా నిలిచిన తీరు మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. ఆటలో ఎక్కడా సంఘర్షణ కనిపించదు. పార్థు తాత మరణం తర్వాత కథలో కాస్త వేగం పెరుగుతుంది. ఇక విరామ సమయానికి ముందు రాహుల్ గ్యాంగ్‌తో పార్థు తలపడే సన్నివేశాలు.. చేతి గాయంతోనే వచ్చి ఒలింపిక్స్ అర్హత పోటీలో పాల్గొనే సన్నివేశాలు సినిమాకి ఊపు తీసుకొస్తాయి. సరిగ్గా విరామ సమయానికి పార్థు స్టేడియంలోనే స్పృహతప్పి పడిపోవడం.. అతను డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు ఎదురవడంతో తర్వాత ఏం జరగబోతుందా? అన్న ఆసక్తి మొదలవుతుంది. ఇక ద్వితీయార్ధంలో పార్థు తన లక్ష్య సాధన కోసం తిరిగి ఎలా సన్నద్ధమయ్యాడు.. ఈ క్రమంలో పార్థసారధి అతనికెలా సాయపడ్డాడన్నది ఆసక్తికరంగా చూపించారు. అది మరీ సినిమాటిక్‌గా ఉన్నా.. ప్రధమార్ధంతో పోల్చితే కథ కాస్త రసవత్తరంగా సాగడానికి సాయపడుతుంది. ఇక ఎయిట్ ప్యాక్ లుక్‌తో పార్థు పాత్ర కనిపించే సన్నివేశాలు, ముగింపునకు ముందొచ్చే రెండు పోరాట ఘట్టాలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆఖర్లో పార్థు ప్రపంచ ఆర్చరీ ఛాంపియన్‌గా నిలిచే ఎపిసోడ్ ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే: పార్థు పాత్రలో నాగశౌర్య చక్కగా ఒదిగిపోయారు. లుక్ పరంగా చక్కటి వేరియేషన్ చూపించారు. ముఖ్యంగా ఎయిట్ ప్యాక్ లుక్ కోసం ఆయన పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. రితికా పాత్రలో కేతిక అందంగా కనిపించింది. తెరపై అలా వచ్చిపోతుంటుందే తప్ప ఆమెకు నటించే ఆస్కారం పెద్దగా దొరకలేదు. పార్థుతో ఆమె ప్రేమ కథ చాలా పేలవంగా ఉంటుంది. సచిన్, జగపతిబాబుల పాత్రలు సినిమాకి బలాన్నిచ్చాయి. సంతోష్ ఎంచుకున్న కథలో కొత్తదనమున్నా.. దాన్ని ఆసక్తికరంగా మలచడంలో తడబడ్డాడు. ఆటలో ఎక్కడా బలమైన సంఘర్షణ కనిపించలేదు. వైవా హర్ష, సత్య పాత్రలు ప్రధమార్ధంలో ఒకట్రెండు సన్నివేశాల్లో నవ్వించాయి. కాల భైరవ నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. పాటలు వినసొంపుగా ఉన్నా.. మరీ గుర్తుపెట్టుకునేలాగైతే లేవు. రామ్‌రెడ్డి ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపించాయి.
బలాలు
+ కథా నేపథ్యం
+ నాగశౌర్య, జగపతిబాబు నటన
+ విరామ, పతాక సన్నివేశాలు
బలహీనతలు
- సాదాసీదాగా సాగే కథనం
- ఆటలో సంఘర్షణ లేమి
చివరగా: లక్ష్యం సరిగా గురి కుదరలేదు!
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.